భోజనం చేసే సమయంలోనే కాదు, భోజనం పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఈ నియమాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. భోజనం చేశాక కొన్ని పనులు చేయడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటివి ఇబ్బంది పెట్టొచ్చు. ఈ సమస్యలు ముదిరితే అల్సర్లుగా కూడా మారచ్చు. కాబట్టి భోజనం చేశాక చేయకూడని పనుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


కొంతమంది భోజనం చేశాక ధూమపానం చేయడానికి ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. ధూమపానం చేయడం వల్ల అందులో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు గాలి ద్వారా మన పొట్టలోకి చేరుతాయి. ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది పెడతాయి. అంతేకాదు కొలన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను వచ్చే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి భోజనం చేశాక గంట వరకు ధూమపానం నిషేధించాలి.


అలాగే భోజనం చేశాక చాలామందికి నిద్ర వచ్చేస్తుంది. అయినా సరే నిద్రపోకూడదు. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వాలన్నా, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా భోజనం తిన్న వెంటనే నిద్ర పోకూడదు. నిద్రలో జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం అవ్వక ఇబ్బందులు ఎదురవుతాయి. పొట్టనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది.


స్నానం వద్దు
భోజనం చేసిన వెంటనే స్నానం చేయవద్దని ప్రాచీన కాలం నుంచి పెద్దలు చెబుతూనే ఉన్నారు. దీన్ని పాటించే వారి సంఖ్య తగ్గిపోతోంది. భోజనం చేసిన తర్వాత ఆహారం సరిగా జీర్ణం కావాలంటే ఎక్కువ శక్తి అవసరం పడుతుంది. అయితే భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల మన శరీరంలో శక్తి తగ్గుతుంది. శరీరం చల్లబడుతుంది. దీనివల్ల ఆహారం జీర్ణం అయ్యే శాతం కూడా తగ్గుతుంది. కాబట్టి భోజనం చేశాక కనీసం రెండు గంటల పాటు స్నానం చేయకుండా ఉండాలి. 


పొట్ట నిండా ఆహారం తిన్నాక టీ తాగే వాళ్ళు ఎంతోమంది. ఇలా చేయడం వల్ల శరీరం, ఇనుమును శోషించుకోకుండా అడ్డుకున్నట్టు అవుతుంది. మనం చేసిన భోజనంలో ఐరన్ నిండి ఉన్న పదార్థాలు ఉంటే, టీ తాగడం వల్ల ఆ ఐరన్‌ను శరీరం శోషించుకోదు. కాబట్టి ఐరన్ లోపం వచ్చే అవకాశం ఉంది. ఐరన్ లోపం వస్తే రక్తహీనత, నీరసం, అలసట వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి భోజనం చేశాక కనీసం గంట గ్యాప్ ఇచ్చి అప్పుడు టీ తాగాలి.


పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. కానీ భోజనం పూర్తయిన వెంటనే మాత్రం పండ్లను తినకండి. అలాగే చల్లటి నీటిని కూడా తాగకూడదు. చల్లని నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయంలో మన ఆహారాన్ని జీర్ణం చేసే రసాలు చల్లబడతాయి. అవి ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయలేవు. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకంలాంటి సమస్యలు వస్తాయి. 


Also read: బరువు తగ్గించే ఆహారాల్లో చియా విత్తనాలు ఒక భాగం- వీటితో డయాబెటిస్ అదుపులో













































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.