Akshata Murty: యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రధాన మంత్రి రిషి సునక్ (UK PM Rishi Sunak) భార్య అక్షత మూర్తి ఒక్క రోజులో భారీ నష్టాన్ని చవిచూశారు. కేవలం ఒక్కరోజులోనే ఆమె నికర విలువ (Akshata Murthy Networth) ఏకంగా రూ. 500 కోట్లకు పైగా క్షీణించింది. ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌ నుంచి ఈ నష్టాన్ని ఆమె భరించాల్సి వచ్చింది.


ఇన్ఫోసిస్‌లో అక్షత వాటా           
భారతదేశంలో రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి కుమార్తె అక్షత. స్టాక్ ఎక్స్ఛేంజీలలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2022 డిసెంబర్ నాటికి ఇన్ఫోసిస్‌లో అక్షతకు 3,89,57,096 షేర్లు ఉన్నాయి. తాజా క్షీణతకు ముందు, ఆమె నికర విలువ సుమారు రూ. 4,500 కోట్లుగా ఉంది. ఇందులో ఎక్కువ భాగం ఇన్ఫోసిస్ షేర్ల రూపంలో ఉంది.


ఇన్ఫోసిస్ ధర పతనం              
నిన్న (సోమవారం, 17 ఏప్రిల్‌ 2023) భారత స్టాక్ మార్కెట్‌ భారీగా పడిపోయింది, ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువ కనిపించింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్ భారీ నష్టాలను ‍‌(Infosys Shares Collapse) చవిచూడాల్సి వచ్చింది. సోమవారం ఇన్ఫోసిస్ షేరు ధర 9.4 శాతం క్షీణించింది. 2020 మార్చి తర్వాత ఇన్ఫోసిస్ షేర్ల ధరల్లో ఇదే అతి పెద్ద పతనం. అక్షత ఆస్తుల నికర విలువ తగ్గడానికి ఇదే కారణం. ఇన్ఫోసిస్ షేర్ల క్రాష్ కారణంగా అక్షత దాదాపు 49 మిలియన్ పౌండ్లు లేదా 61 మిలియన్‌ డాలర్లు లేదా రూ. 500 కోట్లకు పైగా నష్టపోయారు.


డివిడెండ్‌ రూపంలో భారీ సంపాదన          
ఇన్ఫోసిస్, మార్చి 2023 త్రైమాసిక ఫలితాలను గత గురువారం విడుదల చేసింది. దీంతో పాటు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి తన వాటాదార్లకు ఒక్కో షేరుకు రూ. 17.50 తుది డివిడెండ్ ప్రకటించింది. ఇన్ఫోసిస్ మొత్తం పెయిడప్‌ క్యాపిటల్‌లో 1.07 శాతానికి సమానమైన 3.89 కోట్ల షేర్లు అక్షత పేరిట ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం, కంపెనీ డివిడెండ్ ద్వారా ఆమె ఏకంగా రూ. 68 కోట్లకు పైగా పొందబోతున్నారు. ఒక్కో షేరుకు రూ. 17.50 చొప్పున లెక్కిస్తే, ఇన్ఫోసిస్ తాజా డివిడెండ్ ద్వారా రూ. 68.17 కోట్లు ఆమె ఖాతాలో జమ అవుతాయి.


ఇవాళ (మంగళవారం, 18 ఏప్రిల్‌ 2023) ఉదయం 11 గంటల సమయానికి, BSEలో, ఇన్ఫోసిస్‌ షేర్ ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. ఆ సమయానికి ఒక్కో షేర్‌ 0.11% లేదా రూ. 1.10 లాభంతో రూ. 1,259.15 వద్ద కదులుతోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.