Latest Photo Updation In Aadhaar Card Online: భారతదేశ పౌరుల గుర్తింపు పత్రాల్లో ఆధార్ కార్డు ఒకటి. ఇది అతి ముఖ్యమైన ఐడీ కార్డ్‌. స్కూలు & కాలేజీలో అడ్మిషన్‌ కోసం, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి, జాబ్‌లో జాయిన్‌ కావడానికి, బ్యాంక్‌ ఖాతా తెరవడానికి, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి, ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడానికి, ఆస్తుల క్రయవిక్రయాల కోసం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు, ఇలా... చాలా రకాల పనుల కోసం ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరిగా అవసరం. ఆధార్ కార్డ్ లేకపోతే ఈ పనులేవీ జరగవు. 


ఆధార్ కార్డ్‌లో 12 అంకెల గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఇందులో.. వేలిముద్రలు (బయోమెట్రిక్) & కనుపాపల (Iris) గుర్తులు, వ్యక్తి పేరు, ఫోటో, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి.


ఆధార్ కార్డ్‌లో ఉన్న వివరాల్లో కొన్నిసార్లు తప్పులు దొర్లుతాయి. ఫోన్‌ నంబర్‌ లేదా చిరునామా మారినప్పుడు వాటిని అప్‌డేట్‌ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమాచారాన్ని మార్చుకోవడానికి లేదా తప్పులు సరి చేసుకోవడానికి ఆధార్‌ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లోనే వివరాలు మార్చుకోవచ్చు. అయితే, మొత్తం సమాచారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా అప్‌డేట్ చేయడం కుదరదు. ఫోటో, బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి తప్పనిసరిగా ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం, నేరుగా ఆధార్‌ సేవ కేంద్రానికి వెళ్లవచ్చు, లేదా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీకు దగ్గరలోని ఆధార్‌ సేవ కేంద్రంలో మీకు వీలైన సమయం కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. 


ఆధార్ కార్డ్‌లో ఉన్న మీ ఫోటో లేదా మీ కుటుంబ సభ్యుల ఫోటోలు బాగోలేకపోతే, లేదా ఆ ఫోటోలు పాతబడితే.. ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి వాటిని మార్చుకోవాలి. 


ఆధార్‌ కార్డ్‌లో ఫోటో మార్చే విధానం (How to Change Photo in Aadhaar Card):


ముందుగా, mAadhaar యాప్ లేదా ఉడాయ్‌ వెబ్‌సైట్‌ నుంచి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇదే ఫారాన్ని ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లి కూడా తీసుకోవచ్చు.
ఆ ఫారంలో అడిగిన వివరాలను తప్పులు లేకుండా జాగ్రత్తగా పూరించండి. అక్షర దోషాలు లేకుండా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోండి.
ఫారం నింపిన తర్వాత, ఆధార్ సేవ కేంద్రంలో ఆ ఫారాన్ని సబ్మిట్‌ చేయాలి. 
ఇప్పుడు, ఫొటో అప్‌డేషన్‌ పని ప్రారంభమవుతుంది.
మొదట, ఆధార్‌ సేవ కేంద్రంలోని సిబ్బంది మీ నుంచి వేలిముద్రలతో మీ గుర్తింపును ధృవీకరిస్తారు.
అక్కడే ఉన్న కెమెరా ద్వారా మీ ఫోటో తీసుకుంటారు. ఇదే ఫొటోను ఆధార్‌ కార్డ్‌లో అప్‌డేట్‌ చేస్తారు. 
ఆధార్‌ కార్డ్‌ ఫొటోలో మీరు ఎలా కనిపించాలని కోరుకుంటారో, దానికి తగ్గట్లుగా ముందే సిద్ధమై వెళ్లండి.
తర్వాత, ఆధార్‌లో ఫోటోను అప్‌డేట్ చేయడానికి కొంత డబ్బు చెల్లించాలి.


ఈ తతంగం ముగిసిన తర్వాత ఆధార్‌ కేంద్రం సిబ్బంది మీకు ఒక రిసిప్ట్‌ ఇస్తారు. దాని మీద URN ఉంటుంది. దాని సాయంతో, మీ ఫోటో అప్‌డేట్ ప్రాసెస్‌ను మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. కొన్ని రోజుల తర్వాత, UIDAI నుంచి ఫోటో అప్‌డేట్ SMS వస్తుంది. మీ ఆధార్ కార్డుకు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌కు ఆ SMS వస్తుంది. ఆ తర్వాత, ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఆధార్ కార్డ్‌లో కొత్తగా యాడ్‌ చేసిన ఫోటోను చూసుకోవచ్చు. ఆ ఆధార్‌ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన చోట వినియోగించుకోవచ్చు.


ఆధార్‌ కార్డ్‌లో ఫోటో మార్చుకోవడానికి ఎంత ఫీజు చెల్లించాలి?
UIDAI అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఆధార్ కార్డ్‌లో ఫోటోను నవీకరించడానికి రూ.100+GST చెల్లించాలి. ఆధార్ కార్డ్‌లో ఫోటోను అప్‌డేట్ చేయడానికి ఇతర ఏ గుర్తింపు కార్డ్‌ను చూపించాల్సిన అవసరం లేదు. 


ఆధార్ కార్డ్‌లో ఫోటోను ఆఫ్‌లైన్‌లో మాత్రమే అప్‌డేట్ చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా మనమే అప్‌డేట్‌ చేసుకోవడం కుదరదు.


మరో ఆసక్తికర కథనం: నాలుగు రోజుల్లో రూ.6.88 లక్షల కోట్లు, స్టాక్‌ మార్కెట్‌ చాలా ఇచ్చింది