కేసీఆర్ - మోదీ మధ్య పెరిగిన అంతరాలు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని దూరం చేస్తోంది. విద్యాంజలి - 2 అనే పథకాన్ని కేంద్రం అదానీ సౌజన్యంతో తీసుకురానుండగా, తెలంగాణలో అది అమలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మోదీ - అదానీకి లబ్ధి చేకూరుస్తున్నారనే ఆరోపణలు, దానిపై తెలంగాణ ప్రభుత్వం పోరాట ధోరణి అనుసరిస్తుండగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. విద్యాంజలి - 2 పథకాన్ని అదానీ స్పాన్సర్ చేస్తుండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.


పాఠశాలల్లో విద్యార్థులకు స్కిల్‌ డెవలప్ మెంట్‌, కెరీర్‌ గైడెన్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌ లాంటివాటిని నేర్పించే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం విద్యాంజలి-2 పథకం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం నిలిపి వేసింది. ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త అదానీ బంధంపై రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అదానీ గ్రూపు కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరిపించాలని పార్లమెంటులోనూ, బయటా పోరాటం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యాంజలి-2 కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదని భావించినట్లు తెలిసింది. 


అదానీ గ్రూపుతో కలిసి విద్యాంజలి 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తే లేని పోని విమర్శలు వచ్చే అవకాశం ఉందనే అంచనాతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిని అమలు చేస్తే భవిష్యత్తులో అదానీ గ్రూపుపై తీవ్ర విమర్శలు చేయడానికి ఈ పథకం అడ్డు వస్తుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకే విద్యాంజలి - 2 పథకం అమలు చేయొద్దని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.


విద్యాంజలి పథకం అంటే..
విద్యాంజలి పథకాన్ని ప్రధాని మోదీ 2021 సెప్టెంబరులో ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత, సౌకర్యాలు పెంచేందుకు ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళి. స్వచ్ఛందంగా, వ్యక్తిగతంగా కూడా ఎవరైనా విద్యా బోధన చేసేందుకు వాలంటీర్లుగా చేరొచ్చు. పాఠాలతో పాటు యోగా, సంగీతం, క్రీడలు పిల్లలకు నేర్పవచ్చు. ఇందుకు ఎలాంటి జీతాలు చెల్లించరు. దీన్నే విద్యాంజలి 2.0 అని పిలుస్తారు. ఆ కార్యక్రమాన్ని 2022 సెప్టెంబరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.


ఆసక్తి ఉన్నవారు విద్యాంజలి పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ప్రైవేట్‌ సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, సైకాలజిస్టులు, వివిధ రంగాల్లో నిపుణులు ఇందులో వలంటీర్లుగా ఉంటారు. వీరు విద్యార్థులకు చదువులో సహకరిస్తారు. యోగా, డిజిటల్‌ స్కిల్స్‌, ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తదితరాల్లో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు. పోటీ, ఎంట్రన్స్‌ పరీక్షలకు సన్నద్ధం కావడానికి సహకరిస్తారు. ప్రతిభావంతులకు మరింత సాన పెడతారు. బాలికలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 


విద్యాంజలి 2 పథకం అమలుకు అదానీకి చెందిన ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌తో పాటు ఏపీఎల్‌ హెల్త్‌కేర్‌ ఫౌండేషన్‌ తదితర ప్రైవేట్‌ సంస్థలు ముందుకు వచ్చాయి. రిటైర్డ్‌ ప్రొఫెసర్లు, రిటైర్డ్‌ డిఫెన్స్ అధికారులు, వివిధ రంగాల్లో నిపుణులు తదితరులు ఉచితంగానే వలంటీర్లుగా సేవలు అందించాల్సి ఉంటుంది.