BSNL 5G Services: భారతదేశంలో టెలికాం సేవలు అందిస్తున్న మూడు ప్రైవేట్‌ కంపెనీల్లో రెండు (రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌) ఇప్పటికే దేశంలోని ముఖ్య నగరాల్లో 5G సేవలను (5G services) ప్రారంభించాయి. 4G రేట్లకే 5G సేవలు అందిస్తూ, కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ దూసుకెళ్తున్నాయి. ఈ విషయంలో, అతి పెద్ద ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మాత్రం 4G సేవలను పూర్తి స్థాయిలో అందించడానికే ఇప్పటికీ ఆపసోపాలు పడుతోంది. 


ఈ నేపథ్యంలో, BSNLను కూడా 5G రేసులోకి తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 2024లో ఈ టెలికాం కంపెనీ 5G సేవలను ప్రారంభించేలా సిద్ధం చేస్తోంది. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ఈ విషయాన్ని వెల్లడించారు. ఒడిశాలో జియో, ఎయిర్‌టెల్‌ 5G సేవలను ఆయన ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా రాజధాని నగరమైన భువనేశ్వర్‌తో పాటు కటక్‌లోనూ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Bharati Airtel) 5G సర్వీసులు ప్రారంభమయ్యాయని, మరో రెండేళ్లలో ఒడిశా అంతటా ఈ వేగమంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. కొత్త ఏడాదిలో గణతంత్ర దినోత్సవం నాటికి (2023 జనవరి 26వ తేదీ లోపు) ఒడిశాలో 5G సేవలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని, అనుకున్న సమయానికి ఆ పని పూర్తయిందని తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించేందుకు వంద 4G టవర్లను సైతం ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.


ఈ సందర్భంగా, BSNL 5G సర్వీసుల గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 4G నెట్‌వర్క్‌ను 5Gలోకి మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. 4G నెట్‌వర్క్‌ను 5Gలోకి అప్‌గ్రేడ్‌ చేయడానికి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) & సి డాట్‌ (C-DOT) నేతృత్వంలోని కన్సార్టియంను BSNL షార్ట్‌ లిస్ట్ చేసిందని వెల్లడించారు. ఈ కన్సార్టియంతో BSNL కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం... ఆర్డర్ చేసిన తేదీ నుంచి దాదాపు ఒక సంవత్సరంలో, ఆ  4G నెట్‌వర్క్‌ మొత్తాన్ని 5Gలోకి అవి అప్‌గ్రేడ్‌ చేస్తాయని కేంద్ర మంత్రి వివరించారు. ఈ లెక్కన, BSNL వినియోగదారులకు 5G సేవలు ఇప్పట్లో లేనట్లే. మరో ఏడాది పాటు ఎదురు చూస్తే తప్ప BSNL 5G సర్వీసులను ఉపయోగించుకోలేరు.


5000 మొబైల్ టవర్లను ఏర్పాటుకు రంగం సిద్ధం
ఒడిశా రాష్ట్రంలో టెలికాం కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు, మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ. 5,600 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఒడిశాలోని 100 గ్రామాలను కవర్ చేస్తూ, 4G సేవల కోసం 100 టవర్లను ప్రారంభించామని వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి కమ్యూనికేషన్ సౌకర్యాలతో 5,000 మొబైల్ టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.