Budget 2024 Expectations: అతి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు, దేశ ఓటర్లను సమ్మోహితులను చేసేందుకు BJP ప్రభుత్వం ప్రయోగించే చివరి అస్త్రం బడ్జెట్‌ 2024. 


2024 ఫిబ్రవరి 1న, ఉదయం 11 గంటలకు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ (Finance Minister Nirmala Sitharaman) ప్రకటిస్తారు. వరుసగా ఆరో సారి బడ్జెట్ ప్రసంగం చేస్తారు. దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం గత బడ్జెట్స్‌లో మోదీ ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. అదే పంథాను మధ్యంతర బడ్జెట్‌లోనూ ‍‌(Interim Budget 2024) కొనసాగించే ఛాన్స్‌ కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థను మరింత సానబెట్టేందుకు విధానపరంగా నిర్ణయాలు ప్రకటించవచ్చు. ఇంకా.. రైతులు, మహిళలు, పేదలు, యువతపై ప్రేమ జల్లు కురిపించొచ్చు. 


ద్రవ్య లోటు (Fiscal Deficit)
కొవిడ్‌ సమయంలో, ద్రవ్య లోటు స్థూల దేశీయోత్పత్తిలో ‍‌(GDP) 9.2%కి పెరిగింది. దానికి కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయి, ద్రవ్య లోటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. బ్లూమ్‌బెర్గ్ సర్వే ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 5.9%కు పరిమితం కావచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.3%కు తగ్గొచ్చు. దీనిని 4.5%కి తీసుకురావాలన్నది సెంట్రల్‌ గవర్నమెంట్‌ టార్గెట్‌.


కొన్నేళ్లుగా ఆదాయ పన్ను‍‌ ‍‌(Income tax) వసూళ్లు పెరగడం వల్ల ద్రవ్య లోటు తగ్గుతూ వచ్చింది. వచ్చింది. 2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఆదాయపు పన్ను దాదాపు 30%, కార్పొరేట్ టాక్స్‌ 20%, జీఎస్‌టీ 10% ఎక్కువగా వసూలయ్యాయి.


దేశ రుణాలు ‍‌(Borrowings)
బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, 2024-25 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో భారతదేశ రుణాలు దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో ఇండియాను చేర్చిన నేపథ్యంలో, ఈ సంవత్సరం ఇండియన్‌ బాండ్స్‌కు విదేశీ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి, పెరుగుతున్న విదేశీ రుణాలు మన బాండ్ మార్కెట్‌ను ఇబ్బంది పెట్టవు.


మౌలిక సదుపాయాలు (Infrastructure)
రోడ్లు, ఓడరేవులు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ప్రభుత్వం, వీటిపై కేటాయింపులను ఏటా దాదాపు మూడింట ఒక వంతు పెంచింది. దీనివల్ల 7% పైగా ఆర్థిక వృద్ధి సాధ్యమైంది, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచింది. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం... మౌలిక సదుపాయాలపై చేసే ఖర్చు ఇప్పటికే బాగా పెరిగింది కాబట్టి, ఇకపై ఆ వేగం తగ్గొచ్చు. 


రైతులకు ఆర్థిక మద్దతు ‍‌(Financial support to farmers)
దేశంలో ధరలను తగ్గించడానికి గతేడాది కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. బియ్యం, గోధుమలు, పంచదార ఎగుమతులను నిషేధించింది. దీనివల్ల ధరలు అదుపులోకి వచ్చినా, రైతుల ఆదాయం తగ్గింది. ఈసారి బడ్జెట్‌లో, రైతులకు ఆర్థిక మద్దతు ఇచ్చేలా చర్యలు ఉంటాయని ఆర్థికవేత్తలు లెక్కలేశారు. 


గ్రామీణ భారతానికి మద్దతు (Support for rural India)
మన దేశంలోని 143 కోట్ల జనాభాలో దాదాపు 65% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తున్నారు. ప్రభుత్వాలను గద్దె నుంచి దించే, పైకి ఎక్కించే మెజారిటీ వర్గం ఇది. అందువల్ల, పల్లె ప్రజల కోసం మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ & ఎరువులపై సబ్సిడీలు పెంచింది. ఐదేళ్ల పాటు, 142 బిలియన్ డాలర్లతో ఉచిత ఆహార కార్యక్రమాన్ని పొడిగించింది. 2024 బడ్జెట్‌లో.. రైతులకు నగదు బదిలీ, అందరికీ ఇళ్లు, ఆరోగ్య బీమా వంటి కొన్ని పథకాలకు కేటాయింపులు పెరగొచ్చు. ఓవరాల్‌గా చూస్తే మాత్రం, సంక్షేమ కార్యక్రమాల కోసం చేసే వ్యయం తగ్గొచ్చు. 


గిగ్ వర్కర్స్‌ (gig workers‌) సహా అసంఘటిత రంగంలోకి వచ్చే కార్మికులందరి కోసం ఒక 'సామాజిక భద్రత నిధి'ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించొచ్చని కూడా సమాచారం.


మహిళా ఓటర్లు ‍‌(Women Voters)
ప్రభుత్వాల తలరాతలను నిర్ణయించడంలో మహిళా ఓటర్లది ప్రధాన పాత్ర. కుటుంబ ఖర్చులు కాస్త పెరిగినా, ప్రభుత్వంపై మహిళలకు మహా కోపం వస్తుంది. అందుకే, మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీ పెంచింది, తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చింది. ఇవిగాక, మహిళా ఓటర్ల మెప్పు కోసం బడ్జెట్‌లో మరిన్ని నిర్ణయాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో 75 లక్షల మంది కొత్త వాళ్లకు సబ్సిడీ వంట గ్యాస్ అందించే ఛాన్స్‌ ఉంది. భూమి ఉన్న మహిళా రైతులకు ఏడాదికి ఇచ్చే రూ.6,000ను రెట్టింపు చేసి రూ.12,000 చేస్తున్నామని కూడా సీతారామన్ ప్రకటించొచ్చేమో!.


అయితే.. వచ్చేది మధ్యంతర బడ్జెట్‌ కాబట్టి ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దని ఆర్థిక మంత్రి ఇప్పటికే స్పష్టంగా చెప్పారు.


మరో ఆసక్తికర కథనం: పసిడి ప్రతాపానికి జనం విలవిల - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే