Avanigadda YCP Incharge Changed: అధికార వైసీపీలో ఇన్‌చార్జ్‌లు నియామకం, మార్పులు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలోనూ మరో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. ఈ నియోజకవర్గానికి కొద్దిరోజులు కిందట వైసీపీ అధిష్టానం నూతన ఇన్‌చార్జ్‌ను నియమించింది. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావుకు ఇక్కడి బాధ్యతలను పార్టీ అప్పగించింది. పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమించినప్పటికీ కొన్ని రోజులు ఆయన సైలెంట్‌గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆశించిన స్థాయిలో పాల్గొనలేదు. ఏం జరుగుతోందన్న చర్చ కేడర్‌తోపాటు ప్రతిపక్షాలు ఆసక్తిగా చూశాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలిశారు డాక్టర్ చంద్రశేఖర్‌రావు. సీఎంతో సుదీర్ఘంగా చర్చించిన ఆయన.. కీలకమైన అంశాన్ని ప్రతిపాదించారు. ఆ విషయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.
కుమారుడికి బాధ్యతలు అప్పగించాలని
సీఎం జగన్‌ను కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి డాక్టర్ చంద్రశేఖర్‌రావు కలిశారు. వయసు రీత్యా నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలను తన నుంచి తప్పించి కుమారుడికి అప్పగించాలని ఆయన కోరినట్టు చెబుతున్నారు. సీఎం కలిసి వచ్చిన తరువాత నేరుగా డాక్టర్ చంధ్రశేఖర్.. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను తన కుమారుడికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ’అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు సీఎం జగన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ, నా వయసు రీత్యా నా కుమారుడైన సింహాద్రి రామ్‌చరన్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక నుంచి రామ్ చరణ్ అవనిగడ్డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రతి గడపకు తిరుగుతాడు. సీఎం జగన్ పేదలకు అందించిన నవరత్నాలను మరింత విస్తృతంగా ప్రజలకు తెలియజేస్తారు. వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేస్తాడు. మాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ గారికి మరో సారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అవనిగడ్ల ప్రజలకు మూడు తరాలుగా మా తండ్రి సింహాద్రి సత్యనారాయణ సేవలు అందించారు. ఆ వారసత్వాన్ని నా కుమారుడు రామ్‌చరణ్ నిలబెట్టుకుని నియోజకవర్గ ప్రజలకు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నాడంటూ’ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇకపోతే, ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్‌ను వైసీపీ అధిష్టానం మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..?
అవనిగడ్డ ఇన్‌చార్జ్‌గా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌కు మొదట బాధ్యతలు అప్పగించింది. కానీ, ఆయన తన కుమారుడిని ఇన్‌చార్జ్‌గా నియమించాలని సీఎంను కోరారు. సీఎం కలిసి వచ్చిన తరువాత ఇన్‌చార్జ్‌గా తన కుమారుడు వ్యవహరిస్తారని ప్రకటించారు. పార్టీ నుంచి ఈ మేరకు ప్రకటన రాలేదు. కానీ, ఆయన స్వయంగా ప్రకటించేశారు. దీనికి అధిష్టానం అఉమతి ఉందా..? లేదా..? అన్నది తెలియాల్సి ఉంది. ఈ మార్పు పార్టీకి మేలు చేకూరుస్తుందా..? లేదా..? అన్నది కొద్దిరోజుల్లో తేలాల్సి ఉంది. పార్టీ కేడర్ సింహాద్రి రామ్ చరణ్‌ను ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తుందో కూడా ఆయన రప్రజల్లోకి వెళ్లిన తరువాత తేలుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ సీనియర్ నేత మండలి బుద్ధ ప్రసాద్ బరిలోకి దిగనున్నారు. ఆయనపై యువకుడిని బరిలో దించడం వల్ల ఇబ్బందులు ఉంటాయని వైసీపీ అధిష్టానం భావిస్తే మాత్రం రామ్ చరణ్‌కు అవకాశం ఉండకపోవచ్చు. మళ్లీ, చంద్రశేఖర్‌కు అవకాశం ఇచ్చే చాన్స్ ఉంది. లేదంటే మరో ప్రత్నామ్నాయం దిశగా ఆలోచన చేసేందుకు కూడా వైసీపీ అధిష్టానం చూడవచ్చని చెబుతున్నారు. చూడాలి మరి తండ్రీ కొడుకులు కోరికను అధిష్టానం యాక్సెప్ట్ చేసి ఊరుకుంటటుందా. మరో మార్పుకు శ్రీకారం చూడుతుందో మరి.