Bank Rules Changing from 01 May 2024: క్యాలెండర్‌లో కొత్త నెల ప్రారంభమైన ప్రతిసారీ కొన్ని కొత్త రూల్స్‌ అమల్లోకి వస్తాయి. వాటిలో కొన్ని డబ్బుకు సంబంధించినవై ఉంటాయి. మే నెల ప్రారంభం నుంచి కొన్ని ఆర్థిక విషయాల్లో మార్పులు రాబోతున్నాయి, కామన్‌ మ్యాన్‌ బడ్జెట్‌ మీద అవి డైరెక్ట్‌ ఎఫెక్ట్‌ చూపుతాయి. కాబట్టి, కొత్త నెలలో ఎలాంటి సవరణలు, సర్దుబాట్లు ఉంటాయో ముందే తెలుసుకోవడం మన ఆర్థిక ఆరోగ్యానికి మంచిది. 


మీరు ఐసీఐసీఐ బ్యాంక్‌/ యెస్‌ బ్యాంక్‌/ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌/ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్‌ అయితే.. అందరి కంటే ముందు అలెర్ట్‌ అవ్వాల్సింది మీరే. 01 మే 2024 నుంచి ఈ బ్యాంక్‌ల సేవింగ్స్‌ ఖాతా/ క్రెడిట్‌ కార్డ్‌/ పథకాల నియమాలు, ఛార్జీలు మారబోతున్నాయి. 


ఐసీఐసీఐ బ్యాంక్ నిబంధనలు
ఐసీఐసీఐ బ్యాంక్, వివిధ సేవింగ్స్ అకౌంట్స్‌పై సర్వీస్ ఛార్జ్ నిబంధనలను 01 మే 2024 నుంచి మార్చింది. డెబిట్ కార్డ్‌ లావాదేవీల విషయంలో.. గ్రామీణ ప్రాంతాల్లో 99 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 200 రూపాయలు వార్షిక రుసుము ‍‌(Annual fee) చెల్లించాలి. 25 బ్యాంక్‌ చెక్‌ల జారీ వరకు ఎలాంటి ఛార్జ్‌ ఉండదు, ఆ తర్వాత ఒక్కో లీఫ్‌కు 4 రూపాయల చొప్పున ఫీజ్‌ కట్టాలి. IMPS లావాదేవీల ఛార్జ్‌ను రూ. 2.50 నుంచి రూ. 15 వరకు నిర్ణయించింది. ECS/NACH డెబిట్ రిటర్న్స్, స్టాప్‌ పేమెంట్‌ ఛార్జీలు కూడా ఛేంజ్‌ అయ్యాయి.


యెస్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌/క్రెడిట్‌ కార్డ్‌ రూల్స్‌
యెస్ బ్యాంక్ ఇచ్చిన సమాచారం ప్రకారం, మే 01వ తేదీ నుంచి, వివిధ సేవింగ్స్‌ అకౌంట్స్‌లో కనీస సగటు నిల్వ (Minimum Average Balance) పరిమితి మారుతుంది. యెస్ బ్యాంక్ ప్రో మాక్స్‌ మినిమమ్‌ యావరేజ్‌ బ్యాలెన్స్ (MAB) రూ. 50,000గా అవుతుంది. దీనిపై గరిష్ట రుసుము 1000 రూపాయలు. Yes Respect SA, Yes Essence SAలో MAB పరిమితిని రూ. 25,000గా సవరించారు. ఈ ఖాతాకు గరిష్ట రుసుమును 750 రూపాయలు. యెస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్ నిబంధనలు కూడా మారాయి. ప్రత్యేకించి ఇంధన ఆధారిత కార్డ్‌ల రుసుములు ప్రభావితం అవుతాయి.


IDFC ఫస్ట్ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ రూల్స్‌
IDFC ఫస్ట్ బ్యాంక్, క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు సంబంధించి కొత్త రూల్‌ తీసుకొచ్చింది. క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా యుటిలిటీ బిల్లుల మొత్తం రూ.20,000 దాటితే 1 శాతం ఛార్జ్‌ + GST విధిస్తారు.


HDFC బ్యాంక్ ప్రత్యేక FD 
సీనియర్‌ సిటిజన్ల కోసం అమలు చేస్తున్న "సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్" స్కీమ్ గడువును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మే 10వ తేదీ వరకు పొడిగించింది. ఈ స్కీమ్‌ను కేవలం సీనియర్ సిటిజన్ల కోసమే అమలు చేస్తోంది. ఈ FD అకౌంట్‌ కింద సీనియర్ సిటిజన్లకు 0.75 శాతం ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. 5 నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి FDపై సీనియర్‌ సిటిజన్‌ ఇన్వెస్టర్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఈ FDలో రూ.5 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు.


బ్యాంక్‌ సెలవులు
మే నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. ఈ 12 రోజుల్లో.. రెండు & నాలుగు శనివారాలు, 4 ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి. 


మరో ఆసక్తికర కథనం: ఆకాశం నుంచి దిగి రానున్న ఫ్లైట్‌ టిక్కెట్‌ రేట్లు, అక్కర్లేని ఛార్జీలకు చెక్‌మేట్‌