బడ్జెట్‌ సమావేశాల్లో తొలి రెండు రోజులు శూన్య గంట, ప్రశ్నోత్తరాల సమయం ఉండదు. ఉభయ సభలకూ ఇది వర్తిస్తుంది. మూడో రోజు నుంచి లోక్‌సభ, రాజ్యసభలో  యథావిధిగా శూన్యగంట, ప్రశ్నోత్తరాల సమయం అమలవుతుంది.


జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతాయి. 31న పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ 2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అందుకే ఆ రెండు రోజులు మినహాయించి ఫిబ్రవరి 2 నుంచి జీరో అవర్‌, క్వశ్చన్‌ అవర్‌ ఉంటాయని పార్లమెంట్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.


'2022, జనవరి 31, ఫిబ్రవరి 1న శూన్య గంట, ప్రశ్నోత్తరాల గంట ఉండవు. 17వ లోక్‌సభ ఎనిమిదో సెషన్‌ తొలి రెండు రోజులు రాష్ట్రపతి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని సభ్యులకు తెలియజేస్తున్నాం' అని పార్లమెంట్‌ బులెటిన్‌ పేర్కొంది. 'ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అత్యవసర ప్రశ్నలను ఫిబ్రవరి 2 నుంచి శూన్య గంటలో లేవనెత్తొచ్చు' అని వెల్లడించింది. ఇందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ లేదా పార్లమెంట్‌ నోటీస్‌ ఆఫీస్‌కు సమాచారం అందించాలని తెలిపింది.


సాధారణంగా ఉభయ సభల్లో సమావేశం ఆరంభానికి ముందు జీరో అవర్‌, క్వశ్చన్‌ అవర్‌ నిర్వహించడం నిబంధనల్లో భాగం. ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం, ఆ తర్వాత శూన్య గంట ఉంటాయి. అందుకు భిన్నంగా రాజ్యసభలో మొదట ఉదయం 11 గంటలకు శూన్య గంట, తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది.


Also Read: Union Budget 2022 Telangana : ప్రతీ సారి నిరాశే.. ఈ సారైనా కనికరిస్తారా ? కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ఎన్నో ఆశలు !


Also Read: Budget 2022 Traditions: ఈ సారి బడ్జెట్‌ హల్వా లేదండోయ్‌! మారుతున్న సంప్రదాయాలు!!


కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌ సమావేశాలను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించబోతున్నారు. రోజుకు ఐదు గంటల చొప్పున రాజ్యసభ, లోక్‌సభను నడిపిస్తారు. ఉదయం పెద్దల సభ, మధ్యాహ్నం లోక్‌సభ సమావేశాలు ఉంటాయి. బడ్జెట్‌కు ముందు రోజున రెండు సభల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపడతారు. ఇక ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు లోక్‌ సభ సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు నిర్వహిస్తారు. ఉదయం రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి.


కొవిడ్‌ నేపథ్యంలో ఉభయ సభల్లో భౌతిక దూరాన్ని కట్టుదిట్టంగా అమలు చేయబోతున్నారు. రెండు సభల్లోని ఛాంబర్లు, గ్యాలరీల్లోనూ సభ్యులను కూర్చొబెట్టనున్నారు. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా సభ్యుల మధ్య దూరం ఉంటుంది. ఇక రాజ్యసభకు షెడ్యూలు ఇంకా ప్రకటించలేదు. అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సభ జరుగుతుందని తెలిసింది.