Budget 2023: 

ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో సరికొత్త ఆదాయపన్ను విధానాన్ని తీసుకొచ్చింది. మినహాయింపులు, డిడక్షన్లు లేకుండా తక్కువ పన్ను రేట్లను అమలు చేసింది. అయినా అనుకున్న స్థాయిలో దీనిని ఎవరూ ఎంచుకోవడం లేదు. అందుకే ఈ వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మార్పులు అవసరం

సరికొత్త పన్ను విధానంలో పన్ను రేట్లను తగ్గించారు. బదులుగా తక్కువ మినహాయింపులు కల్పించారు. 70 వరకు మినహాయింపుల్ని తొలగించారు. పాత విధానంలో 80సీ, 80 డీ, 24 మరికొన్ని పన్ను ఆదా సెక్షన్లు ఉన్నాయి. హెచ్‌ఆర్‌ఏ, ఇంటి లోన్లు, వడ్డీలపై మినహాయింపులు ఉన్నాయి. అందుకే పాత విధానానికే ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కనీస మినహాయింపు పరిధి పెంపు

సాధారణంగా రూ.2.5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నురేట్లు అమలు కావు. సెక్షన్‌ 87ఏ ప్రకారం రిబేట్‌ ఇవ్వడంతో రూ.5 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి తోడు సెక్షన్‌ 80సీలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపులు ఉపయోగించుకోవచ్చు. కొత్త విధానంలో అలా లేదు. రూ.2.5 లక్షల ఆదాయం దాటితే ఎంతో కొంత పన్ను చెల్లించక తప్పదు. దాంతో చాలామంది పాత విధానానికే ఓటేస్తున్నారు. దీనిని రూ.5లక్షల వరకు పెంచాలని నిపుణులు కోరుతున్నారు.

25 శాతం ఫిక్స్‌!

ప్రస్తుత గరిష్ఠ పన్ను రేటు 30 శాతం. దీనిని 25 శాతానికి తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. హాంకాంగ్‌, సింగపూర్‌ వంటి దేశాల్లో గరిష్ఠ రేట్లు 17 శాతం, 22 శాతంగా ఉన్నాయంటున్నారు. ఇప్పుడు రూ.15 లక్షలకు మించి ఎక్కువ ఆదాయం పొందుతున్నవారు 30% పన్ను చెల్లించాలి. కొత్త విధానంలో దీనిని 20 లక్షలకు పెంచితే లబ్ధి చేకూరుతుంది.

అసలు, వడ్డీపై మినహాయింపు

పాత విధానంలో గృహ రుణాల రుణం అసలుపై రూ.1.5 లక్షలు, వడ్డీపై రూ.2 లక్షల వరకు మినహాయింపు కల్పిస్తున్నారు. హౌజ్‌ రెంట్‌ అలవెన్స్‌ (HRA)నూ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కొత్త విధానంలో ఇలాంటివేమీ లేవు. అందుకే కొత్తగా ఇళ్లు కొంటున్నవారు, ఇప్పటికే కొన్నవారు పాత విధానానికే ఓటేస్తున్నారు. కొత్త విధానంలో వీటిని కల్పిస్తే పన్ను చెల్లింపు దారులను ఆకర్షించొచ్చు. అంతేకాకుండా పాత విధానంలో ఆరోగ్య బీమాపై రూ.25వేలు, తమపై ఆధారపడ్డ సీనియర్‌ సిటిజన్లకు చెల్లించిన పాలసీలపై రూ.50వేల వరకు ప్రయోజనం పొందొచ్చు. కొత్త విధానంలో వీటిని చేరిస్తే మరింత ప్రయోజనం లభిస్తుంది.

సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి: