Apple Lays off:  తమ దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు లేవని అమెరికా చెబుతోంది. నియామకాలు పెరిగాయని, నిరుద్యోగం తగ్గిందని గణాంకాలు చూపుతోంది. మరోవైపు దిగ్గజ కంపెనీలేమో ఉద్యోగులను విధుల్లోంచి తొలగిస్తున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత విలువైన యాపిల్‌ 100 మంది వరకు కాంట్రాక్టు రిక్రూటర్లను తీసేసింది. ఖర్చులు తగ్గించుకొనేందుకే ఇలా చేసినట్టు బ్లూమ్‌బర్గ్‌ ఓ కథనంలో పేర్కొంది.


యాపిల్‌ కంపెనీలో ఉద్యోగుల్ని తొలగించడం అత్యంత అరుదు. 2019, 2015లోనూ కొందరు కాంట్రాక్టు ఉద్యోగులను సంస్థ తొలగించింది. తాజాగా 100 మంది కాంట్రాక్టు రిక్రూటర్లను తీసేసింది. సంస్థలో కొత్త ఉద్యోగులను నియమించడం వీరి బాద్యత. అలాంటి వారినే తీసేసిందంటే నియామక ప్రక్రియ నెమ్మదించినట్టే అర్థం చేసుకోవాలని నిపుణులు భావిస్తున్నారు. టెక్సాస్‌, సింగపూర్‌లోని కార్యాలయాల్లోనూ ఉద్యోగులను కంపెనీ తొలగించింది. ఇప్పుడున్న వ్యాపార అవసరాల్లో మార్పుల వల్లే ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఆ సంస్థలో 150,000 మంది వరకు పనిచేస్తున్నారు.


కొన్నేళ్లుగా భారీ స్థాయిలో నియమించుకోవడంతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దాంతో యాపిల్‌ నియామక ప్రక్రియ వేగం తగ్గించినట్టు గత నెల్లో బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. కాగా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నామని, అవసరమైన విభాగాల్లో పెట్టుబడులు కొనసాగిస్తామని సీఈవో టిమ్‌కుక్‌ కంపెనీ ఎర్నింగ్స్‌ కాల్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. 'కొన్ని విభాగాల్లో పెట్టుబడులు కొనసాగిస్తాం. కొత్త ఉద్యోగులనూ తీసుకుంటాం. అయితే ప్రస్తుత అవసరాలకు తగ్గట్టే నియామకాలు ఉంటాయి' అని ఆయన వెల్లడించారు.


అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడటంతో మెటా ప్లాట్‌ఫామ్స్‌, టెస్లా, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఒరాకిల్‌ వంటి దిగ్గజ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.