Adani Stocks: మార్కెట్ ఎలా ఉన్న అదానీ గ్రూప్ షేర్లలో దూకుడు ఆగడం లేదు. రాబడుల్ని చాలా వేగంగా ఇన్వెస్టర్లకు తెచ్చి పెడుతున్నాయా గ్రూప్ కంపెనీలు. వరుసగా ఏడో రోజున కూడా గ్రూప్ షేర్లు అప్‌సైడ్ ట్రెండ్‌ను (Adani Stocks Rally) కంటిన్యూ చేశాయి.
ఇవాళ (గురువారం, 09 మార్చి 2023) మార్కెట్ గ్యాప్-డౌన్ అయినా.. ట్రేడింగ్ ప్రారంభంలోనే అదానీ గ్రూప్‌లోని 6 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్‌లో (Adani Share Upper Circuit) లాక్ అయ్యాయి.
గ్రీన్ జోన్‌లో అదానీ స్టాక్స్
ఇవాళ మార్కెట్ నెగెటివ్‌గా ప్రారంభం కావడంతో, అదానీ గ్రూప్‌లోని 3-4 స్టాక్స్ స్వల్ప పతనంతో ప్రారంభం అయ్యాయి. అయితే, కొన్ని నిమిషాల్లోనే అవి పచ్చ రంగు పులుముకున్నాయి. గ్రూప్‌లోని మొత్తం 10 స్టాక్స్ లాభపడ్డాయి.
అదానీ గ్రీన్ (Adani Green), అదానీ పవర్ Adani Power), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ విల్మార్ (Adani Wilmar), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), ఎన్‌డీటీవీ (NDTV) షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకి ఆగిపోయాయి. ఈ ఆరు స్టాక్‌లు వరుసగా మూడో రోజు కూడా అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి.
ఉదయం 11.20 గంటల సమయానికి... అదానీ విల్మార్, NDTV షేర్లు అప్పర్ సర్క్యూట్ నుంచి కిందికి దిగాయి. అదానీ విల్మార్ 4%, ఎన్‌డీటీవీ 2% లాభంతో కొనసాగుతున్నాయి. అదే సమయానికి, గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) షేర్ ధర ప్రస్తుతం రూ. 98.05 లేదా 4.81% నష్టంతో నడుస్తోంది. అంబుజా సిమెంట్స్ (Ambuja Cements) షేర్ కూడా దాదాపు 2% పతనంతో రూ. 386 వద్ద ఉంది.
విపరీతమైన రాబడి
గత నెలలో, గ్రూప్‌లోని చాలా షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. అయితే, ఇప్పుడు అవే షేర్లు దాదాపు 100 శాతం రాబడిని ఇచ్చాయి.
మరిన్ని పెట్టుబడుల యోచనలో రాజీవ్ జైన్
NRI ఇన్వెస్టర్ రాజీవ్ జైన్‌కు చెందిన ఇన్వెస్టింగ్ కంపెనీ GQG పార్టనర్స్ గత వారం అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో రూ. 15,446 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. దీర్ఘకాలంలో అదానీ గ్రూప్ కంపెనీలకు చాలా అవకాశాలు ఉన్నాయని రాజీవ్ జైన్ చెప్పారు. అందుకే, మంచి విలువ వద్ద ఆయా షేర్లను దక్కించుకున్నట్లు వెల్లడించారు. అదానీ షేర్లలో తన కంపెనీ ఇంకా ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టవచ్చని కూడా ఒక హింట్ ఇచ్చారు. ఇదే సమయంలో, చెప్పిన మాట ప్రకారం, అదానీ గ్రూప్ కొన్ని రుణాలను ముందుగానే చెల్లించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.