4 Day Work Week: "వారానికి నాలుగు రోజులే పని చేయండి, 3 రోజులు వీక్లీ-ఆఫ్ తీసుకోండి".. ఈ మాట వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లుంది కదా. నిజంగానే వారంలో 3 రోజులు 'ఆఫ్' ఉంటే ఎంత బాగుంటుందో, ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయవచ్చో అనిపిస్తోందా?. దీనిని నిజం చేసేందుకు నడుంకట్టాయి జర్మన్ కంపెనీలు.
కరోనా (Corona) సమయంలో ఇంటి నుంచి పని (work from home) చేసిన ఉద్యోగులు, పరిస్థితులు చక్కబడగానే ఆఫీసుల నుంచి పని చేయడం స్టార్ట్ చేశారు. కొన్ని కంపెనీల్లో ఇప్పటికీ హైబ్రిడ్ విధానం నడుస్తున్నాయి. అయితే, వారంలో 5 రోజులు పని చేయడం సిబ్బందికి ఇబ్బందిగా ఉందని అధ్యయనాల్లో తేలింది. వారానికి 5 రోజులు కష్టపడుతున్న వారిలో నిరాసక్తత పెరిగి, ఉత్సాహం తగ్గిపోతున్నట్లు వెల్లడైంది. దీనివల్ల ఉద్యోగులు అటు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు, ఇటు వృత్తిగత జీవితానికి న్యాయం చేయలేకపోతున్నారు. కరోనా తర్వాతే ఇలాంటి పరిస్థితి ప్రబలంగా మారిందని సర్వేల్లో తెలిసింది.
'ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ రిపోర్ట్' ప్రకారం... 2022లో, జర్మన్‌లు నెలలో సగటున 21.3 రోజులు కూడా పని చేయలేకపోయారని తేలింది. దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 207 బిలియన్ యూరోలు నష్టపోయినట్లు లెక్కగట్టింది. ఈ నష్టం కేవలం జర్మనీకే పరిమితం కాదు, అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి ఉందని ఆ రిపోర్ట్ హెచ్చరించింది. చేసే పని పట్ల సంతోషంగా లేని వాళ్లలో ఏకాగ్రత కుదరడం లేదని, దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8.1 లక్షల కోట్ల యూరోలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ వార్నింగ్ బెల్ మోగించింది.
ఉద్యోగుల్లో నిరాసక్తతను తొలగించడానికి, న్యూజిలాండ్‌కు చెందిన 4డే వీక్ గ్లోబల్ (4 Day Week Global) అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచవాప్తంగా ఉద్యమిస్తోంది. వివిధ దేశాల్లోని కార్పొరేట్లతో మాట్లాడి, వారి కంపెనీల్లో వారానికి 4 రోజుల పని (4-day work) విధానం అమలు చేయిస్తోంది. ఇందులో భాగంగా, జర్మన్ కంపెనీలతో మాట్లాడిన 4డే వీక్ గ్లోబల్, "వారానికి నాలుగు రోజులు పని - 3 రోజులు సెలవులు" విధానం అమలు చేసేలా మేనేజ్‌మెంట్లను ఒప్పించింది.
ఆరు నెలల పైలెట్ ప్రాజెక్ట్
'4డే వీక్' పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు 45 జర్మన్ కంపెనీలు అంగీకరించాయి. 2024 ఫిబ్రవరి 01 నుంచి కొత్త వర్క్ కల్చర్ ప్రారంభమవుతుంది, ఆరు నెలల పాటు కొనసాగుతుంది. వారానికి 4 రోజులే పని చేసినా, ఆయా కంపెనీలు ఉద్యోగుల జీతంలో కోతలు పెట్టవు. అయితే.. ఉత్పాదకత మాత్రం గతం కంటే తగ్గకూడదు లేదా అంతకంటే మెరుగ్గా ఉండాలన్నది నిబంధన.
వారానికి 4 రోజులే పని చేసి, 3 రోజులు సెలవు తీసుకోవడం వల్ల... ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గుతుందని 4డే వీక్ గ్లోబల్ చెబుతోంది. ఉద్యోగులు ఆ 3 రోజుల సమయాన్ని తమ ఇష్టం వచ్చేలా గడపడానికి కేటాయిస్తారని, దీనివల్ల వారి మానసిక & శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని వెల్లడించింది. ఫలితంగా, ఉద్యోగుల పని తీరు మెరుగుపడి, ఉత్పాదకత పెరుగుతుందని అంటోంది. సెలవులు తీసుకోవడం కూడా తగ్గనుందని అంచనా వేసింది.
'4డే వీక్' పద్ధతి ప్రారంభమైంది జర్మనీలో కాదు. అమెరికా, కెనడా, బ్రిటన్, పోర్చుగల్ దేశాల్లో ఈ పద్ధతి ఇప్పటికే అమలు చేసినట్లు 4డేస్ వీక్ గ్లోబల్ చెప్పింది. అక్కడ మంచి ఫలితాలు రాబట్టినట్లు వెల్లడించింది. జర్మనీలోనూ అలాంటి రిజల్ట్‌నే సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేసింది. జపానీస్ కంపెనీలు కూడా వారానికి నాలుగు రోజుల పనిని అమలు చేస్తున్నాయి.
వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని జర్మన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఉద్యోగులు సగం రోజులు ఇంట్లోనే కూర్చుంటే, ఆర్థిక వృద్ధిలో వేగం తగ్గుతుందని భయపడుతోంది.
మరో ఆసక్తికర కథనం: ఆకాశంలోకి నిచ్చెన వేస్తున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే