Adani AGM 2023: 


టీమ్‌ఇండియా పెట్టుకొన్న 'సున్నా కర్బన ఉద్గారాల' ప్రయాణంలో తమ పునరుత్పాదక వ్యాపారం కీలక పాత్ర పోషిస్తుందని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రీడ్‌ సోలార్‌ విండ్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. అదానీ గ్రూప్‌ (Adani Group) సాధారణ వార్షిక సమావేశంలో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. అదానీ గ్రీన్‌ ఎనర్జీ (AEGL) వ్యాపారం గురించి ఇన్వెస్టర్లకు వివరించారు.


రాజస్థాన్‌లో 2.14 గిగావాట్ల సామర్థ్యంతో తాము నిర్మించిన హైబ్రీడ్‌ సోలార్‌ విండ్‌ ప్రాజెక్ట్‌ ప్రపంచంలోనే అతి పెద్దదని గౌతమ్ అదానీ అన్నారు. 'ఇప్పుడు మేం ఖావ్‌డాలో అతిపెద్ద హైడ్రో పునరుత్పాదక ఇంధన పార్క్‌ను నిర్మిస్తున్నాం. ఇది మేం ఇప్పటి వరకు చేపట్టిన వాటిలో అత్యంత  సంక్లిష్టమైన, ప్రతిష్ఠాత్మాక ప్రాజెక్ట్‌. దాదాపుగా 72,000 ఎకరాల్లో దీనిని నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు 20 గిగా వాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది' అని అదానీ (GautamAdani) అన్నారు. 


కంపెనీ ఎబిటాలో 50 శాతం వరకు కొత్త వ్యాపారం నుంచే ఉంటుందని గౌతమ్ అదానీ వివరించారు. తమ పునరుత్పాదక పోర్టుఫోలియో 49 శాతం పెరిగి 8 గిగా వాట్లకు చేరుకుందన్నారు. ఈ రంగంలో దేశంలోనే ఇంతకన్నా పెద్ద ప్రాజెక్టులేవీ లేవని పేర్కొన్నారు. అతి తక్కువ ధరకే గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయడం తమ లక్ష్యంగా చెప్పారు. 'మనం పెట్టుకున్న 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2030 వరకు చేరుకుంటాం' అని ఆయన నొక్కి చెప్పారు.


ఎడారి మధ్యలో ఏర్పాటు చేయబోతున్న హైబ్రీడ్‌ రెన్యూవబుల్‌ ప్రాజెక్టు గురించి అదానీ తెలిపారు. ఈ ప్రాజెక్టు మొదలైతే 20 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని పేర్కొన్నారు. మిగతా వాటితో పోలిస్తే దీనిని అతి త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు.


క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (QIP) ద్వారా షేర్లను విక్రయించి రూ.12,300 కోట్లు (1.5 బిలియన్ డాలర్లు) సమీకరించాలని అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే మార్గంలో రూ.8500 కోట్లను సేకరిస్తామని అదానీ ట్రాన్స్‌మిషన్‌ సైతం గతంలోనే వెల్లడించింది. నిధుల సమీకరణతో అప్పులు చెల్లించాలని గౌతమ్‌ అదానీ భావిస్తున్నారు. దాంతో ఇన్వెస్టర్ల విశ్వాసం పెరుగుతుందని అనుకుంటున్నారు. విదేశీ పెట్టుబడులపై ఆధారపడొద్దని భావిస్తే స్టాక్‌ మార్కెట్లో నమోదైన కంపెనీలు క్యూఐపీ మార్గాన్ని ఎంచుకుంటాయన్న సంగతి తెలిసిందే. 


భారత పునరుత్పాదన ఇంధన ఉత్పత్తిలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కీలక భాగస్వామి. జైసల్మేర్‌లో నాలుగో హైబ్రీడ్‌ విండ్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌ తెరవడంతో కంపెనీ నిర్వాహక పునరుత్పాదక ఇంధన పోర్టుపోలియో 8,024 గిగావాట్లకు చేరుకుంది. ఏదేమైనా 2030 కల్లా 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ సైతం మార్కెట్లో వేగంగా ఎదగాలని భావిస్తోంది.


అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు నేడు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 2.1 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 1.2 శాతం, అదానీ విల్మార్‌, ఎన్‌డీటీవీ, అదానీ పవర్‌ ఒక శాతం మేర పెరిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అంబుజా సిమెంట్‌ స్వల్పంగా పెరిగాయి. ఏసీసీ, అదానీ పోర్ట్స్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్లు మాత్రం అతి స్వల్పంగా డీలాపడ్డాయి. 


Also Read: పతంజలి ఫుడ్స్‌పై కన్నేసిన 'అదానీ ఇన్వెస్టర్‌'! టార్గెట్‌ పెంచేశారుగా!!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial