5G Network In India: వీధిలో ఉన్న కరెంటు స్తంభం, ఊరిలోని బష్ షెల్టర్, కూడలిలో నిలుచున్న ట్రాఫిక్ సిగ్నల్ పోల్, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ భవనాలు.. ఇకపై ఇలాంటివన్నీ 5G క్యారియర్లనేట!. వినడానికి విచిత్రంగా ఉన్నా, ఈ స్ట్రీట్ ఫర్నీచర్‌ను 5G కోసం ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ను తీసుకురానున్న తరుణంలో, ఇది కీలక అడుగుగా మారింది. వీటన్నింటినీ మ్యాప్ చేయడానికి తీవ్ర కసరత్తు జరుగుతోంది.
మ్యాపింగ్ కసరత్తును ఉత్తరప్రదేశ్, గుజరాత్ దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ పనిని త్వరగా ముగించాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది.
'పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రచార విభాగానికి' (DPIIT) చెందిన లాజిస్టిక్స్ విభాగంలోని గతి శక్తి బృందం (Team Gati Shakti) ఇటీవల అన్ని రాష్ట్రాలకు ఆఫీస్ మెమోరాండం పంపింది. విద్యుత్ స్తంభాలు, ట్రాఫిక్ లైట్ పోల్స్, బస్సు టెర్మినల్స్ & షెల్టర్లు, ప్రభుత్వ భవనాలను వేగంగా మ్యాప్ చేయమని కోరింది.
స్మాల్ సెల్స్ టెక్నాలజీ
5G రోల్ అవుట్ కోసం స్మాల్ సెల్స్ టెక్నాలజీ మీద భారతదేశం దృష్టి పెట్టడమే ఈ స్ట్రీట్ ఫర్నీచర్ కోసం వెదుకులాటకు కారణం. స్మాల్ సెల్స్‌ను సులభంగా తరలించవచ్చు. పైగా తక్కువ విద్యుత్‌తో పనిచేసే రేడియో యాక్సెస్ నోడ్‌లు లేదా బేస్ స్టేషన్‌లు ఇవి. కొన్ని మీటర్ల నుంచి కొన్ని వందల మీటర్ల వరకు కవరేజ్ ఇస్తాయి.
స్ట్రీట్ ఫర్నిచరే కీ పాయింట్
స్మాల్ సెల్స్ చాలా తక్కువ దూరానికి మాత్రమే కవరేజీని అందిస్తాయి కాబట్టి, మంచి కవరేజీ కోసం ఎక్కువ సంఖ్యలో వాటిని ఉపయోగిస్తారు. 5G పోల్స్‌తో కూడిన కొత్త నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం కంటే స్ట్రీట్ ఫర్నిచర్‌కు తక్కువ ఖర్చవుతుంది, తక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. పట్టణ ప్రాంతాల్లో లభించే హై బ్రాడ్‌బ్యాండ్ తరహా సామర్థ్యాన్ని తక్కువ ఖర్చుతో గ్రామాల్లోనూ అందించడానికి వీలవుతుంది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI - ట్రాయ్), ఇటీవల, మధ్యప్రదేశ్‌లో స్ట్రీట్ ఫర్నీచర్ & స్మాల్ సెల్ డిప్లాయ్‌మెంట్ మీద కొన్ని పైలెట్ ప్రాజెక్టులు కూడా ప్రారంభించింది. 5G రోల్ అవుట్ కోసం వీధులను సిద్ధం చేయడానికి కూడా చాలా చర్యలు తీసుకున్నారు.
టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు చాలా తక్కువ దూరంలో 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, గతి శక్తి యొక్క 'పవర్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్' కేటగిరీ కింద రాష్ట్రాలు మ్యాప్ చేస్తున్న డేటా లేయర్‌లలో విద్యుత్ స్తంభాలను చేర్చాలని నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ ఇటీవల సూచించింది.
ప్రభుత్వం మొదట 15 నగరాల్లో సేవలను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ దేశవ్యాప్త రోల్ అవుట్ తర్వాత, 5G సెల్‌ల ఏర్పాటుకు సరిపోయే స్ట్రీట్ ఫర్నిచర్ను గుర్తించమని రాష్ట్రాలకు సూచించాలని DPIITని కేంద్రం కోరింది. రాష్ట్ర మాస్టర్ ప్లాన్ ఈ కసరత్తులో ఎంతో సహాయపడుతుంది.
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇప్పటికే 5G స్పెక్ట్రంను తీసుకున్నాయి. స్ట్రీట్ ఫర్నిచర్‌ను ఉపయోగించుకోవడం వల్ల వాటి 5G రోల్ అవుట్ వ్యయాలు తగ్గుతాయి, కంపెనీ ఆదాయాల మీద భారం పరిమితమవుతుంది. కాబట్టి, ఈ టెలికాం ప్రొవైడర్లకు ఈ పరిణామం ఒక సానుకూలాంశం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.