Adani Green Energy: శ్రీలంకలోని మన్నార్ & పూనెరిన్‌లో అదానీ గ్రూప్‌నకు చెందిన 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు (wind power projects) రద్దు అయ్యాయన్న వార్తలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. నేషనల్ మీడియా రిపోర్ట్ చేసినవి తప్పుడు వార్తలని & ఇన్వెస్టర్లు, షేర్‌హోల్డర్లను తప్పు దారి పట్టించేవిగా ఉన్నాయని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీలంక గ్రీన్ ఎనర్జీ సెక్టార్‌లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి అదానీ గ్రూప్ కట్టుబడి ఉందని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు.
"మన్నార్ & పూనెరిన్‌లలో అదానీ గ్రూప్‌నకు చెందిన 484 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు రద్దయ్యాయన్న రిపోర్ట్స్ అబద్ధం & అవి తప్పుడు రాతలు. PPA (power purchase agreement) రద్దు కాలేదని స్పష్టం చేస్తున్నాం" అని గ్రూప్ ప్రతినిధి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
2024 మే నెలలో ఆమోదించిన సుంకాన్ని (tariff) పునఃసమీక్షించాలని శ్రీలంక మంత్రివర్గం జనవరి 02న నిర్ణయం తీసుకుంది.
"ఏ దేశంలోనైనా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు, ఆ ప్రభుత్వ ప్రాధాన్యతలు & ఇంధన విధానాలకు అనుగుణంగా రూల్స్ ఉన్నాయో, లేదో నిర్ధరించుకోవడానికి సమీక్ష నిర్వహించడం సర్వసాధారణం. శ్రీలంక గ్రీన్ ఎనర్జీ రంగంలో అదానీ గ్రూప్ 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడి శ్రీలకం పునరుత్పాదక శక్తిని & ఆర్థిక వృద్ధిని నడిపిస్తుంది" అని అదానీ గ్రూప్ ప్రతినిధి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
442 మిలియన్ డాలర్ల పెట్టుబడి
అదానీ గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేసిన రెండు పవన విద్యుత్ కేంద్రాల నుంచి 20 సంవత్సరాల పాటు విద్యుత్ కొనుగోలు చేయడానికి శ్రీలంక ప్రభుత్వం ఒప్పందాన్ని (PPA) కుదుర్చుకుంది. శ్రీలంక ఉత్తర ప్రావిన్స్‌లోని మన్నార్ పట్టణం & పూనెరిన్ గ్రామంలో 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లు నిర్మించేందుకు 442 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి అదానీ గ్రీన్ ఎనర్జీకి శ్రీలంక ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం, అదానీ గ్రీన్ ఎనర్జీకి ఒక కిలోవాట్-అవర్ (kWh)కు 8.26 సెంట్లను శ్రీలంక సర్కారు చెల్లిస్తుంది.
PPAలు రద్దయినా ప్రాజెక్టులు ఉంటాయి
అయితే, మన్నార్ & పూనెరిన్‌లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని అదానీ గ్రీన్ ఎనర్జీ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. దీంతో, అదానీ గ్రూప్‌తో PPA రద్దు చేసుకుంటామని దిస్సనాయకే ప్రభుత్వం హింట్స్ ఇచ్చింది. ఒకవేళ PPAలను రద్దు చేసినప్పటికీ ప్రాజెక్టులను మాత్రం రద్దు చేయబోమని చెప్పింది. ఈ నేపథ్యంలో, అదానీ విద్యుత్ ప్రాజెక్టులు రద్దు అయ్యాయంటూ నేషనల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అయ్యాయి.
కొలంబోలో అతి పెద్ద ఓడరేవులో అదానీ గ్రూప్ 700 మిలియన్ డాలర్లతో టెర్మినల్ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి కూడా గతంలోనే శ్రీలంక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
మరో ఆసక్తిర కథనం: రూ.83,000 పైనే పసిడి రేటు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