Prorities In Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, యువతకు ఉద్యోగ కల్పన - నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, ఇంధన భద్రత, పట్టణాభివృద్ధి, మౌలిక రంగం, పరిశోధన - ఆవిష్కరణలు, తయారీ - సేవలు, భవిష్యత్ సంస్కరణలు వంటి అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించారు. ఈ ప్రాధామ్యాలపై భవిష్యత్ బడ్జెట్స్ కూడా ఆధారపడి ఉంటాయని తెలిపారు. వీటిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు (MSME), మధ్య తరగతి రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఎక్కువగా మహిళలు, రైతులు, పేదలు, యువతకు మేలు చేకూర్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.


యువతకు ప్రాధాన్యం


రాబోయే ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని నిర్మలమ్మ తెలిపారు. అలాగే, 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేలా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. భారతీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకూ విద్యా రుణాలు ఇస్తామని అన్నారు. 


విద్య, నైపుణ్యాభివృద్ధి - రూ.1.48 లక్షల కోట్లు


ఈసారి బడ్జెట్‌లో విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం అధికంగా నిధులు కేటాయించారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఇందు కోసం రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 


రైతులు, మహిళల కోసం


బడ్జెట్‌లో వ్యవసాయం, మహిళ, మౌలిక సదుపాయాల కల్పన కోసం నిర్మలమ్మ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. కూరగాయల ఉత్పత్తి పెద్దఎత్తున చేపట్టేలా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తామన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, మహిళలు, బాలికల కోసం రూ.3 లక్షల కోట్లతో పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు.