Secunderabad Fire Accident: సికింద్రాబాద్ లో ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాద ఘటన బిల్డింగ్ సెల్లార్ ని మిస్ యూస్ చేయడం వల్లే జరిగిందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలు త్వరగా వ్యాపించాయి. పొగ దట్టంగా వ్యాపించడం వల్లనే 8 మంది చనిపోయారని అన్నారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని అన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. బైక్ షోరూం నిర్వహకులపై పోలీసులు కేసు నమోదు చేశామని హోం మంత్రి వెల్లడించారు.
క్లూస్ టీం గుర్తించిన వివరాల ప్రకారం.. సెల్లార్ లో గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లుగా చెప్పారు. సిలిండర్లతో పాటు పెట్రోల్, ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాక, జనరేటర్, ఓపెన్ బ్యాటరీలు కూడా ఉన్నాయి. అయితే, సిలిండర్లు పేలలేదని, అదే జరిగి ఉంటే మరింత పెద్ద ప్రమాదం జరిగేదని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదం అనేది ఈ బైక్ లేదా జనరేటర్ వల్ల జరిగి ఉంటుందని భావిస్తున్నట్లుగా చెప్పారు. లిథియం బ్యాటరీల్లో మంటల వల్ల దట్టంగా పొగ వ్యాపించినట్లుగా చెప్పారు. అలా సెల్లార్ నుంచి పొగ మెట్లపైకి వ్యాపించిందని, ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం వల్ల చాలా మంది చనిపోయారని చెప్పారు. సెల్లార్ నుంచి మెట్ల మార్గంలో పొగ వ్యాపించడంతో మెట్ల పై నుంచి వెళ్లి ప్రాణాలు కాపాడుకుందామని అనుకున్నవారు చనిపోయారని చెప్పారు.
సెల్లార్ లో 37 ఎలక్ట్రిక్ బైక్ లు
ఘటనకు సంబంధించిన వివరాలను నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి మీడియాకు వివరించారు. ‘‘రూబీ లాడ్జీ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఏడుగురికి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందుతుంది. లాడ్జి భవనానికి ఒకటే దారి ఉండడంతో రెస్క్యూ ఇబ్బందిగా మారింది. మొత్తం అంతట పొగలు వ్యాపించాయి. రెస్క్యూ ఆపరేషన్ కష్టతరంగా మారింది. ఫైర్ సేఫ్టీ, మార్కెట్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఐదుగురి మృత దేహాలు గుర్తించి బంధువులకు అప్పగించాం. మిగతా వారిని గుర్తించి పోస్ట్ మార్టం జరిపి మృతదేహాలు అప్పగిస్తాం. ప్రమాదం జరిగిన సెల్లార్ లో 37 ఎలక్ట్రిక్ బైక్ లు ఉన్నాయి. ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్, క్లూస్ టీం తో క్లూస్ సేకరించాము’’ అని చందన దీప్తి వెల్లడించారు.
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలోని క్షతగాత్రుల వివరాలు
- మొత్తం 9 మంది
- కేవీ సంతోష్, పెందుర్తి, వైజాగ్
- జయంత్, బెంగళూరు - పరిస్థితి విషమం సికింద్రాబాద్ అపోలో ఐసీయూలో చికిత్స
- దేభాశీష్ గుప్తా, కలకత్తా
- యోగిత, వైజాగ్, పెందుర్తి - మాదాపూర్ TCS లో ఉద్యోగి
- కేశవన్, చెన్నై
- దీపక్ యాదవ్, హరియాణా
- ఉమేష్ కుమార్ ఆచార్య, ఒడిశా
- మన్మోహన్ కన్నా, హైదరాబాద్, రామ్ నగర్
- రాజేష్ జగదీష్ చాబ్రా, గుజరాత్