Foxconn Hyderabad: 


హైదరాబాదీలు గర్వంగా తలెత్తుకొనే మరో ఘనత! ఐఫోన్‌ మేకర్‌ ఆపిల్‌ భాగ్యనగరంలోనే వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను తయారు చేయనుందని తెలిసింది. ఫాక్స్‌కాన్‌ కంపెనీలో ఎయిర్‌పాడ్స్‌ ఉత్పత్తి ఆరంభమవుతుందని సమాచారం. దేశంలో ఐఫోన్‌ తర్వాత ఆపిల్‌ ఉత్పత్తి చేస్తున్న రెండో ప్రొడక్ట్‌ ఇదే కావడం గమనార్హం.


హైదరాబాద్‌లోని ప్లాంట్‌లో 400 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ ఆమోదం తెలిపింది. 2024 డిసెంబర్లో ఇక్కడ ఉత్పత్తి మొదలవుతుందని అంచనా. 'ఫాక్స్‌కాన్‌ హైదరాబాద్‌ ఫ్యాక్టరీ ఎయిర్‌పాడ్స్‌ను తయారు చేయనుంది. డిసెంబర్‌ నుంచి భారీ స్థాయిలో ఉత్పత్తి ఆరంభమవుతుందని అంచనా' అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు పీటీఐకి సమాచారం ఇచ్చారు. దీనిని మరో అధికారి సైతం ధ్రువీకరించారని తెలిసింది.


భాగ్యనగరంలో ఎయిర్‌పాడ్స్‌ తయారీ గురించి ఈమెయిల్‌ పంపించగా ఫాక్స్‌కాన్‌, ఆపిల్‌ స్పందించలేదని పీటీఐ వెల్లడించింది. ఐఫోన్‌ తర్వాత భారత్‌లో తయారవుతున్న ఆపిల్‌ రెండో ఉత్పత్తి ఎయిర్‌ పాడ్స్‌. టాటా సౌజన్యంతో ఇప్పటికే ఐఫోన్ల తయారీ మొదలైంది. అతి త్వరలోనే ఇవి అంతర్జాతీయ మార్కెట్లో విడుదల అవుతున్నాయి. ఇక ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో మార్కెట్లో ఎయిర్‌పాడ్స్‌ ఆధిపత్యం వహించనున్నాయి.


2022, డిసెంబర్‌ త్రైమాసికానికి అంతర్జాతీయ ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో మార్కెట్లో ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌కు 36 శాతం వాటా ఉంది. 7.5 శాతంతో సామ్‌సంగ్‌, 4.4 శాతంతో షియామి, 4 శాతంతో బోట్‌, 3 శాతంతో ఒప్పొ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నోయిడాలోని ఆప్టిమస్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్లాంట్‌లో ఈ ఏడాదే షియామి ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో డివైజెస్‌ తయారీని మొదలు పెట్టింది.


Made in India iPhone: టాటా గ్రూప్ త్వరలో భారత్‌లో ఐఫోన్లను (iPhone) ఉత్పత్తి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశంలోని అతి పెద్ద & శతాబ్దాల అనుభవం ఉన్న పారిశ్రామిక సంస్థల సమ్మేళనం అయిన టాటా గ్రూప్, ఐఫోన్ తయారీదార్ల లీగ్‌లో అతి త్వరలో చేరవచ్చు. ఇదే జరిగితే, ఐఫోన్‌ను తయారు చేసిన తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్‌ నిలుస్తుంది. భారతదేశంలో ఇప్పటికే ఐఫోన్లను ఉత్పత్తి చేస్తున్నా, తైవాన్‌ కంపెనీలే ఆ పనిని చూసుకుంటున్నాయి. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ (Foxconn), విస్ట్రోన్‌, పెగాట్రాన్‌ ‍‌(Pegatron) మన దేశంలో తయారీ కేంద్రాలను నెలకొల్పి యాపిల్‌ (Apple) ప్రొడక్ట్స్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. 


బెంగళూరుకు సమీపంలో ఉన్న, తైవాన్‌కు చెందిన విస్ట్రోన్‌ (Wistron) తయారీ కేంద్రంలో మెజారిటీ వాటాను టాటా గ్రూప్‌ కొనుగోలు చేయబోతోంది. త్వరలోనే ఈ డీల్‌ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ డీల్‌ ఫినిష్‌ చేసిన తర్వాత, ఐఫోన్ల తయారీ కోసం విస్ట్రోన్‌తో టాటా గ్రూప్‌ చేతులు కలుపుతుంది, జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ జాయింట్ వెంచర్‌లో టాటా గ్రూపు అతి పెద్ద వాటాదారుగా ఉంటుంది. దాదాపు 10,000 మంది కార్మికులు టాటా గ్రూప్‌ యాజమాన్యం కిందకు వస్తారు.