Niramala Sitharaman Agriculture Budget 2024: బడ్జెట్ - 2024లో వ్యవసాయం, మహిళలు, యువతకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 'జై విజ్ఞాన్‌, జై కిసాన్‌, జై అనుసంధాన్‌' అన్నది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నూతన పరిజ్ఞానం, మార్కెట్‌ వ్యవస్థ అనుసంధానంతో వ్యవసాయ రంగాలకు కొత్త ఆదాయ మార్గాలు వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. మత్స్య, పశుపోషణ, పాడి మంత్రిత్వ శాఖకు రూ.7,105 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. పీఎం కిసాన్ సంపద యోజన ద్వారా 38 లక్షల మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరిందని.. 10 లక్షల మందికి ఉపాధి లభించిందని నిర్మల చెప్పారు. 'మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ యోజన' ద్వారా 2.4 లక్షల స్వయం సహాయక బృందాలు, వ్యక్తిగతంగా మరో 60 వేల మందికి రుణసాయం అందించామని అన్నారు. పంట కోతల అనంతరం నష్ట నివారణ, దిగుబడి, ఆదాయం పెంపునకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


పాడి రైతుల కోసం


పాడి రైతుల కోసం సమగ్ర కార్యక్రమం చేస్తామని తెలిపారు. 'ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు భారత్. కానీ ఇక్కడ పాడి పశువుల ఉత్పాదకత లేదు. పాడి రైతులను ఆదుకునేందుకు సమగ్ర కార్యక్రమాన్ని రూపొందిస్తాం. అలాగే, ఫుట్ అండ్ మౌత్ వ్యాధిని నియంత్రించడానికి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రీయ గోకుల్ మిషన్, రాష్ట్రీయ లైవ్ స్టోక్ మిషన్, డెయిరీ ప్రాసెసింగ్, పశు సంవర్ధక శాఖల మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి వంటి పథకాలను విజయవంతం చేయడం ద్వారా ఈ కార్యక్రమం రూపుదిద్దుకోనుంది.' అని వివరించారు.


సీఫుడ్ ఎగుమతులు రెట్టింపు


అలాగే, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపైనా తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. మత్స్యకారులను ఆదుకోవాల్సిన ఆవశ్యకతను అర్థం చేసుకుని ప్రత్యేక మత్స్య శాఖను ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. సీఫుడ్ ఎగుమతులు కూడా 2013-14 నుంచి రెట్టింపయ్యాయని వివరించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అమలుతో వారి ఆర్థిక వృద్ధి, జీవన విధానం మెరుగుపడినట్లు పేర్కొన్నారు. ఆక్వా కల్చర్ ఉత్పాదకతను ప్రస్తుతం ఉన్న హెక్టారుకు 3 టన్నుల నుంచి 5 టన్నులకు పెంచుతామని చెప్పారు. ఎగుమతులను రెట్టింపు చేసి రూ.లక్ష కోట్లకు చేర్చుతామని తెలిపారు. సమీప భవిష్యత్తులో ఈ రంగంలో 55 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టిస్తామని అన్నారు. 5 సమీకృత ఆక్వాపార్కులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే, 2022లో ప్రకటించిన 'ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్'లో భాగంగా ఆవ, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తామన్నారు.


11.8 కోట్ల మంది రైతులకు సాయం


నానో యూరియాను విజయవంతంగా స్వీకరించిన తర్వాత, అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటలపై నానో డీఏపీని ఉపయోగిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అతి పెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) ఒకటి అని చెప్పారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు 3 విడతల్లో ఎకరాకు రూ.6 వేల నగదు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2018 డిసెంబర్ నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ఈ పథకం కింద 11.8 కోట్ల మంది రైతులకు ప్రభుత్వ సాయం అందించామని వివరించారు. అలాగే, పీఎం ఫసల్ యోజన ప్రయోజనాన్ని నాలుగు కోట్ల మంది రైతులకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.


నానో డీఏపీ విస్తరణ


వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి కోసం పబ్లిక్, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్లు సీతారామన్ తెలిపారు. సేకరణ, ఆధునిక నిల్వ వసతులు, సమర్థ సరఫరా వ్యవస్థ, ప్రాథమిక - సెకండరీ ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి అంశాల్లో పెట్టుబడులు ఆహ్వానిస్తామన్నారు. నానో యూరియా విధానం విజయవంతమైన నేపథ్యంలో నానో డీఏపీని అన్ని అగ్రో - క్రైమేటిక్ జోన్లకు విస్తరిస్తామని చెప్పారు. (నానో డీఏపీ - సాధారణంగా నానో డీఏపీ బస్తాల్లో గుళికల రూపంలో ఉంటుంది. అదే నానో డీఏపీతో ద్రవ రూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఎకరాకు అర లీటర్ నానో డీఏపీసరిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తల అంచనా. రైతులు ఎకరానికి 2 బస్తాల డీఏపీ వినియోగిస్తుండగా.. సగటున రూ.3 వేలు ఖర్చవుతుంది. కాగా, నానో డీఏపీ అర లీటర్ సీసా ధర రూ.600 ఉంటుందని అంచనా).


ఆర్థిక సాయం పెంచలేదు


ఎన్నికల ముందు ప్రవేశ పెడుతున్న బడ్జెట్ లో పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని ఏటా రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచుతారని అంచనా వేశారు. కానీ, గురువారం బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. అలాగే, పంట రుణాల లక్ష్యాన్ని రూ.22 - రూ.25 లక్షల కోట్లకు పెంచుతారని ఆశించినా దానిపైనా విత్త మంత్రి ఎలాంటి ప్రకటనా చేయలేదు.