Adani AGM 2023: 


అమెరికా షార్ట్‌ సెల్లర్‌ కంపెనీ హిండెన్‌ బర్గ్‌ నివేదిక అబద్ధాల పుట్ట అని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ (Guatam Adani) అన్నారు. దురుద్దేశ పూర్వకంగానే వారు తప్పుడు సమాచారం ప్రచురించారని తెలిపారు. ఒక నిర్దిష్ట లక్ష్యం మేరకే అవాస్తవాలు, కల్పిత ఆరోపణలతో రిపోర్టును విడుదల చేశారని విమర్శించారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వార్షిక సమావేశంలో ఆయన వర్చువల్‌గా ఇన్వెస్టర్లతో మాట్లాడారు.


అదానీ గ్రూప్‌ (Adani Group) పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించి, షేర్ల ధరలను క్రాష్‌ చేసి లాభాలు గడించాలన్న దురుద్దేశంతోనే హిండెన్‌ బర్గ్ రిపోర్టు (Hindenburg) వచ్చిందని గౌతమ్‌ అదానీ నొక్కి చెప్పారు. 'ఎఫ్‌పీవోను పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ చేసినప్పటికీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతోనే మేం దానిని రద్దు చేశాం. డబ్బులు తిరిగి ఇచ్చేశాం. ఎప్పుడైతే మేం ఎదురు తిరిగి ప్రతిఘటించామో స్వార్థ ప్రయోజనాలు ఉన్నవారు మమ్మల్ని టార్గెట్‌ చేశారు' అని పేర్కొన్నారు.


ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై అమెరికా షార్ట్‌ సెల్లర్‌ కంపెనీ ఓ నివేదికను విడుదల చేసింది. సాధారణంగా ఒక కంపెనీలో షేర్లను అధిక ధరలకు ముందుగానే అమ్మేసి ఇలాంటి రిపోర్టులు ఇవ్వడం వీరికి అలవాటు. నివేదికలోని ప్రతికూల అంశాలతో సాధారణ ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మడం మొదలు పెట్టగానే వాటి ధరలు క్రాష్‌ అవుతాయి. దాంతో తక్కువ ధరల వద్ద వాటిని అమ్మేసి షార్ట్ సెల్లర్లు కోట్ల రూపాయలు కొల్లగొడతారు. మొత్తంగా ఈ రిపోర్టుతో అదానీ కంపెనీల విలువ  145 బిలియన్‌ డాలర్ల మేర కరిగిపోయింది.  ఏదేమైనా ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాంగ్రెస్‌ పార్టీ జేపీసీ డిమాండ్‌ చేసింది. కాగా అదానీ కంపెనీ షేర్ల ధరల్లో అవకతవకలకు పాల్పడలేదని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నివేదిక ఇవ్వడంతో మళ్లీ షేర్ల ధరల్లో స్థిరత్వం వచ్చింది.


హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ సరికొత్త ప్రణాళికలు రచించింది. ముందుగానే అప్పులు తీర్చేయడం మొదలు పెట్టింది. నగదు ప్రవాహం మెరుగుపర్చుకుంది. మెల్లగా కొత్త ప్రాజెక్టుల వైపు మళ్లింది. ఇదే సమయంలో కంపెనీ ప్రమోటర్లు రూ.11,300 కోట్ల విలువైన షేర్లను అమెరికాకు చెందిన గ్లోబల్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ జీక్యూజీకి విక్రయించారు. ఆ తర్వాత 21.4 శాతం షేర్లను కుదువ పెట్టి రుణాలు సంపాదించారు.


'మా ట్రాక్‌ రికార్డే మా గురించి చెబుతుంది. మేం అత్యంత కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో మాకు అండగా నిలిచిన స్టేక్ హోల్డర్లకు ధన్యవాదాలు. సంక్షోభ సమయంలోనూ మేం వేల కోట్ల రూపాయలను అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించాం. పైగా ఏ రేటింగ్‌ ఏజెన్సీ కూడా మా రేటింగ్‌ను తగ్గించలేదని గుర్తు చేస్తున్నా. అదానీ గ్రూప్‌ కంపెనీలపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోంది' అని గౌతమ్‌ అదానీ అన్నారు. 


అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు నేడు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 2.1 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 1.2 శాతం, అదానీ విల్మార్‌, ఎన్‌డీటీవీ, అదానీ పవర్‌ ఒక శాతం మేర పెరిగాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అంబుజా సిమెంట్‌ స్వల్పంగా పెరిగాయి. ఏసీసీ, అదానీ పోర్ట్స్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్లు మాత్రం అతి స్వల్పంగా డీలాపడ్డాయి.