Adani Stocks: అమెరికన్‌ ఎలుగుబంటి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ‍‌(Hindenburg Research) కొట్టిన దెబ్బకు వారాల తరబడి కోమాలో ఉన్న అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ఇవాళ (గురువారం, ఫిబ్రవరి 16 2023) లాభాల ఊపిరి పీల్చుకుంటున్నాయి. బాగా తక్కువ రేటుకు పడిపోయిన ఈ షేర్లను కొనడానికి పెట్టుబడిదార్లు ఆసక్తి చూపడంతో గ్రీన్‌ కలర్‌లో ట్రేడవుతున్నాయి. అదానీ స్టాక్స్‌కు ఈ నెలలో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ రోజు.


ఇవాళ... అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్‌ స్టాక్స్‌లో ఎనిమిది గ్రీన్ జోన్‌లో ట్రేడవుతున్నాయి. NDTV, అదానీ పవర్ (Adani Power) 5% పెరిగి, వాటి అప్పర్ సర్క్యూట్‌ లిమిట్స్‌లో లాక్ అయ్యాయి. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ ఎంటిటీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) 2.4% పెరిగి రూ. 1,821 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది.


అదానీ స్టాక్స్‌లో ఈ హఠాత్‌ మార్పు ఎందుకు?
ఇండెక్స్ ప్రొవైడర్ MSCI అదానీ గ్రూప్‌నకు ఒక చల్లటి కబురు చెప్పింది. అదానీ టోటల్ గ్యాస్ (Adani Total), అదానీ ట్రాన్స్‌మిషన్ ‍‌(Adani Transmission) వెయిటేజీల అప్‌డేట్‌ అమలును మే నెల సమీక్ష వరకు వాయిదా వేస్తున్నట్లు నిన్న (బుధవారం, ఫిబ్రవరి 15 2023) ప్రకటించింది. ఇది వీటికి గుడ్‌న్యూస్‌. అయితే, ఈ రెండు స్టాక్స్‌ ఇవాళ రెడ్ జోన్‌లో ట్రేడ్ అవుతున్నాయి.


MSCI ఇండెక్స్‌లో వెయిటేజీని తగ్గించడం వల్ల ఈ స్టాక్స్‌ నుంచి పాసివ్‌ ఫండ్స్‌ బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా అమ్మకాలు విపరీతంగా పెరిగి షేర్‌ ధరలు పడిపోతాయి. అంతేకాదు, ఇండెక్స్‌ వెయిటేజీని తగ్గించడాన్ని పెట్టుబడిదార్ల సొసైటీ నెగెటివ్‌గా చూస్తుంది, సెంటిమెంట్‌ దెబ్బతింటుంది. అంటే, ఈ స్టాక్స్‌లో వెయిటేజీ మార్పు నిర్ణయంతో పాటు బారీ సెల్లింగ్‌ను కూడా MSCI వాయిదా వేసినట్లే. అదానీ స్టాక్స్‌కు ఇది మంచి కబురు.


అదానీ గ్రూప్ కంపెనీలైన అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ACC కంపెనీల వెయిటేజీని మార్చి 1 నుంచి తగ్గిస్తామని MSCI గత వారం చెప్పింది. జనవరి 30 నాటికి, MSCI ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో ‍‌(MSCI emerging markets index) ఈ నాలుగు కంపెనీలకు కలిపి 0.4% వెయిటేజీ ఉంది. 


సగం విలువ ఆవిరి
2023 జనవరి 24న, అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ‍‌(Hindenburg Research) బ్లాస్లింగ్‌ రిపోర్ట్‌ను విడుదల చేసినప్పటి నుంచి, గత 16 ట్రేడింగ్ సెషన్లలో అదానీ స్టాక్స్‌ దాదాపు రూ. 10 లక్షల కోట్లను కోల్పోయాయి. గ్రూప్‌ మార్కెట్ విలువ సగానికి సగం తగ్గింది.


ఇండెక్స్‌ వెయిటేజీలో మార్పులు ఉంటాయని ప్రకటించిన కొన్ని రోజుల్లోనే, దానిని వాయిదా వేస్తూ ఎందుకు నిర్ణయం తీసుకున్నారన్న అంశం మీద స్పందన కోసం రాయిటర్స్ ఈ-మెయిల్‌ పంపినా MSCI వెంటనే స్పందించలేదు. నిర్ణయం వాయిదాపై అదానీ గ్రూప్‌ కూడా స్పందించలేదు.


హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ నివేదికను అదానీ గ్రూప్‌ ఖండించింది. తమ కంపెనీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కంపెనీల ఆర్థిక ఆరోగ్యం పటిష్టంగా ఉందని ప్రకటించింది.


అదానీ గ్రూప్‌ కంపెనీల బాండ్ ఇన్వెస్టర్లతో ఇవాళ (2023 ఫిబ్రవరి 16), ఫిబ్రవరి 21 తేదీల్లో చర్చలు జరపాలని గ్రూప్‌ నిర్ణయించినట్లు రాయిటర్స్ రిపోర్ట్‌ చేసింది.


ALSO READ:  అదానీ నెత్తిన పాలు పోసిన MSCI, వెయిటేజీ మార్పులు వాయిదా


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.