RBI Pilot Project: బ్యాంక్‌ లోన్లను మరింత ఈజీగా, వేగంగా అందుబాటులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) రంగంలోకి దిగుతోంది. బారోయర్ల కోసం 'పబ్లిక్ టెక్‌ ప్లాట్‌ఫామ్‌'ను స్టార్ట్‌ చేస్తోంది. ముందుగా, పైలట్ ప్రాజెక్ట్‌ను గురువారం (ఆగస్టు 17, 2023)‌ నుంచి ప్రారంభిస్తుంది. ముఖ్యంగా, వెనుకబడిన ప్రాంతాల్లో సులభంగా, స్పీడ్‌గా బ్యాంక్‌ లోన్లు అందించడం, మారుమూల ప్రాంత ప్రజలను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకురావడం ఈ ప్లాట్‌ఫామ్‌ టార్గెట్‌.


రుణం కోసం వెళ్లే ప్రతి వ్యక్తికి రూ.1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణం, MSME రుణాలు (పూచీకత్తు లేకుండా), డెయిరీ లోన్లు, పర్సనల్‌ లోన్లు, హోమ్‌ లోన్స్‌ వంటివి స్పీడ్‌గా అందేలా ఈ ప్లాట్‌ఫామ్ చూసుకుంటుంది.


చాలా రకాల సర్వీసులతో లింక్‌
ఆధార్ e-KYC, శాటిలైట్ డేటా, పాన్ వ్యాలిడేషన్‌, ఆధార్ ఇ-సైనింగ్, ఇల్లు/ప్రాపర్టీ సెర్చ్‌ డేటా సహా చాలా రకాల సేవలను ఈ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా లింక్ చేస్తారు. ఇందులో భాగమయ్యే రాష్ట్ర ప్రభుత్వాల (మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర) నుంచి ల్యాండ్‌ రికార్డులను కూడా పొందొచ్చు.


పైలట్ దశలో ఈ ప్లాట్‌ఫామ్ ఎలా పని చేస్తుందనే దానిపై ఆధారపడి, దాని పరిధిని విస్తరిస్తారు. పైలట్ ప్రాజెక్టు బాగా పని చేస్తుంటే మరిన్ని ప్రొడక్ట్స్‌, ఇన్ఫర్మేషన్‌ ప్రొవైడర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఈ ప్లాట్‌ఫామ్‌లో చేర్చవచ్చు.


లెండర్‌కు ఈజీగా అందనున్న ఇన్ఫర్మేషన్‌
'పబ్లిక్ టెక్‌ ప్లాట్‌ఫామ్‌' వల్ల డిజిటల్ ఇన్ఫర్మేషన్‌ నిరాటంకంగా లెండర్‌కు చేరుతుంది. తద్వారా, అవసరమైన వ్యక్తికి రుణాన్ని సాఫీగా మంజూరు చేయడానికి వీలవుతుందని ఆర్‌బీఐ చెబుతోంది. రుణాన్ని డిజిటల్‌గా డెలివరీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు వంటి ప్రత్యేక సంస్థల దగ్గర క్రెడిట్ హిస్టరీకి సంబంధించిన డేటా ఉంటుంది. కానీ, ప్రత్యేక సంస్థలు, సిస్టమ్స్‌ వద్ద ఉన్న ఈ డేటా ద్వారా రుణాన్ని వేగంగా డెలివెరీ చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయి. 


రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకొచ్చే 'పబ్లిక్ టెక్‌ ప్లాట్‌ఫామ్‌' ఆ సమస్యను సాల్వ్‌ చేస్తుంది. ఈ ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్, అన్ని ఫైనాన్షియల్‌ కంపెనీలు & అనుబంధ సంస్థలకు ఓపెన్ ఆర్కిటెక్చర్, ఓపెన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌ (APIలు) అందిస్తుంది. దీనివల్ల సమాచారం ఒక చోట నుంచి మరో చోటకు ఈజీగా పాస్‌ అవుతుంది. API అంటే, రెండు అప్లికేషన్‌లు ఒకదానితో ఒకటి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి అనుమతించే సాఫ్ట్‌వేర్. దీనివల్ల వివిధ యూనిట్ల దగ్గరున్న  డేటాను తీసుకోవడానికి, కలిపి చూడడానికి వీలవుతుంది. దీంతోపాటు ఫైనాన్షియల్ సెక్టార్‌లోని అన్ని యూనిట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా 'ప్లగ్ అండ్ ప్లే' మోడల్‌లో కనెక్ట్ అయ్యేలా స్టాండర్డ్స్‌ కూడా తీసుకొస్తోంది. 


'పబ్లిక్ టెక్‌ ప్లాట్‌ఫామ్‌' వల్ల లోన్‌ ఖర్చులు తగ్గుతాయి, రుణాల జారీలో స్పీడ్‌ పెరుగుతుంది, ఎక్కువ ప్రాంతాలకు రుణాలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial