Patanjali Foods: 


బాబోయ్‌.. అదానీ కంపెనీ షేర్లు! ఇంకెంత క్రాష్‌ అవుతాయో తెలియదు! ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న షేర్లను అమ్మేసుకోవడమే మేలు! అని ఇన్వెస్టర్లు భావిస్తున్న తరుణంలో అదానీ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టింది జీక్యూజీ పాట్నర్స్‌. ఫ్లోరిడా కేంద్రం పనిచేస్తున్న ఈ కంపెనీ మూడు కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసి నెల రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయాలు సంపాదించింది. ఇప్పుడు బాబా రాందేవ్‌ నేతృత్వంలోని పతంజలి ఫుడ్స్‌పై (Patanjali Foods) కన్నేసింది. రూ.2400 కోట్ల మేర పెట్టుబడి పెట్టింది.


పతంజలి ఫుడ్స్‌ నిర్వహించిన ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS)లో రాజీవ్‌ జైన్‌ సారథ్యంలోని జీక్యూజీ పాట్నర్స్‌ 5.96 శాతం వాటా అంటే 2.15 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. సాధారణ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరును రూ.1000కి కేటాయించగా రిటైల్‌ ఏతర ఇన్వెస్టర్లకు రూ.1103కు కేటాయించారు. ఈ లెక్కన జీక్యూజీ రూ.2400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది.


ఈ ఆఫర్‌ ఫర్ సేల్‌లో పతంజలి ప్రమోటర్లు 7 శాతం వాటా, 2.28 కోట్ల షేర్లను ప్రజలకు విక్రయించారు. రిటైల్‌ ఇన్వెస్టర్ల మూడు రెట్లు బిడ్లు వేయగా నాన్‌ రిటైల్‌ కోటాలో రెండు రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. కాగా ఈ ఏడాది మార్చిలో అదానీ కంపెనీల్లో (Adani Group) రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో జీక్యూజీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో కూరుకున్న కంపెనీల్లో షేర్లను కొని లాభాలు గడించడం ఈ కంపెనీ ప్రత్యేకత.


సోమవారం పతంజలి షేర్లు 2.43 శాతం లాభంతో రూ.1254 వద్ద ముగిశాయి. ఏడు శాతం వాటా విక్రయంతో ప్రమోటర్ల వాటా 80.82 శాతం నుంచి 73.82 శాతానికి తగ్గింది. దాంతో మినిమం పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ 75 శాతం దిగువకు చేరినట్టు అయింది. 2023, మార్చితో ముగిసిన త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్‌ వార్షిక ప్రాతిపదికన 13 శాతం వృద్ధితో రూ.264 కోట్ల నికర లాభం ఆర్జించింది.  ఇక 18 శాతం వృద్ధిరేటుతో రూ.7,837 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ఇక రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ 11 శాతం, రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌ 13.4 శాతానికి చేరుకుంది. రిటర్న్‌ ఆన్‌ అసెట్స్‌ 7.2 శాతంగా ఉంది. ఈక్విటీతో పోలిస్తే అప్పులు కేవలం 0.2 శాతంగా ఉన్నాయి.


'2023 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో పామ్‌ ఆయిల్‌ ధరలు తగ్గాయి. మార్జిన్లు మెరుగవ్వడంతో పతంజలి ఫుడ్స్‌ మెరుగైన ఫలితాలు విడుదల చేస్తుందని మేం అంచనా వేస్తున్నాం. రాబోయే ఐదేళ్లలో రూ.50,000 కోట్ల టర్నోవర్‌, రూ.5000 కోట్ల ఆపరేషనల్‌ ప్రాఫిట్‌ చేరుకొనేందుకు దూకుడుగా అభివృద్ధి ప్రణాళికలు రచించింది. ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలో అవకాశాలను ఒడిసి పడుతోంది. అలాగే పామ్‌ ఆయిల్‌ మొక్కలను పెంచుతోంది' అని హెమ్‌ సెక్యూరిటీస్, పీఎంఎస్‌ అధినేత మోహిత్‌ నిగమ్‌ అంటున్నారు.


గతేడాది 21 శాతం రిటర్న్‌ అందించిన పతంజలి షేర్లు  దీపావళి వరకు మరింత పెరుగుతాయని జీసీఎల్‌ బ్రోకింగ్‌కు చెందిన వైభవ్ కౌశిక్‌ అంటున్నారు. షేరుకు రూ.1760 టార్గెట్‌ ఇస్తున్నారు. కాగా అప్పుల పాలైన రుచి సోయాను ఈ మధ్యే పతంజలి తనలో విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే.