BHIM SBI Pay app: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), తన ఖాతాదార్లకు ఒక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సింగపూర్‌కు నగదు బదిలీ మరింత సులభంగా మారుస్తూ ఈ బ్యాంక్‌ ఒక కొత్త సేవను ప్రారంభించింది. 


ఈ నెల 21వ తేదీన, డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించి, భారత్‌- సింగపూర్‌ మధ్య కీలక ఒప్పందం జరిగింది. భారతదేశ UPIని (Unified Payments Interface), సింగపూర్‌ 'పేనౌ'ని ‍(PayNow) ఈ ఒప్పందం ద్వారా కనెక్ట్ చేశారు. దీంతో, రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ పేమెంట్‌ కనెక్టివిటీ ప్రారంభమైంది. మన దేశంలో ఒకరికొరకు ఫోన్‌ నంబర్ల ఆధారంగా డబ్బులు పంపుకున్నట్లే, ఈ రెండు దేశాల ప్రజలు కూడా డబ్బులు పంపవచ్చు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, UPI PayNow ఉపయోగించి భారత్‌లో ఉన్నవాళ్లు సింగపూర్‌లో ఉన్నవాళ్లకు, సింగపూర్‌లో ఉన్నవాళ్లు భారత్‌లో ఉన్నవాళ్లకు చాలా సులభంగా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా, ఆ క్షణంలో (రియల్‌ టైమ్‌) డబ్బులు బదిలీ చేయవచ్చు. ఈ సౌకర్యం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో, తక్షణం నగదు పంపడానికి ఇది చాలా మంచి అవకాశం. 
 
ఈ క్రమంలోనే, స్టేట్‌ బ్యాంక్‌ కూడా యూపీఐ పేనౌ (UPI Paynow) సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. తన భీమ్ ఎస్‌బీఐ పే యాప్ (BHIM SBI Pay app) ద్వారా ఖాదాదార్లు ఈ సేవలు పొందొచ్చని ప్రకటించింది. ఇప్పుడు ఎస్‌బీఐ ఖాతాదార్లు కూడా, ఖాతాలకు లింక్‌ అయిన ఫోన్‌ నంబర్ల ద్వారా సింగపూర్‌కు డబ్బులు పంపవచ్చు, సింగపూర్‌ నుంచి పంపే డబ్బులు (ఇన్‌వర్డ్ , ఔట్‌వర్డ్ రెమిటెన్స్ సర్వీసులు) స్వీకరించవచ్చు. రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబర్ల ద్వారా రెండు దేశాల మధ్య జరిగే ఈ లావాదేవీల నగదు నేరుగా ఆయా ఖాతాల్లో జమ అవుతుంది. బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే కాదు, క్యూఆర్ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా కూడా రెండు దేశాల మధ్య డబ్బులు పంపుకోవచ్చు.


"ఈ క్రాస్ బోర్డర్ ఫెసిలిటేషన్‌లో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉంది. SBI BHIM SBIPay మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు" అంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ట్వీట్ చేసింది.


BHIM SBI పే యాప్‌ని ఉపయోగించి క్రాస్-బోర్డర్ ఫండ్ బదిలీ వివరాలు:


(1.) రిసీవర్ ‍‍‌(డబ్బును స్వీకరించే వ్యక్తి లేదా సంస్థ) తన దేశ స్థానిక కరెన్సీలో, ఆ క్షణంలో ఆ దేశ కరెన్సీ విలువ ప్రకారం డబ్బును పొందుతారు.


(2.) రెండు దేశాల మధ్య డబ్బులు పంపేందుకు రోజువారీ గరిష్ట పరిమితి $1,000 సింగపూర్ డాలర్‌లు లేదా భారత కరెన్సీలో అందుకు సమానమైన మొత్తం.


(3.) ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి, కస్టమర్‌లు తప్పనిసరిగా BHIM SBI పే యాప్‌లోని ‘ఫారిన్ ఔట్‌వర్డ్ రెమిటెన్స్’ ట్యాబ్‌కు నావిగేట్ చేయాలి.


(4.) ఈ యాప్‌ని Google Play Store నుంచి లేదా QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లో కూడా UPI IDని సృష్టించవచ్చు.


భారత్‌ నుంచి సింగపూర్‌ వెళ్లి వివిధ రకాల ఉద్యోగాలు, పనులు చేస్తున్న వాళ్లకు, విద్యార్థులకు ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. డబ్బులు పంపాలన్నా, స్వీకరించాలన్నా ఇకపై ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. భారత్‌లో UPI ద్వారా ఎలా ఒకరి నుంచి మరొకరికి డబ్బులు పంపడం & స్వీకరించడం చేస్తున్నామో, అదే విధంగా రెండు దేశాల మధ్య డబ్బులు పంపుకోవడం-తీసుకోవడం కోసం UPI PayNowని ఉపయోగించుకోవచ్చు. సింగపూర్‌కు డబ్బులు పంపడం, అక్కడి నుంచి స్వీకరించడం ఇకపై చిటికెలో పని.


లింకేజీ సమయంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ - సింగపూర్ మానిటరీ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవి మేనన్ ఒకరికొకరు డబ్బులు పంపుకుని, మొదటి లావాదేవీ నిర్వహించారు. ఫారిన్‌ ఇన్వర్డ్ రెమిటెన్స్ కోసం BHIM SBIPayని ఆర్‌బీఐ గవర్నర్ ఉపయోగించారు.