Chandrababu White Paper on Energy Department: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే మొట్టమొదటి సారిగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నేడు అవే సంస్కరణలు దేశానికి ఆదర్శం అయ్యాయని అన్నారు. గెలుపు ఓటముల కంటే, మనం చేసిన పనులు, దేశానికి ఉపయోగపడ్డాయనే తృప్తి నాకుందని అన్నారు. ఏపీ సచివాలయంలో విద్యుత్ శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. 


గత ప్రభుత్వం కరెంటుపై చేసిన బాదుడు తెలిస్తే, కరెంటు షాక్ కొట్టాల్సిందేనని అన్నారు. 2019తో పోల్చుకుంటే, 2024కి 98 శాతం కరెంటు బిల్లుల రేట్లు పెరిగాయని అన్నారు. అలా తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచి, పేదవాడిని జగన్ రెడ్డి పీక్కుతిన్నారని చంద్రబాబు విమర్శించారు. భవిష్యత్తు తరాలను గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పేందుకే ఈ శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. 


‘‘శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు వివరిస్తున్నాం. విద్యుత్‌తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా నాశనం చేసింది. అసమర్థులు పరిపాలన చేస్తే ఏమవుతుందో ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. గత జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజలపై రూ.32,166 కోట్ల ఛార్జీల భారం మోపింది. విద్యుత్‌ రంగంలో రూ.49,596 కోట్లు అప్పులు చేసింది. విద్యుత్‌ సంస్కరణల వల్ల నా అధికారం పోయినా దేశం మాత్రం బాగుపడింది. అప్పట్లో నేను మార్పులు వైఎస్‌ హయాంలో కూడా కనిపించాయి. మళ్లీ నేను అధికారంలోకి వచ్చాక నాణ్యమైన కరెంటు సరఫరా చేశాం. కరెంటు ఛార్జీలు పెంచకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నాం’’


నేను మూడోసారి అధికారంలోకి వచ్చాక నవ్యాంధ్రలో 2014-19లో సౌరశక్తి, పవన విద్యుత్‌ ఉత్పత్తిని పెంచే ప్రాజెక్టులు చేపట్టాం. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ మారింది. 2018-19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి చేరేలా పని చేశాం. టీడీపీ హయాంలో ట్రాన్స్‌కో, జెన్‌కోకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి’’ అని చంద్రబాబు వివరించారు.