Ashish Kacholia: ఏస్ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా గురించి తెలుసుగా... ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌లో 'బిగ్ వేల్' అని ఈయనకు పేరుంది. ఎవరికీ పెద్దగా తెలీని, తక్కువ సమయంలో ఆల్ఫా రాబడిని (మొత్తం మార్కెట్‌ కంటే ఎక్కువ రాబడి) అందించే స్మాల్ & మిడ్ క్యాప్ స్టాక్స్‌ను వెదికి పట్టుకోవడంలో ఆశిష్‌ కచోలియాది అందె వేసిన చెయ్యి. ఈయన ముట్టుకునేవన్నీ దాదాపుగా వాల్యూ బయింగ్సే. ఉండాల్సిన ధర కన్నా తక్కువగా ధర వద్ద (డిస్కౌంట్‌లో) ప్రస్తుతం ట్రేడవుతూ, భవిష్యత్తులో భారీ రిటర్న్స్‌ ఇవ్వగల సత్తా ఉన్న క్వాలిటీ స్టాక్స్‌ను ఎంచుకుంటారు ఆశిష్‌ కచోలియా.


వాల్యూ పిక్స్ కోసం ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోను ఫాలో అయ్యేవాళ్ల కోసం మరో వార్త బయటకు వచ్చింది. మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటైన 'రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హ్యాన్సర్స్ లిమిటెడ్‌' (Raghav Productivity Enhancers Ltd) షేర్లను తాజాగా ఈ ఏస్ ఇన్వెస్టర్ కొన్నారు. 


ఆశిష్ కచోలియా షేర్ హోల్డింగ్
BSE డేటా ప్రకారం, బల్క్ డీల్‌ ద్వారా, రాఘవ్ ప్రొడక్టివిటీ ఎన్‌హాన్సర్స్ లిమిటెడ్‌కు చెందిన 2 లక్షల 31 వేల 683 షేర్ల ఈక్విటీ షేర్లను బిగ్‌ వేల్‌ కొన్నారు. ఒక్కో షేరుకు సగటున రూ. 842 చెల్లించారు. ఈ డీల్‌ కోసం ఆశిష్‌ కచోలియా మొత్తం రూ.19.50 కోట్లకు పైగా వెచ్చించారు.


ప్రస్తుతం రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ విలువ ఉన్న ఈ స్మాల్ క్యాప్ స్టాక్, గత ఐదేళ్లలో 1087% పెరిగింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం, కేవలం రూ.82 దగ్గరున్న స్క్రిప్‌, సోమవారం (2022 నవంబర్‌ 7) నాడు రూ. 975.50 వద్ద ముగిసింది. ఈ ఐదేళ్లలో ఒక్కో షేరు ధర ఏకంగా రూ. 893.36 మేర జంప్‌ చేసింది.


ఒక లక్షకు పది లక్షలు
ఐదేళ్ల క్రితం ఒక వ్యక్తి ఈ స్టాక్‌లో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, సోమవారం నాటికి ఆ పెట్టుబడి విలువ 10 లక్షల 87 వేల రూపాయలు అయి ఉండేది. అంటే, 10 రెట్ల లాభం. ఈ మొత్తం విలువ నుంచి పెట్టుబడి మొత్తం ఒక లక్షను మినహాయించుకుంటే, 9 లక్షల 87 వేల రూపాయల లాభం కనిపిస్తుంది.


గత వారం రోజుల్లోనే, ఈ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియో స్టాక్ 17 శాతం పెరిగింది. గత నెల రోజుల్లోనే ₹590 స్థాయి నుంచి ₹975 వరకు పెరిగింది, వాటాదారులకు 60 శాతం పైగా రాబడి అందించింది. గత ఆరు నెలల్లో, ఈ మల్టీబ్యాగర్ స్టాక్  96 శాతానికి పైగా లాభం అందించడం ద్వారా వాటాదారుల డబ్బును దాదాపు రెట్టింపు చేసింది. అయితే, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD)  చూస్తే.. 2022 ప్రారంభమైన తర్వాత స్టాక్‌లో ప్రాఫిట్ బుకింగ్ ఒత్తిడి ఉన్నందున కేవలం 28 శాతం రాబడిని అందించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.