Axis bank - Citi bank: దాదాపు ఏడాది ప్రక్రియ తర్వాత.. యాక్సిస్ బ్యాంక్ - సిటీ బ్యాంక్ డీల్ (Axis bank - Citi bank Deal) క్లోజ్ అయింది. సిటీ బ్యాంక్ భారతదేశంలో నిర్వహిస్తున్న కన్జ్యూమర్, NBFC కన్జ్యూమర్ బిజినెస్‌ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. 2022 మార్చిలో ఈ డీల్ ప్రకటించారు. కొనుగోలు ఒప్పందం ప్రకారం, రూ. 11,603 కోట్లను యాక్సిస్ బ్యాంకు చెల్లించడం డీల్ పూర్తయింది.
డీల్ క్లోజ్ కావడంతో, భారతదేశ రిటైల్ లేదా కన్జ్యూమర్ బిజినెస్ నుంచి సిటీ బ్యాంక్ కార్యకలాపాలు పూర్తిగా యాక్సిస్ బ్యాంక్ చేతికి వచ్చాయి. కేవలం, ఇన్‌స్టిట్యూషనల్ క్లయింట్ల బిజినెస్‌ను మాత్రమే ఇప్పుడు సిటీ బ్యాంక్ భారత్‌లో నిర్వహిస్తుంది.
అమెరికాకు చెందిన గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం అయిన సిటీ బ్యాంక్, 1902 నుంచి భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మార్చి 1, 2023 నుంచి సిటీ బ్యాంక్ కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్ చేతిలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో, సిటీ బ్యాంక్ ఖాదాదార్లకు సంబంధించి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై, సిటీ బ్యాంక్ ఖాతాదార్లు యాక్సిస్ బ్యాంక్‌తోనే అన్ని లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ అందించే సౌకర్యాలు అన్నీ వాళ్లకు అందుతాయి. మీకు కూడా సిటీ బ్యాంకులో ఖాతా ఉన్నా, బీమా పాలసీలు కొనుగోలు చేసి ఉన్నా, లేదా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉన్నా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటన్న విషయాన్ని తెలుసుకుందాం.
సిటీ బ్యాంక్ కస్టమర్ల విషయంలో జరిగే మార్పులు:
మీ సిటీ బ్యాంక్ ఖాతా నంబర్, క్రెడిట్ & డెబిట్ కార్డ్ నంబర్‌లు, చెక్ బుక్, IFSC అలాగే ఉంటాయి.
సిటీ బ్యాంక్ మొబైల్ యాప్ లేదా సిటీ బ్యాంక్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ కూడా యథాతథంగా కొనసాగుతుంది.
సిటీ ఇండియా నుంచి బీమా పాలసీలు తీసుకున్న వ్యక్తులకు యాక్సిస్ బ్యాంక్ నుంచి సమాన సౌకర్యాలు అందుతాయి.
ఇకపై.. సిటీ బ్యాంక్‌తో పాటు, యాక్సిస్ బ్యాంక్ నుంచి లేదా ATM నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ATM ఉపసంహరణ పరిమితి పెరుగుతుంది.
సిటీ బ్యాంక్ ఇచ్చిన వడ్డీ రేటలోనూ ఎలాంటి మార్పు ఉండదు
మ్యూచువల్ ఫండ్‌లు, PMS, AIFలో మీ పెట్టుబడులు యాక్సిస్ బ్యాంక్‌కి బదిలీ అవుతాయి.
గృహ రుణం లేదా ఇతర రుణాల విషయాల్లో ఎటువంటి మార్పులు జరగవు, యథాతథంగా కొనసాగుతాయి.
క్రెడిట్ కార్డ్‌తో సెటిల్‌మెంట్ పొందడం కష్టం.
సిటీ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కు ఆస్తులు బదిలీ
యాక్సిస్ బ్యాంక్ - సిటీ బ్యాంక్ డీల్‌లో భాగంగా, యాక్సిస్ బ్యాంక్‌కు 30 లక్షల మంది సిటీ బ్యాంక్ కస్టమర్లు, ఏడు కార్యాలయాలు, 21 బ్రాంచ్‌లు, 499 ఏటీఎంలను సిటీ బ్యాంక్‌కు ఇవ్వాలని చెప్పారు. 86 లక్షల క్రెడిట్ కార్డుల జారీ ద్వారా, క్రెడిట్ కార్డ్‌ల జారీ లిస్ట్‌లో నాలుగో అతి పెద్ద బ్యాంకుగా ఉన్న యాక్సిస్ బ్యాంక్ చేతిలోకి, సిటీ బ్యాంక్‌కు చెందిన 25 లక్షల కార్డుహోల్డర్లు వచ్చారు. వీరితో కలిపి, క్రెడిట్ కార్డుల లిస్ట్‌లో టాప్-3లోకి యాక్సిస్ బ్యాంకు చేరింది.