Vijay Mallya assets: బ్యాంకులకు విజయ్ మాల్యా డబ్బులు ఎగ్గొట్టారన్నది నిజం. అయితే ఒక్క బ్యాంకు కూడా నష్టపోలేదు. ఆయన ఆస్తులను వేలం వేసుకుని ఆస్తులను జప్తు చేశాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం, విజయ్ మాల్యాకు చెందిన రూ. 14,131.6 కోట్లు విలువైన ఆస్తులను బ్యాంకులు జప్తు చేసుకున్నాయి. ఇది కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన ₹6,203 కోట్ల రుణం వడ్డీతో సహా లెక్కవేసుకున్నా రెట్టింపు కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. మరి ఆయనను ఇంకా ఎందుకు నేరగాడిగా ప్రశ్నిస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది.
ఆర్పీజీ గ్రూపు సంస్థల అధినేత హర్ష్ గోయంకా ఇదే అంశాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఆయనను పొలిటికల్ పంచ్ బ్యాగ్‌గా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.
హర్ష్ గోయంకా ట్వీట్‌కు.. విజయ్ మాల్యా కూడా స్పందించారు. స్వయంగా ఆర్థిక మంత్రి అన్నీ రికవరీ చేశామని చెప్పినప్పటికీ తనపై వివక్ష చూపిస్తున్నారని ఆయనంటున్నారు.
విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల నుండి బ్యాంకులు సుమారు ₹14,131.6 కోట్లు వసూలు చేశాయి, ఇందులో భారతదేశంలో షేర్లు, రియల్ ఎస్టేట్, మరియు ఇతర ఆర్థిక సెక్యూరిటీలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఇవన్నీ ఆయనపై కేసులు నమోదు అయిన తర్వాత జప్తు చేసుకున్నవే. అందుకే కేసులు అలాగే ఉన్నాయి. అదే సమయంలో 2017లో భారత సుప్రీం కోర్టు విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. దీనికి కారమ.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి 40 మిలియన్ డాలర్లను తన పిల్లలకు బదిలీ చేయడమే. ఈ కోర్టు ధిక్కారం కేసులో దోషిగా ప్రకటించింది. అతనికి నాలుగు నెలల జైలు శిక్ష , 2,000 జరిమానా విధించారు.
ఒక వేళ ఇండియాకు వస్తే ఈ కేసులో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. తనపై వచ్చిన ఆరోపణలు, కేసులు అన్నింటిపై న్యాయబద్ధంగా విచారణ జరిపితే ఇండియాకు వస్తానని విజయ్ మాల్యా చెబుతున్నారు.