Adani Group: ఇవాళ (బుధవారం, 29 మార్చి 2023), అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ (Adani Group Stocks) మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. 'ది కెన్' నివేదికపై (The Ken report) స్పందించిన అదానీ గ్రూప్‌, ఆ రిపోర్ట్‌ "నిరాధారం, ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన తప్పుడు నివేదిక"గా వర్ణిస్తూ అని పిలుస్తూ వివరణ ఇచ్చింది. 


అదానీ అబద్ధం చెప్పారన్న కెన్‌
ఎక్సేంజీలకు, ఇన్వెస్టర్లకు, షేర్‌హోల్డర్లకు గౌతమ్‌ అదానీ అబద్ధాలు చెప్పారని; షేర్లను తాకట్టి పెట్టి తీసుకున్న రుణాల్లో 2.15 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించామని ఈ గ్రూప్‌ ప్రకటించడం బూటకమని, ఆ అప్పులను చెల్లించలేదని ది కెన్‌ రిపోర్ట్‌ చేసింది. ఈ నివేదిక నేపథ్యంలో నిన్న (మంగళవారం) అదానీ షేర్లు బొక్కబోర్లా పడ్డాయి. ఆ రిపోర్ట్‌లో రాసింది అబద్ధమంటూ అదానీ గ్రూప్‌ CFO ప్రకటించడంతో, ఇవాళ ఉదయం కొద్దిగా తేరుకున్నాయి.


2.15 బిలియన్ డాలర్ల విలువైన మార్జిన్-లింక్డ్ షేర్-బ్యాక్డ్ రుణాల ముందస్తు చెల్లింపును పూర్తి చేసినట్లు ఈ గ్రూప్‌ మంగళవారం రాత్రి ఎక్స్ఛేంజీలకు అప్‌డేట్‌ చేసింది. రుణాలు చెల్లించాం కాబట్టి, తాకట్టు పెట్టిన అన్ని షేర్లు విడుదలయ్యాయని కూడా పేర్కొంది.


ప్రారంభ సెషన్‌లో స్టాక్స్‌ పనితీరు
అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌ షిప్ కంపెనీ, నిఫ్టీ50 ఇండెక్స్‌లో భాగమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises), అదానీ పోర్ట్స్ (Adani Ports) అదానీ ప్యాక్‌లో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ప్రారంభ సెషన్‌లో.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.09% పెరిగి రూ. 1,618 వద్ద ట్రేడవుతుండగా, అదానీ పోర్ట్స్ 1.5% పెరిగి రూ. 602.25 కి చేరుకుంది.


అదే సమయానికి... అంబుజా సిమెంట్స్ ‍‌(Ambuja Cements) షేర్లు 0.36% పెరిగి రూ. 360.25 వద్ద ఉన్నాయి. ACC 1.37% పెరిగి రూ. 1,636 వద్ద ఉండగా, అదానీ పవర్ (Adani Power) 1.5% పెరిగి రూ. 176.45 వద్దకు చేరుకుంది. న్యూఢిల్లీ టెలివిజన్ (NDTV) 0.89% పెరిగి రూ. 175.50 వద్ద ఉంది.


అదానీ గ్రీన్ ఎనర్జీ ‍(Adani Green Energy), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas) మాత్రం 5% లోయర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి.


బాంబ్‌ పేల్చిన ఫిచ్‌ రేటింగ్స్‌
రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ (Fitch) కూడా, మంగళవారం సాయంత్రం ఒక బ్లాస్టింగ్‌ న్యూస్‌ ఇచ్చింది. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పోర్ట్స్‌లో స్పాన్సర్ స్థాయిలో పరిపాలన పరమైన బలహీనతలు ఉన్నాయని, అవి అంటువ్యాధిలా మిగిలిన కంపెనీలకూ వ్యాపిస్తున్నాయని ప్రకటించింది. దీనివల్ల ఈ గ్రూప్‌ కంపెనీలకు రుణాలు దొరికే సౌలభ్యం ప్రభావితం అయ్యే ప్రమాదం కనిపిస్తోందని హెచ్చరించింది.


ACC, అంబుజా సిమెంట్స్‌ను కొనుగోలు చేసేందుకు గత ఏడాది తీసుకున్న $4 బిలియన్ల విలువైన రుణాలను గడువులోగా తీర్చలేక, మళ్లీ చర్చలు జరపాలని అదానీ గ్రూప్‌ ప్రయత్నిస్తోందన్న వార్తలు రావడం కూడా మంగళవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పతనానికి కారణమయ్యాయి.


2023 జనవరి 24 నాటి హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత నుంచి ఇప్పటి వరకు అదానీ గ్రూప్ స్టాక్స్ 22% నుంచి 80% వరకు నష్టపోయాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.