Adani Group stocks:
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెడుతున్నాయి! ఒలింపిక్స్ రన్నింగ్ రేసులో మాదిరిగా స్ప్రింట్ చేస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా షేర్ల ధరలు పైపైకి పెరుగుతున్నాయి. దాదాపుగా అన్ని కంపెనీల షేర్లు 10-5 శాతం వరకు ఎగిశాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మళ్లీ ఈ కౌంటర్లో ఎంటర్ అవుతున్నారు. సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ తప్పు జరిగిందనేందుకు ప్రాథమిక ఆధారాలేమీ లేవని చెప్పడమే ఇందుకు కారణం.
ఫోకస్‌లో అదానీ షేర్లు
అదానీ విల్మార్ షేర్లు అత్యధికంగా 10 శాతం పెరిగాయి. రూ.40 లాభంతో రూ.444 వద్ద కొనసాగుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 9.7 శాతం ఎగిశాయి. రూ.189 లాభంతో రూ.2146 వద్ద ట్రేడవుతున్నాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ స్టాక్స్ 7.2 శాతం పెరిగి రూ.737 వద్ద చలిస్తున్నాయి. అదానీ పవర్ లిమిటెడ్ 5 శాతం పెరిగి రూ.247 వద్ద ట్రేడవుతున్నాయి. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం లాభపడింది. రూ.34 పెరిగి రూ.722 వద్ద షేర్లు కొనసాగుతున్నాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ 5 శాతం ఎగిసి రూ.39 లాభంతో రూ.826 వద్ద కదలాడుతున్నాయి. ఎన్డీటీవీ షేర్లూ భారీగా పెరిగాయి. 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకడంతో రూ.8 లాభంతో రూ. 186 వద్ద చలిస్తున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 5 శాతం రూ.44 లాభంతో రూ.941 వద్ద ఉన్నాయి. అంబుజా సిమెంట్స్ 4.4 శాతం ఎగిసి రూ.17 లాభంతో రూ.420 వద్ద ట్రేడవుతున్నాయి. ఏసీసీ లిమిటెడ్ 3.8 శాతం పెరిగి రూ.65 పెరిగి రూ.1794 వద్ద చలిస్తున్నాయి.
Also Read: ICICI బ్యాంక్ వడ్డీ రేట్లు మారాయ్, మీ FDపై ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోండి
సుప్రీం కమిటీ నివేదిక
అదానీ కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ నివేదికను శుక్రవారం సమర్పించింది. ధరల హెచ్చుతగ్గుల్లో సెబీ విధానపరంగా విఫలమైందని ఇప్పుడే చెప్పలేమని వెల్లడించింది. హిండెన్‌బర్గ్ - అదానీ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరుకోవడంతో, అదానీ గ్రూప్‌లో రిలేటెట్ పార్టీ లావాదేవీలపై సెబీ దర్యాప్తు మొదలు పెట్టింది. దాంతో సుప్రీం కోర్టు ఆరుగురు వ్యక్తులతో నిపుణుల కమిటీని నియమించింది.
విధాపరమైన వైఫల్యం గురించి కమిటీ మాట్లాడుతూ... ప్రస్తుత నిబంధనల ప్రకారం రెగ్యులేటరీ ఫెయిల్యూర్ కనిపించలేదని కమిటీ తెలిపింది. హిండెన్ బర్గ్ నివేదిక పబ్లిష్ అవ్వక ముందే కొందరు అదానీ కంపెనీల్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని సెబీ కొనుగొంది. నివేదిక రాగానే.. షేర్ల ధరలు క్రాష్ అవ్వగానే ఆ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసి భారీ లాభపడ్డాయని తెలుసుకొంది. కాగా అదానీ కంపెనీల షేర్ల ధరలు స్థిరంగా ఉన్నాయని, సమీక్ష జరిగిందని కమిటీ తెలిపింది. 'జనవరి 24 ముందునాటి స్థాయిలకు ధరలు చేరకున్నా ప్రస్తుతం షేర్ల ధరలు నిలకడగా ఉన్నాయి. సరికొత్త స్థాయిల్లో ట్రేడవుతున్నాయి' అని పేర్కొంది.
మూడు నెలలు ఇబ్బంది
హిండెన్‌బర్గ్ షార్ట్ సెల్లింగ్ తర్వాత అదానీ గ్రూప్‌లోని 10 కంపెనీల షేర్ల విలువ రూ.12.06 లక్షల కోట్ల పతనమైంది. ఇది దేశంలోనే రెండో అత్యంత విలువైన టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో సమానం. అదానీ టోటల్ గ్యాస్‌పై ఎక్కువ దెబ్బ పడింది. ఏకంగా 80.68 శాతం మార్కెట్ విలువ నష్టపోయింది. ఇక అదానీ ఎనర్జీ 76.62 శాతం విలువను కోల్పోయింది. అదానీ ట్రాన్స్‌మిషన్ జనవరి 24 నుంచి 74.21 శాతం నష్టపోయింది. అదానీ పవర్, అదానీ విల్మార్, గ్రూపు సిమెంటు కంపెనీలు, అదానీ పోర్ట్స్ చాలా వరకు మార్కెట్ విలువను కోల్పోవాల్సి వచ్చింది. ఈ పది కంపెనీల్లో గౌతమ్ అదానీ మార్కెట్ విలువ ప్రకారం 80.06 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు. హిండెన్‌బర్గ్ నివేదిక ముందు ఆయన సంపద విలువ 120 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇప్పుడు 40 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.