Sadguru On Yoga Importance: 


సద్గురు: భారతదేశం ఒక సంస్కృతికే పరిమితమైనది కాదు- ఇది అనేక సంస్కృతుల మిశ్రమం, ఇక్కడ మనం అల్పమైన ఒకే సారూప్యతను కలిగి ఉండము. ప్రజల జాతి, వారి భాష, ఆహారం, ఆహార్యం, సంగీతం, ఇంకా నృత్యం ఇలా ప్రతీది దేశంలో ప్రతి యాభై లేదా వంద
కిలోమీటర్లకు మారుతూ ఉంటుంది.


దేశంలో 1300కు పైగా భాషలు, మాండలికాలు, ఇంకా అపారమైన సాహిత్యం కలిగిన దాదాపు 30 గొప్ప భాషలతో వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్న దేశం ఇది. ఈ భూగ్రహం మీద బహుశా అత్యధిక సంఖ్యలో హస్తకళలు ఉన్న ఏకైక దేశం ఇదే. మనం ప్రపంచంలోని ప్రతి మతానికి స్థానం కల్పించడమే కాదు, అనేక రకాల ఆరాధనలకు, ఆంతరంగిక శ్రేయస్సు, అత్యుత్తమ శ్రేయస్సును పొందడానికి మిగతా
ప్రపంచం ఎన్నడూ చూడని ఎన్నో మార్గాలకు నెలవు మన దేశం.


దురదృష్టవశాత్తు, గత కొన్ని దశాబ్దాలుగా, చాలామంది భారతీయులు విభిన్నమైన ఈ ఆధ్యాత్మిక సంభావ్యతలకు దూరమవుతున్నారు. కాబట్టి, IGNCA లాంటి సంస్థలు చేస్తున్న పని శ్లాఘనీయం, ఎందుకంటే ఈ సంస్కృతిని కోల్పోకూడదు.


భారతీయ సంస్కృతిలో అంతర్గత శ్రేయస్సుకి సంబంధించిన సైన్స్ టెక్నాలజీ నుంచి ఉద్భవించిన ఆంతరంగిక బలం ఉంది - ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి ఇది అవసరం. వారికి ఉన్న బాహ్య సాంకేతికతతో బయట చాలా అద్భుతాలు చేశారు, కానీ ఆంతరంగికంగా వారు మదనపడుతున్నారు. మనం ఈ దేశంలో ఉన్న జ్ఞాన భాండాగారాన్నిఉపయోగించుకోగలిగితే, అది దేశ శ్రేయస్సుకే కాదు, ప్రపంచ
శ్రేయస్సుకు కూడా గొప్ప ఆస్తి అవుతుంది.


ఈ నేపథ్యంలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైనది. ఇది మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం, యోగ శాస్త్రం మునుపెన్నడూ లేనంతగా ప్రస్తుతం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ భూమ్మీదున్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి కావాల్సిన సామర్థ్యం మనకుంది- పోషణ, ఆరోగ్యం,
ఇంకా విద్య ఇలా ఏదైనా సరే. మన వద్ద సైన్స్ టెక్నాలజీకి సంబంధించి అద్భుతమైన సాధనాలు ఉన్నాయి - ప్రపంచాన్ని అనేక సార్లు సృష్టించడానికి లేదా విచ్ఛిన్నం చేయడానికి తగినంత శక్తివంతమైనవి. అయినప్పటికీ, అటువంటి శక్తివంతమైన సాధనాలను ఉపయోగించగల సామర్ధ్యం, గాఢంగా అక్కున చేర్చుకునే తత్వం, సమతుల్యత, ఇంకా పరిపక్వతలతో కలిసి ఉండకపోతే, మనకు ప్రపంచ విపత్తు పొంచి ఉన్నట్లే. మనం బాహ్య శ్రేయస్సు కోసం ఎడతెరిపి లేకుండా చేసే ప్రయత్నాలు, ఇప్పటికే భూగ్రహాన్ని నాశనం చేసే స్థితికి తీసుకొచ్చాయి. ప్రస్తుతం మనకు ఉన్నన్ని సౌకర్యాలు ఇంకా సదుపాయాలు, మునుపెన్నడూ ఏ తరం వారికి లేవు. అయినప్పటికీ, చరిత్రలో అత్యంత ఆనందకరమైన లేదా ప్రేమపూర్వకమైన తరంగా మనల్ని మనం చెప్పుకోలేము. చాలామంది నిరంతరం ఒత్తిడి ఇంకా ఆందోళనలతోనే జీవిస్తున్నారు. కొంతమంది వారి వైఫల్యాల గురించి బాధపడుతున్నారు, కానీ బాధాకరమైన విషయమేమిటంటే, చాలామంది సక్సెస్ తర్వాత కలిగే పరిణామాల వల్ల బాధపడుతున్నారు. కొంతమంది వారికున్న పరిమితుల వల్ల బాధపడుతున్నారు, కానీ
చాలామంది వారికున్న స్వేచ్ఛ వల్ల బాధపడుతున్నారు. 


