Niramala Sitharaman Saree Special: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వరుసగా ఏడోసారి పార్లమెంట్‌లో మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, బడ్జెట్ కేటాయింపులు, కొత్త ప్రకటనలు వీటిపైనే కాకుండా ఆమె ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. కీలకమైన బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో దేశ సంస్కృతీ, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నిర్మలమ్మ చీరలను ఎంచుకుంటారు. చేనేత చీరలంటే ఎక్కువగా ఇష్టపడే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ఎంచుకున్నారు. తెలుపు రంగు, బంగారు మోటిఫ్‌లతో ఉన్న మెజెంటా బోర్డర్ కలగలిసిన సిల్క్ చీరలో ఆమె కనిపించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన కాంత ఎంబ్రాయిడరీతో తయారు చేసిన టస్సార్ సిల్క్ శారీ ఇది. ఈ చీర ప్రత్యేక ఆకృతి, బంగారు మెరుపుతో ఎంతో స్పెషల్‌గా కనిపించారు. గోల్డెన్ బ్యాంగిల్స్, చైన్, చిన్న చెవిపోగులు ధరించగా.. సంప్రదాయ హస్తకళ, ప్రాంతీయ కళాత్మకత ఉట్టిపడింది.




గత బడ్జెట్ సమయాల్లోనూ..


గత ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనూ నిర్మలమ్మ చీరల విషయంలో ప్రత్యేకత చాటుకున్నారు. 2019లో తొలిసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతారామన్.. ఏటా బడ్జెట్ రోజున తాను ధరించే చీరల విషయంలోనూ సంప్రదాయత, సంస్కృతీ ప్రతిబింబించేలా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనూ.. కాంతా చీరలో కనిపించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ప్రతీకగా 'రామా బ్లూ' రంగు చీరను ధరించారు. ఈ చేనేత చీరపై గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతి ఉట్టిపడేలా ఎంబ్రాయిడరీ ఉంది.



  • 2023లో బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్‌లో ఎరుపు రంగు చీరతో కనిపించారు. 

  • 2022లో ఒడిశాకు చెందిన చేనేత చీర మెరూన్ రంగు శారీని ధరించారు.

  • 2021లో ఎరుపు - గోధుమ రంగు కలగలిపిన భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లి శారీ సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందింది.

  • 2020లో 'ఆస్పిరేషనల్ ఇండియా' థీమ్‌కు అనుగుణంగా నీలం రంగు అంచులో పసుపుపచ్చ - బంగారు వర్ణంతో ఉన్న చీరకట్టులో మెరిశారు.

  • 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర ధరించి ప్రత్యేకత చాటుకున్నారు.


Also Read: Union Budget 2024: విద్యార్థులకు రూ.10 లక్షల వరకూ లోన్, కీలక ప్రకటన చేసిన నిర్మలా సీతారామన్