10-minute liquor delivery: హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కోల్‌కతాలో వినూత్న సేవలు ఆరంభించింది. కేవలం 10 నిమిషాల్లోనే మద్యం డెలివరీ చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగిస్తాం అంటోంది బూజీ (Boozie) కంపెనీ! దేశంలో పది నిమిషాల్లోనే మద్యం డెలివరీ చేస్తున్న ఏకైక వేదిక తమదేనని చెబుతోంది. ఇప్పటికే ఎన్నో కంపెనీలు మద్యాన్ని హోమ్‌ డెలివరీ చేస్తున్నా ఇంత తక్కువ టైమ్‌లో చేయడం లేదని వెల్లడించింది.


పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమతితో ఈస్ట్రన్‌ మెట్రొపొలిస్‌లో బూజీ ఈ సేవలను మొదలు పెట్టింది. 'బూజీ ఒక డెలివరీ అగ్రిగేటర్‌. దగ్గర్లోని షాప్‌ నుంచి మద్యం తీసుకొని డెలివరీ చేసే సంస్థ. సరికొత్త ఏఐ టెక్నాలజీ ద్వారా పది నిమిషాల్లోనే సరఫరా చేస్తాం. ఈ టెక్నాలజీ కస్టమర్‌ ప్రవర్తన, ఆర్డర్‌ ప్యాటెర్న్‌ను అంచనా వేస్తుంది' అని కంపెనీ తెలిపింది.


తాము రూపొందించిన బీ2బీ లాజిస్టిక్స్‌ వేదిక వల్ల డెలివరీ ఖర్చు చాలా తగ్గుతుందని వెల్లడించింది. 'మద్యం అగ్రిగేటర్లకు తలుపులు తెరవాలన్న పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నాం. మార్కెట్లో సరఫరా, డిమాండ్‌ను ఈ చర్య తటస్థీకరిస్తుంది' అని తెలిపింది. ఆరోగ్యకరమైన మద్యం అలవాటును తాము ప్రోత్సహిస్తామంది. తక్కువ వయసున్న వారు ఆర్డర్‌ చేయకుండా చూస్తామంది. నాణ్యమైన మద్యం అందిస్తామని వెల్లడించింది.