కొరవడుతున్నది ఏమిటంటే, మానవ చైతన్యం. మిగతావన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ మనుషులే సరిగ్గా లేరు. మనుషులు తామె తమ ఆనందానికి అవరోధంగా ఉండడాన్ని ఆపగలిగితే, మిగతా పరిష్కారాలన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. ఇక్కడే యోగా కీలక పాత్ర పోషిస్తుంది. యోగా అనే పదం వినగానే, చాలామంది మదిలో శరీరాన్ని వివిధ భంగిమల్లో వంచి ఉన్న చిత్రాలే మెదులుతాయి. కానీ యోగ శాస్త్రం
అంటే అది కాదు. యోగా అనేది ప్రాక్టీసో, వ్యాయామమో, లేదా టెక్నికో కాదు. యోగా అంటే సంయోగం అని అర్థం. అంటే, ఒకరి అనుభవంలో, ప్రతిదీ ఏకమైపోయిందని. యోగ శాస్త్రం అనేది మానవుని అంతరంగానికి సంబంధించిన గొప్ప శాస్త్రం, ఇది మనం సృష్టితో సరైన సమలేఖనంలో ఉండేలా, పరిపూర్ణమైన సామరస్యతతో ఉండేలా చేస్తుంది. చైతన్యాన్ని పెంపొందించే వ్యవస్థగా, మానవాళిని స్థిరమైన
శ్రేయస్సు ఇంకా స్వేచ్ఛతో జీవించడానికి శక్తివంతం చేసే వ్యవస్థగా, దీని కంటే సమగ్రమైన వ్యవస్థ మరొకటి లేదు.


యోగా అనేది ఏ మతం లేనప్పటి నుంచి ఉంది. మనం అంతర్ముఖులమై, నమ్మకాలను ఇంకా నిర్ధారణలను పక్కన పెట్టగలిగితే, తప్పకుండా సత్యం అవగతమవుతుంది. సత్యం గమ్యం కాదు. ఇది మనకు రాత్రి అనుభవం లాంటిది. సూర్యుడు ఎక్కడికి పోలేదు, భూమికి
మరో వైపున ఉన్నాడు అంతే. చాలా సమయం, మనుషులు ఇంకో వైపు చూస్తూ బిజీగా ఉంటారు. వారి నిజస్వరూపం గురించి తెలుసుకోవడానికి తగినంత శ్రద్ధ చూపడం లేదు. యోగా ఒక ముగింపును కాక, ఒక మలుపును అందిస్తుంది.


మానవ జనాభాలో కొద్ది శాతం మంది అంతర్ముఖులైనా సరే, ఖచ్చితంగా ప్రపంచమంతటా జీవితపు నాణ్యతలో మార్పు వస్తుంది. ప్రత్యేకించి ప్రపంచంలో ఉన్న లీడర్లలో, కొంతమందిలో ఈ మార్పు వచ్చినా సరే, ప్రపంచం పనితీరులో త్వరగా అద్భుతమైన మార్పు వస్తుంది. ఆంతరంగికం అనేది ఒక దిశ కాదు, అదొక పార్శ్వం. అంతర్జాతీయ యోగా దినోత్సవం, మానవాళి ఒక లోతైన సరికొత్త మార్పుకు నాంది
పలకడానికి ప్రతీకగా నిలుస్తుంది.


భారతదేశంలో అత్యంత ప్రభావశీలురైన యాభై మంది వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొంటున్న సద్గురు ఒక యోగి, ఆధ్యాత్మికవేత్త, దార్శనికుడు, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత. అసాధారణమైన, విశిష్టమైన సేవలు అందించినందుకుగానూ, భారత ప్రభుత్వం 2017లో సద్గురుకు, ఏటా ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం - పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. 400 కోట్ల ప్రజల్ని తాకిన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఉద్యమమైన ‘చైతన్యవంతమైన ప్రపంచం - మట్టిని రక్షించు’ ఉద్యమాన్ని ఆయన ముందుండి నడిపించారు.