Market Correction: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎన్నికల తర్వాత సైతం భారీ లాభాలను కొనసాగిస్తూ అదే బుల్ జోరుతో ముందుకు సాగుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల ర్యాలీ కంటే ప్రస్తుతం మార్కెట్లలో పెరుగుదల ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు పూర్తైన తర్వాత ఇండియన్ మార్కెట్స్ స్థితిస్థాపకతతో ముందుకు సాగటంపై ప్రముఖ రీసెర్చ్ సంస్థ జెఫరీస్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది. 


ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4న బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 5.9 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లను సాధించటంలో విఫలం కావటంతో మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. ఇది సహజంగా ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేయలేదు. అయితే కూటమిలోని ఇతర పార్టీల సపోర్ట్ కారణంగా చివరికి మోదీ మూడోసారి ప్రధానిగా కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. బ్రోకరేజ్ జెఫరీస్ ప్రకారం మోదీ సర్కార్ మెుదటి రెండు సార్లు సొంతంగా అధికారంలోకి రావటానికి అవసరమైన సంఖ్యను కలిగి ఉండటంతో అప్పట్లో పాలసీ నిర్ణయాలపై పూర్తి స్వేచ్చ ఉందని పేర్కొంది. 


ఈ క్రమంలో రానున్న రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు కరెక్షన్ కి గురవుతాయని బ్రోకరేజ్ జెఫరీస్ వెల్లడించింది. ఈ పతనం ప్రభావం మిడ్ క్యాప్ షేర్లలో అధికంగా ఉంటుందని పేర్కొంది. వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లలో గత కొన్ని నెలలుగా పెట్టుబడిదారులు ఎక్కువగా పెద్ద కంపెనీల కంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీల్లోనే తమ డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫెడ్ హౌస్ నివేదికల ప్రకారం సైతం ఎక్కువ మంది ఇన్వెస్టర్ల డబ్బు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలకు చెందిన ఫండ్లలో ప్రస్తుతం కొనసాగుతుందని వెల్లడైంది. ఇది పరోక్షంగా ఆ కేటగిరీల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను కలిగించవచ్చని నివేదిక చెబుతోంది. 


ఇప్పటికే చాలా మంది మార్కెట్ నిపుణులు సైతం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీల్లోని అనేక కంపెనీల వ్యాల్యుయేషన్లు భారీగా పెరగటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ పోర్ట్ ఫోలియోలను దీర్ఙకాలం కోసం కొనసాగించకుండా లాభాల స్వీకరణకు మెుగ్గుచూపే అవకాశాలు సైతం ఉన్నట్లు జెఫరీస్ అంచనా వేస్తోంది. 2004లో బీజేపీ ఓటమితో దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు రోజుల్లో 19 శాతం క్షీణించగా ఆ తర్వాత 12 నెలల్లో మార్కెట్లు 43 శాతం పెరిగాయని జెఫరీస్ ఇండియా రీసెర్చ్ హెడ్ మహేష్ నందూర్కర్ పేర్కొన్నారు. 


వాస్తవానికి ఎన్నికలు కొనసాగుతున్న సమయంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదొడుకులను చూశాయి. అప్పట్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు సొంతంగా తెచ్చుకోవటం కష్టమనే వార్తల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పటికీ.. రిటైల్ ఇన్వెస్టర్ల ఇన్‌ఫ్లోలు పెరగడం ద్వారా ఎన్నికలకు ముందు నెలల్లో స్టాక్ మార్కెట్ నడిచింది. ఇందులో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు సైతం భారీ మెుత్తంలోనే ఉన్నాయి. దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నికర ఇన్‌ఫ్లోలు 2023లో నెలకు రూ.15,600 కోట్లు నుంచి 2024 మొదటి 5 నెలల్లో నెలకు రూ.30,300 కోట్లకు పెరిగాయి. 2024 జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్టర్ల సిప్ పెట్టుబడులు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుని రూ.20,000 కోట్ల మార్కును దాటాయి. గడచిన ఆరు నెలల కాలంలో సిప్ ద్వారా పెట్టుబడులు ఏకంగా రూ.లక్ష కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించాయి.