RBI e-rupee: మహీంద్ర గ్రూప్‌ ఓనర్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) ట్వీట్‌ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దేశంలో డిజిటల్‌ కరెన్సీ వినియోగం క్షేత్ర స్థాయిలోకి ఎలా వెళ్లింది, ఎలా విస్తరిస్తోందన్న విషయాన్ని ఆ వీడియో ద్వారా ఆనంద్‌ మహీంద్ర వెల్లడించారు.


ఒక వీధి వర్తకుడి నుంచి కొన్ని దానిమ్మ పళ్లను ఆనంద్‌ మహీంద్ర కొనుగోలు చేశారు. ఇదేం విచిత్రం కాదు. కానీ, ఆ పండ్ల కొనుగోలుకు అయిన డబ్బును ఆయన డిజిటల్‌ రూపీ మార్గంలో చెల్లించారు. ఇదే అసలు విషయం. 


భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), మన దేశంలో పైలట్ ప్రాజెక్ట్‌గా డిజిటల్ కరెన్సీని అమలు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే డిజిటల్ కరెన్సీని ఉపయోగిస్తున్నారు. విశేషం ఏంటంటే, డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్‌లోకి ముంబైకి చెందిన ఒక పండ్ల విక్రేతను ఆర్‌బీఐ చేర్చింది. ఆనంద్‌ మహీంద్ర ఆయన దగ్గరే పండ్లు కొని, ఆ వీడియోను తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా షేర్‌ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వేగంగా వైరల్ అవుతోంది. 


 






 


బచెలాల్ సాహ్ని ఎవరు?
ఆనంద్‌ మహీంద్ర వీడియోను ట్వీట్‌ చేసిన తర్వాత, బాచేలాల్ సాహ్ని ఎవరంటూ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. బచెలాల్ సాహ్ని ఒక పండ్ల వ్యాపారి. RBI అతన్ని డిజిటల్ రూపాయి చలామణీ పైలట్ పథకంలో భాగంగా అతన్ని కూడా ఎంచుకుంది. బచెలాల్ సాహ్నిది బిహార్. మీడియా కథనాల ప్రకారం... 29 సంవత్సరాలుగా అతను & అతని కుటుంబం ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముందు పండ్లు అమ్ముతూ జీవిస్తోంది. డిజిటల్ రూపాయి CBDC-R (Central Bank Digital Currency- Retail) పైలెట్‌ ప్రాజెక్టులో ఇప్పుడు బచెలాల్ సాహ్ని ఒక భాగం అయ్యారు.


బచెలాల్ సాహ్ని దగ్గర పండ్లు కొని, ఈ-రూపాయిల్లో చెల్లించి, ఆ వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. ఆ తర్వత తన అభిప్రాయాలు పంచుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ బోర్డు మీటింగ్‌లో RBI డిజిటల్ కరెన్సీ ఈ-రూపాయి గురించి తెలుసుకునే అవకాశం తనకు లభించిందని ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే తాను బచెలాల్ సాహ్ని దగ్గరకు వెళ్లానని చెప్పారు. RBI సమీపంలోనే బచెలాల్‌ సాహ్ని పండ్లు అమ్ముతాడని, దేశంలో డిజిటల్ రూపాయిని అంగీకరించిన మొదటి కొద్ది మంది వ్యాపారుల్లో అతనిు ఒకడని తన ట్వీట్‌లో వివరించారు. 


డిజిటల్ కరెన్సీని ఎలా ఉపయోగించాలి?
2 రకాల డిజిటల్ కరెన్సీని RBI విడుదల చేసింది. ఒకటి CBDC-W ‍‌(Central Bank Digital Currency- Wholesale), మరొకటి CBDC-R. మొదటిది హోల్‌సేల్ చెల్లింపుల కోసం, రెండోది రిటైల్ చెల్లింపుల కోసం ఉపయోగించాలి. ప్రస్తుతం, ఈ ప్రాజెక్టులు మన దేశంలో ప్రయోగాత్మకంగా కొనసాగుతున్నప్పటికీ చాలామందికి దాని గురించి తెలియదు. ప్రస్తుతం.. ముంబై, న్యూదిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ ప్రజలు డిజిటల్ మనీని వినియోగించుకునే అవకాశాన్ని పొందుతున్నారు.