Vidadala Rajini Visit: గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిని త్వరలోనే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. సోమవారం ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆమె పర్యటించారు. వివిధ విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎయిమ్స్ లో అందుతున్న వైద్య సేవలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఎమ్మారై, సిటీ స్కాన్, మామోగ్రఫీ యంత్రాలను ఎయిమ్స్ అధికారులతో కలిసి ప్రయవేక్షించారు. ఎయిమ్స్ కి కావాల్సిన మొలిక వసతులపై అధికారులతో సమీక్షించారు. మంగళగిలి మండలం ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్ కి అవసరమైన 2 లక్షల 25 వేల లీటర్లు నీటిని తరలించేందుకు 7 కోట్ల 40 లక్షలతో ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం పనులు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయని అన్నారు. 


"వాటర్ సమస్యకు సంబంధించి కూడా ఎక్కడా ఇంటరప్షన్ లేకుండా టెంపరరీ అరేంజ్ మెంట్స్ ఉన్నటువంటి విజయవాడ కార్పొరేషన్ అలాగే తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీ, ఇక్కడున్నటువంటి కార్పొరేషన్ కూడా ఈ టెంపరరీ వాటర్ అరెంజ్ మెంట్స్ చేయడం జరగింది. దానికి గాను అయిన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. పూర్తిగా ఒక పర్మినెంట్ సొల్యూషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో 7.74 కోట్లతో ఆత్మకూరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ గా ఎయిమ్స్ కి 25 లక్షల లీటర్లు పర్ డే ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసి దాన్ని ఈరోజు నుంచే ప్రారంభించడం జరుగుతుంది. ఒక వన్ ఈయర్ లో ఈ వాటర్ కు సంబంధించిన పనులన్నింటినీ పూర్తి చేసుకొని ఎయిమ్స్ కి పర్మినెంట్ వాటర్ సొల్యూషన్ తీసుకొస్తాం. ఈ వాటర్ సమస్యకు కంప్లీట్ గా చెక్ పెడతాం. రానున్న కాలంలో ఎయిమ్స్ ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురాబోతా ఉన్నాం. యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్సీ సంబంధించి కూడా ఎయిమ్స్ వారితో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంఓఈ వారు కూడా దీనికి సబంధించినటువంటి డిస్కషన్ కూడా జరిగింది. తొందరలోనే ఎంఓఈ కూడా చేస్కుంటాం"  మంత్రి విడదల రజిని


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిమ్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అలాగే దగ్గరలో ఉన్న యార్డును ఇతర ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపడతామని మంత్రి వివరించారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి మార్గనిర్దేశంతో  వైద్య ఆరోగ్య రంగం ప‌టిష్టంగా మారిపోతోంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీల నిర్మాణంపై మంత్రి విడ‌ద‌ల ర‌జిని అధికారులంద‌రితో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమ‌ల్లోకి తీసుకొస్తున్నామ‌ని, దేశ చ‌రిత్రలోనే వైద్య ఆరోగ్యశాఖ‌లో ఇది స‌రికొత్త విప్లవ‌మ‌ని చెప్పారు. నిర్మాణంలో ఉన్న అన్ని వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, అర్బన్ హెల్త్ సెంట‌ర్లు, ప్రాథ‌మిక వైద్యశాల‌లన్నింటినీ వెంట‌నే పూర్తిచేయాల‌ని మంత్రి ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానానికి వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, పీహెచ్‌సీలు కీల‌కమ‌ని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రాథ‌మిక వైద్య విభాగాన్ని పూర్తిగా మార్చేస్తోంద‌న్నారు. ఈ విభాగంలో ఆస్పత్రుల నిర్మాణం కోస‌మే ఏకంగా రూ.2532 కోట్లు సీఎం జగన్ ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలిపారు.


పేద‌లంద‌రికీ ఉచితంగా ఆధునిక వైద్యం 


పేద ప్రజ‌లంద‌రికీ ఆధునిక వైద్యాన్ని ఉచితంగా అందించే దిశ‌గా కృషి చేస్తున్నామ‌ని మంత్రి విడదల రజిని తెలిపారు. గ్రామ‌గ్రామాన వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల‌ను నిర్మిస్తున్నామ‌ని, రూ.1500 కోట్లతో 1032 విలేజ్ క్లినిక్‌ల నిర్మాణం చేప‌ట్టామ‌ని చెప్పారు. 184 యూహెచ్‌సీల ఆధునికీక‌ర‌ణ‌, 344 కొత్త యూహెచ్‌సీల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.665 కోట్లు కేటాయించింద‌ని, ఈ పనులు దాదాపు పూర్తికావ‌చ్చాయ‌ని తెలిపారు. 976 పీహెచ్‌సీల ఆధునికీక‌ర‌ణ‌, 150 కొత్త పీహెచ్‌సీల నిర్మాణం కోసం రూ.367 కోట్లు వెచ్చిస్తున్నామ‌న్నారు.