ITC Shares: హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత దెబ్బతిన్న అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి, అదానీ గ్రూప్‌నకు మళ్లీ జవసత్వాలు అందించిన US ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ GQG పార్ట్‌నర్స్ గుర్తుందా?. ఈ కంపెనీ పెట్టుబడుల తర్వాత అదానీ గ్రూప్ స్టాక్స్‌లో పతనం ఆగింది, మళ్లీ పైకి ప్రయాణం ప్రారంభించాయి. అదే GQG పార్ట్‌నర్స్, సిగరెట్-టు-హోటల్ వ్యాపారం చేసే ITC కంపెనీలో మరిన్ని ఎక్కువ షేర్లను కొనుగోలు చేసింది.
మార్చి త్రైమాసికంలో అదనంగా 19.17 లక్షల షేర్లు
NRI ఇన్వెస్టర్ రాజీవ్ జైన్ నిర్వహిస్తున్న GQG పార్ట్‌నర్స్‌కు ITCలో చాలా ఏళ్లుగా వాటా ఉంది. డిసెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి ITCలో హోల్డింగ్ 1.29%గా ఉంటే, మార్చి త్రైమాసికం చివరి నాటికి అది 1.44%కి పెరిగింది. అంటే, నాలుగో త్రైమాసికంలో అదనంగా 19.17 లక్షల షేర్లను GQG పార్టనర్స్ జోడించింది.
తాజా షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం, నాలుగో త్రైమాసికంలో కొత్తగా యాడ్ చేసిన 19.17 లక్షల షేర్లతో కలిపి, GQG పార్టనర్స్‌కు ITC కంపెనీలో మొత్తం 17,87,71,863 షేర్లు ఉన్నాయి.
మార్చి త్రైమాసికం ముగింపు నాటికి, అన్ని మ్యూచువల్ ఫండ్‌లకు ఐటీసీలో 9.47% వాటా ఉండగా, బీమా కంపెనీలకు 20.44% స్టేక్ ఉంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) హోల్డింగ్ 14.21% వద్ద ఉండగా, రిటైల్ ఇన్వెస్టర్లకు కంపెనీలో 12.42% వాటా ఉంది.
సోమవారం (17 ఏప్రిల్ 2023) ట్రేడ్‌లో, ITC షేర్లు మొదటిసారిగా రూ. 400 మార్కును అధిగమించాయి. ఆ తర్వాత, రూ. 402 వద్ద తాజా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరాయి.
ఇవాళ (బుధవారం, 19 ఏప్రిల్ 2023) వీక్ మార్కెట్ కారణంగా ITC షేర్లు గ్యాప్ డౌన్‌లో ప్రారంభం అయినా, ఉదయం 10.50 గంటల సమయానికి పుంజుకున్నాయి. ఆ సమయానికి ఒక్కో షేరుకు 0.38% లేదా రూ. 1.50 లాభంతో రూ. 399.95 వద్ద కదులుతున్నాయి.
ప్రైస్ యాక్షన్
ITC స్క్రిప్ ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD) దాదాపు 20% పైగా లాభంతో నిఫ్టీ ప్యాక్‌లో అత్యుత్తమంగా నిలిచింది. దీంతో పోలిస్తే, బెంచ్‌మార్క్ నిఫ్టీ 0.68% ప్రతికూల రాబడిని అందించింది. గత ఒక ఏడాది కాలంలో 50% పైగా జంప్‌తో, ఈ కాల వ్యవధిలో నిఫ్టీ ప్యాక్‌లో టాప్ గెయినర్‌గా అవతరించింది. గత రెండేళ్ల కాలంలో దాదాపు రెండింతలు పెరిగింది.
2022 సెప్టెంబరు నుంచి 2023 జనవరి మధ్యకాలంలో ఈ స్టాక్ కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. ఆ సమయంలో రూ. 318 నుంచి రూ. 356 స్థాయికి మాత్రమే చేరుకోగలిగింది. ఆ కాలంలో వాల్యూమ్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. రూ. 356 వద్ద కన్సాలిడేషన్ స్టేజ్‌ను బద్ధలు కొట్టిన తర్వాత, ఒక్కసారిగా విజృంబించింది. భారీ వాల్యూమ్స్ సాయంతో బలంగా పైకి ఎగసింది, అప్పటి కొత్త ఆల్ టైమ్ హై రూ. 394 స్థాయికి చేరింది. ఆ తర్వాత జనవరి మధ్యకాలం నుంచి మరింత బలంగా పంజుకుంది, ప్రస్తుత ఆల్ టైమ్ హై రూ. 402 ను సృష్టించింది.
"ప్రస్తుత స్థాయి నుంచి ఈ స్టాక్ పడిపోతే, రూ. 382 వద్ద పెట్టుబడిదార్లు కొనుగోలు చేయవచ్చు. రూ. 450-490 టార్గెట్ ప్రైస్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్‌ను రూ. 365 వద్ద ఉంచాలి" - SAJ ఫైనాన్స్ & సెక్యూరిటీస్
బ్రోకరేజ్ JM ఫైనాన్షియల్, ITC స్టాక్ మీద "బయ్" రేటింగ్‌తో రూ. 440 టార్గెట్ ధరను ప్రకటించింది. షేర్‌ఖాన్ కూడా స్టాక్‌పై "బయ్" రేటింగ్‌ను రూ. 450 టార్గెట్ ధరను కలిగి ఉంది.
డిసెంబర్ త్రైమాసికంలో, ITC నికర లాభం సంవత్సరానికి 21% పెరిగి రూ. 5,031 కోట్లు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 2% పెరిగి రూ. 16,226 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.