Akshaya Tritiya: భారతీయులు ప్రపంచంలో ఏ మూలన నివశిస్తున్నా తమ సాంప్రదాయం ఫాలో అవుతూ అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేస్తుంటారు. దీనిని చాలా శుభప్రదంగా భావిస్తుంటారు. కనీసం ఒక్క గ్రామైనా కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చాలా మంది భావిస్తున్నారు.


యాప్స్ ద్వారా క్షణాల్లో గోల్డ్, సిల్వర్ కొనుగోలు 
తాజా పరిస్థితులను గమనిస్తే అక్షయ తృతీయ రోజున అనూహ్యంగా పెరిగిన బంగారం ధరతో చాలా మంది తేలికపైటి ఆభరణాలను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అయితే ప్రస్తుతం డిజిటల్ యుగంలో చాలా మంది తమ క్విక్ కామర్స్ యాప్స్ ద్వారా క్షణాల్లో గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసినట్లు తాజా డేటా వెల్లడించింది. వాస్తవానికి రేటు పెరుగుదలతో పసిడికి డిమాండ్ మెరుపు తగ్గుతుందని అందరూ భావించినప్పటికీ.. తక్కువ మెుత్తాల్లో ఎక్కువ మంది ప్రజలు నిన్న పసిడి, వెండి కాయిన్స్ కొన్నట్లు డేటా వెల్లడైంది.


మార్కెట్లోని బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ వంటి యాప్స్ ద్వారా ప్రజలు గోల్డ్ అండ్ సిల్వర్ నాణేలను నేరుగా ఇళ్ల తగ్గరకే నిమిషాల్లో తెప్పించుకున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ధన్‌తేరస్ సమయంలో కంటే ప్రస్తుతం ఎక్కువ పసిడి అమ్మకాలను చూసినట్లు స్విగ్గీ సంస్థ వెల్లడించింది. అక్షయతృతీయకు అమ్మకాలు ఆరు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. ఈ ఏడాది అధిక బంగారం ధరలు, కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికలు, వేసవి వేడి వంటి అనేక అంశాలు వినియోగదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నప్పటికీ అమ్మకాల్లో పెరుగుదలను బంగారు వ్యాపారంలోని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 


గుమ్మం దగ్గరికే పసిడి, వెండి కాయిన్స్ 
10 నిమిషాల్లో ఇంటికి వస్తువులను డెలివరీ చేసే వ్యాపారంలో ఉన్న స్టార్టప్ కంపెనీలు నిన్న తమ కస్టమర్ల గుమ్మం దగ్గరికే పసిడి, వెండి కాయిన్స్ డెలివరీ చేసేందుకు ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ గోల్డ్ మలబార్ గోల్డ్ & డైమండ్స్, ముత్తూట్ ఎగ్జిమ్‌లతో, జెప్టో నెక్ జ్యూవెలర్స్, టాటా బిగ్‌బాస్కెట్ తనిష్క్, ఎంఎంటీసీ లతో జతకట్టాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకంగా 20 కేజీల వెండి బంగారు నాణేలను విక్రయించినట్లు జెఫ్టో సీఈవో ప్రకటించారు. ఇది కాకుండా దేశంలోని వివిధ ప్రముఖ బ్రాండెండ్ జ్యూవెలరీ సంస్థలు సైతం బంగారం, వెండి విక్రయాలను పెంచుకునేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక తగ్గింపులు, డిస్కౌంట్లను ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. 


తూర్పు మార్కెట్లలో ఈ సారి అక్షయ తృతీయకు డిమాండ్ తగ్గుదల నమోదైంది. షాపులకు వచ్చిన కస్టమర్ల సంఖ్య భారీగా తగ్గిందని, అమ్మకాల్లో క్షీణత కనిపించిందని వెల్లడైంది. అయితే ఎక్కువ మంది వెడ్డింగ్ ఆభరణాలు, తేలికపాటి పసిడి వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుత ఏడాది కళ తప్పటానికి కీలక కారణాలను పరిశీలిస్తే.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంక్ విధానాలు వంటి కారణాల వల్ల గ్లోబల్ బంగారం ధరలు ప్రభావితమయ్యాయి. అస్థిర ఆర్థిక వ్యవస్థల్లో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు భారీ మెుత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయటం ప్రధానంగా రేట్ల పరుగులకు కారణంగా ఉంది. దీంతో 2024 మెుదటి మూడు నెలల త్రైమాసిక కాలంలో ప్రపంచ వ్యాప్తంగా బంగారం పెట్టుబడి డిమాండ్ 3% పెరిగిందని వెల్లడైంది.