Union Budget 2025: బంగారం కోనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆభరణాలకు సంబంధించి ధరలు తగ్గుతాయనేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025 ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. ఆభరణాల వస్తువులు, జ్యువెలరీకి సంబంధించిన ఐటెమ్ కోడ్ 7113 కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఆభరణాలు, వాటి భాగాలపై గతంలో నిర్ణయించిన 25 శాతం సుంకాన్ని 20 శాతానికి తగ్గిస్తామని సీతారామన్ చెప్పారు. ఈ నిర్ణయం ఫిబ్రవరి 2, 2025 నుంచి అమలులోకి రానుందని బడ్జెట్ స్పీచ్‌లో స్పష్టం చేశారు.
నేటి నుంచి దిగిరానున్న బంగారం, ప్లాటినం ధరలు
బంగారం వాటి సంబంధిత ఉత్పత్తులతో పాటు ప్లాటినం వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. ప్లాటినంపై కస్టమ్స్ ట్యాక్స్ 6.4 శాతానికి తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గతంలో ఇది 25 శాతంగా ఉండేది. కేంద్రం తాజా నిర్ణయాలతో జ్యువెలరీ విక్రయాలు దేశంలో ఊపందుకోనున్నాయి. అదే సమయంలో ఫిబ్రవరి 2 నుంచి బంగారం, ఆభరణాల ధరలు దిగిరానున్నాయి. భారత్ లాంటి దేశాలలో బంగారం, ఇతర ఆభరణాల వినియోగం అధికం. వీటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లను ప్రోత్సహించి నగదు మార్కెట్లోకి రావాలని ఆర్థిక మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
వుమ్మిడి గోల్డ్ జ్యువెలర్స్ మేనేజింగ్ పార్టనర్ అమరేంద్ర వుమ్మిడి బడ్జెట్ పై మాట్లాడారు. “మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించేందుకు ఆదాయపు పన్నును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. ఇది మరింత పొదుపు చేసేందుకు వీలు కల్పిస్తుంది. ప్రజల కొనుగోలు శక్తిని సైతం పెంచుతుంది. ప్లాటినంపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 25 శాతం నుండి 6.4 శాతానికి తగ్గించడం శుభపరిణామం. ఆభరణాల పరిశ్రమకు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంది. కస్టమ్స్ సుంకం తగ్గింపుతో ప్లాటినం ధర దిగొస్తుంది. నైపుణ్యం పెంచేందుకు కోసం జాతీయ కేంద్రాల కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన ఎంతో మేలు చేస్తుంది’ అన్నారు.
వేగంగా అధివృద్ధి చెందుతున్న భారత్
"ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత 10 ఏళ్లలో మన అభివృద్ధి, గణాంకాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం తీసుకునే నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. భారత్‌పై ప్రపంచ వ్యాప్తంగా నమ్మకం పెరిగింది. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో కేంద్రం ఎన్నో వర్గాలకు మేలు చేస్తోంది. రాబోయే ఐదు సంవత్సరాలు భారత్‌కు మరింత కీలకం. పలు రంగాల్లో పెట్టుబడులు ప్రోత్సహిస్తూనే, ఆదాయపు పన్ను పరిమితి రూ.12 లక్షలకు పెంచడం ఉద్యోగస్తులకు భారీ ఊరట కలిగిస్తుందని’’ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
Also Read: New Income Tax Slabs 2025: ఆదాయ పన్ను మినహాయింపు.. ఆదాయం 12 లక్షలు దాటినా కానీ అద్భుతమైన ప్రయోజనమే!