Adani Stocks: ఫిబ్రవరి నెలలో అదానీ స్టాక్స్‌ భారీ పతనంలో మ్యూచువల్ ఫండ్స్ ‍‌(MFలు) హస్తం కూడా ఉంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఆరోపణల కారణంగా, అదానీ కంపెనీల షేర్లను భారీ స్థాయిలో అమ్మేశారు మనీ మేనేజర్లు. ప్రస్తుతం, ఆ పరిస్థితికి రివర్స్‌లో ఉన్నారు.


భలే మంచి చౌక బేరము
అదానీ స్టాక్‌లలో భారీ అమ్మకాల వల్ల అవి చౌక ధరల్లోకి మారాయి. దీనిని మ్యూచువల్‌ ఫండ్స్‌ క్యాష్‌ చేసుకున్నాయి. ACC, అదానీ గ్రీన్ ఎనర్జీ ‍‌(Adani Green Energy), అదానీ పవర్ (Adani Power), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ విల్మార్‌ (Adani Wilmar) షేర్లను చాలా తక్కువ ధరల వద్ద ఫండ్‌ మేనేజర్లు కొన్నట్లు ACE MF డేటాను బట్టి అర్ధం అవుతోంది.


ఫిబ్రవరి నెలలో, అదానీ గ్రీన్ ఎనర్జీలో 30,744 షేర్లను MFలు కైవసం చేసుకున్నాయి. పాసివ్ ఫండ్స్‌ కూడా ఈ షేర్లను కొన్నాయి. బుధవారం నాడు 5% లాభంతో రూ. 740.95 వద్ద ముగిసిన ఈ షేరు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 3,048 నుంచి 76% దిగువన ట్రేడవుతోంది.


52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి సగానికి పైగా క్షీణించిన అదానీ పవర్‌లోనూ 16,731 షేర్లను ఎంఎఫ్‌లు కొనుగోలు చేశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌లో డిప్‌ను కూడా ఫండ్ మేనేజర్లు వాడుకున్నారు. ఇది గరిష్ట స్థాయి నుంచి 78% తక్కువలో ట్రేడవుతోంది. ఈ 3 స్టాక్స్‌ను కొన్న మొత్తం మ్యూచువల్ ఫండ్ పథకాల సంఖ్య కూడా తలా ఒకటి చొప్పున పెరిగింది. 


9,000కు పైగా అదానీ విల్మార్ షేర్లను ఫండ్ హౌస్‌లు కొన్నాయి. ఈ స్టాక్‌ను కలిగి ఉన్న మ్యూచువల్ ఫండ్ పథకాల సంఖ్య 13 నుంచి 15 కి పెరిగింది.


ACC విషయానికొస్తే, MFల షేర్ల వాటా పెరిగినప్పటికీ, స్టాక్‌కు సంబంధించిన మ్యూచువల్ ఫండ్ పథకాల సంఖ్య 140 నుంచి 5 తగ్గింది, 135కి దిగి వచ్చింది.


మరో 4 కంపెనీల్లో వాటాలు అమ్మకం
అదానీ గ్రూప్‌లోని 5 కంపెనీల్లో వాటాలు పెంచుకున్న ఫండ్‌ హౌస్‌లు, మరో 4 కంపెనీల్లో వాటాలు తగ్గించుకున్నాయి. అవి... అదానీ ఎంటర్‌ప్రైజెస్ ‍‌(Adani Enterprises), అదానీ పోర్ట్స్ ‍‌(Adani Ports), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas), అంబుజా సిమెంట్స్‌ (Ambuja Cements). 


అంబుజా సిమెంట్స్‌లో... PPFAS, SBI, మోతీలాల్ ఓస్వాల్, టాటా, క్వాంట్ హౌస్‌ల వాటా తగ్గితే, కోటక్ వీటికి వ్యతిరేక మార్గంలో వెళ్ళింది. అదానీ పోర్ట్స్‌లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, IDFC, ఎడెల్‌వీస్, SBI, టాటా, క్వాంట్ మ్యూచువల్ ఫండ్‌లు తమ హోల్డింగ్‌ తగ్గించుకున్నాయి.


అదానీ గ్రూప్‌లో క్యాష్ పార్టీ అయిన అదానీ పోర్ట్స్‌ను 21 మంది ఎనలిస్ట్‌లు కవర్‌ చేస్తున్నారు. వీళ్లందరి సిఫార్సు "బయ్‌". ఇతర అదానీ స్టాక్స్‌లో బ్రోకరేజీల కవరేజీ చాలా తక్కువగా ఉంది.


గ్రూప్ సమస్యలకు అతీతంగా ఫండమెంటల్స్‌పై పెట్టుబడిదార్లు దృష్టి పెడితే, అదానీ పోర్ట్స్ రూ. 800 వరకు ర్యాలీ చేయగలదని జెఫరీస్ భావిస్తోంది. అదానీ పోర్ట్స్ మార్కెట్‌ వాటా FY15లోని 14% నుంచి బలంగా పెరుగుతూ ఇప్పుడు 22%కు చేరిందని, FY25 నాటికి 29%కు చేరవచ్చని అంచనా వేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.