DGCA Guidelines To Reduce Flight Ticket Price: జీవితంలో కనీసం ఒక్కసారైనా విమానం ఎక్కాలని ప్రతి పేద & మధ్య తరగతి భారతీయుడు ఆశ పడతాడు. అయితే, విమానం టిక్కెట్‌ రేటున భరించే స్థోమత లేక తన ఆశను మనసులోనే తొక్కి పెడతాడు. అలాగని, విమాన టిక్కెట్‌ కొని ప్రయాణిస్తున్న వాళ్లంతా సంతోషంగా లేరు. ఎయిర్‌లైన్‌ కంపెనీకి అనవసరంగా ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నామంటూ తరచూ వాపోతున్నారు. ఈ నేపథ్యంలో, విమానం టిక్కెట్‌ ధరలను తగ్గించేందుకు 'పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థ' DGCA రంగంలోకి దిగింది. దేశంలోని విమానయాన సంస్థలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. DGCA కొత్త నిబంధనలు తూ.చా. తప్పకుండా అమల్లోకి వస్తే విమాన టిక్కెట్లు చౌకగా మారతాయి. 


విమాన ప్రయాణికులు వినియోగించుకోని సేవలకు కూడా ఫ్లైట్‌ సర్వీస్‌ సంస్థలు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చాలాకాలంగా డీజీసీఏకు ఫిర్యాదులు అందుతున్నాయి. సాధారణంగా, ఆన్‌లైన్‌లో చూసినప్పుడు ఎయిర్‌ టిక్కెట్‌ బేస్‌ ఫేర్‌ చాలా తక్కువగా & ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫైనల్‌ ప్రైస్‌ చూశాక గుండె జారిపోతుంది. ఇన్‌ సర్వీస్‌ల పేరిట ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు వసూలు చేసే వివిధ ఛార్జీల వల్ల బేస్‌ ఫేర్‌ - ఫైనల్‌ ప్రైస్‌ మధ్య ఇంత పెద్ద తేడా కనిపిస్తుంది. అయితే.. ఎయిర్‌లైన్‌ కంపెనీలు అందిస్తున్న సేవలన్నీ చాలా మంది ప్రయాణీకులకు అక్కర్లేనివి. తమకు అవసరం లేని సర్వీస్‌లకు కూడా విమాన కంపెనీలు తమ నుంచి ఫీజ్‌ వసూలు చేస్తున్నాయంటూ ప్రయాణీకులు DGCAకి కంప్లైంట్స్‌ ఇస్తున్నారు. 


సేవలు ఎంచుకునే స్వేచ్ఛ
ఆ ఫిర్యాదులను పరిశీలించిన DGCA, కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. సేవలను (Opt-out లేదా Opt-in) ఎంచుకునే స్వేచ్ఛను ప్రయాణీకులకే వదిలి పెట్టాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. దీనివల్ల విమాన టిక్కెట్ల బేస్ ఫేర్‌ తగ్గి టిక్కెట్‌ తుది ధర చౌకగా మారుతుంది. 


ఛార్జీల వివరాలు స్పష్టంగా వెల్లడించాలని ఆదేశం
DGCA సర్క్యులర్ ప్రకారం... విమానయాన సంస్థలు సీట్‌ ఆప్షన్‌, స్నాక్స్ & డ్రింక్స్ ఛార్జ్‌ (మంచినీరు ఉచితం), బ్యాగేజీ ఛార్జ్, స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ ఛార్జ్‌, సంగీత వాయిద్యాల ఛార్జ్‌, విలువైన వస్తువులకు సంబంధించిన ఛార్జ్‌ వంటి వాటిని టిక్కెట్‌ ధర నుంచి విడిగా చూపాలి. ఆయా సేవా రుసుములను టిక్కెట్‌పై స్పష్టంగా అర్ధమయ్యేలా ముద్రించాలి. దీనివల్ల.. తమకు ఏ సౌకర్యం కావాలో, ఏది వద్దో ప్రయాణీకులు నిర్ణయించుకోగలుగుతారు. అవసరమైన లేదా ఉపయోగించుకునే సేవలకు మాత్రమే డబ్బు చెల్లిస్తారు. ఫలితంగా టిక్కెట్‌ రేట్‌ తగ్గుతుంది.


ప్రయాణీకుడు తన ఇష్టానుసారం ఇన్‌-సర్వీస్‌లు ఎంచుకోవడానికి అవసరమైన సమాచారాన్ని స్పష్టంగా ఇవ్వాలని DGCA తన సర్క్యులర్‌లో పేర్కొంది. టిక్కెట్‌ కొనే సమయంలో ప్రయాణికుడు పొరపాటున కూడా అదనపు ఛార్జీ చెల్లించాల్సిన పరిస్థితి రాకూడదని సూచించింది. ఒక్కో సేవకు ఎంత పే చేయాలో ముందుగానే తెలియజేస్తే, ఇష్టమైన సేవను ప్రయాణీకుడే ఎంచుకుంటాడని కొత్త గైడ్‌లైన్స్‌లో DGCA స్పష్టం చేసింది.


మరో ఆసక్తికర కథనం: భారత్ పర్యటన రద్దు తరవాత చైనాకి వెళ్లిన మస్క్, ఏం ప్లాన్ చేస్తున్నారు?