Aadhaar Pan Linking: మన దేశంలో మెజారిటీ ప్రజలకు ఆధార్ కార్డ్‌లు ఉన్నాయి. భారతదేశంలో, ప్రజల వ్యక్తిగత గుర్తింపుగా మొదట అడుగుతోంది ఆధార్ కార్డ్‌నే. చదువు, ఉద్యోగం సహా పుట్టిన నాటి నుంచి మరణించే వరకు దీనితో చాలా పని ఉంది. బీమా వంటి విషయాల్లో, మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఆధార్ కార్డ్ కుటుంబ సభ్యులకు అవసరమవుతుంది.
భారత ప్రజలకు పాన్ కార్డ్ కూడా చాలా కీలకం. వ్యాపారం, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఆదాయ పన్ను పత్రాలు (ITR) సమర్పించడం వంటి ఆర్థిక సంబంధిత వ్యవహారాలకు ఇది తప్పనిసరి.
పాన్ ఉన్న ప్రతి వ్యక్తి, ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలం క్రితమే ఆదేశించింది. ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డ్ - పాన్ అనుసంధానం గడువును పలు దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. చివరకు 2023 జూన్ 30తో ఆ గడువు ముగిసింది. ఈ గడువులోగా లింక్ పూర్తి చేయని పాన్ కార్డ్‌లు డీయాక్టివేట్ అయ్యాయి.
2023 జులై 01 నుంచి, ఆధార్ - పాన్ లింక్ చేయాలంటే రూ.1,000 అపరాధ రుసుము (Aadhaar - PAN linking penalty) చెల్లించాలి.
కేంద్ర సర్కారు ఖజానా నింపుతున్న పాన్-ఆధార్ అనుసంధానం
2023 జులై 01 నుంచి, ఆధార్ - పాన్ లింక్ చేసుకుంటున్న ప్రజల నుంచి పెనాల్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి భారీగా డబ్బులు వచ్చి పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 60 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఆధార్-పాన్ లింక్ కోసం పెనాల్టీ చెల్లించారు. ఈ విధంగా కేంద్ర ఖజానాలోకి రూ. 601.97 కోట్లు వచ్చి చేరాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ పంకజ్ చౌదరి, సోమవారం, లోక్‌సభలో ఈ విషయాన్ని లిఖితపూర్వక సమాధానం రూపంలో వెల్లడించారు.
శాఖ సోమవారం పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది.
మన దేశంలో, 2024 జనవరి 29 నాటికి, ఇంకా 11.48 కోట్ల పాన్‌కార్డులు (మినహాయింపు వర్గాలు కాకుండా) ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు.
ఆధార్-పాన్ లింక్ చేయడం ఎలా? (How to link Aadhaar - Pan?)
1. పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి, ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ లోకి వెళ్లాలి.
2. వెబ్‌సైట్‌లో మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోనట్లయితే, ముందుగా రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ, యూజర్ ఐడీగా మీ పాన్ నంబర్‌ను మాత్రమే ఇవ్వాలి.
3. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి.
4. ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి.
5. మీ పుట్టిన తేదీ, జెండర్ వివరాలను ఇప్పుడు నమోదు చేయాలి.
6. మీ మిగిలిన వివరాలను ఆధార్‌తో సరిపోల్చుకోండి. అన్నీ సరిగ్గా ఉంటే, కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
7. పెనాల్టీగా రూ. 1,000 చెల్లించడం ద్వారా మీ పాన్ - ఆధార్‌ను లింక్ చేయవచ్చు.
8. పాన్ - ఆధార్ లింక్ అయిన వెంటనే మీ మొబైల్ నంబర్‌కు, ఈ-మెయిల్ ఐడీకి మెసేజ్ వస్తుంది.
మరో ఆసక్తికర కథనం: వడ్డీ రేట్లు ఈసారి కూడా మారకపోవచ్చు, ఎప్పట్నుంచి తగ్గుతాయంటే?