Remembering Ramoji Rao:  తెలుగు జర్నలిజం అంటే వచ్చే వందేళ్ల పాటు మొదట గుర్తొచ్చే  పేరు రామోజీరావు. విభిన్న రంగాల్లో ఆయన ముద్ర సుస్ఫష్టం. 


రామోజీరావు... అంటే అది ఐదు అక్షరాల పేరు మాత్రమే కాదు.. ఎనిమిది పదుల దేహం మాత్రమే కాదు... కొన్ని సంస్థల ద్వారా వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఒక పారిశ్రామిక వేత్త మాత్రమే కాదు. ఆయన అంతకు మించి.. 
ఆయన అడుగు... ప్రగతి పథం
ఆయన ఆలోచన ....నిత్యనూతనం 
ఆయన విజన్ – అవధులు లేని ఆకాశం
ఆయన కృషి... అనితర సాధ్యం
ఆయన గమ్యం.. అనన్యసామాన్యం 
ఆయన కీర్తి... ఆచంద్రతారార్కం. 
ఈ నేలపై శిఖరాయమయమైన కీర్తిని గడించిన అతి కొద్ది తెలుగు వాళ్లలో ఆయన ఒకరు. 


రామోజీ రావు అంటే...
మధ్యతరగతికి మదుపు నేర్పి లక్షల జీవితాల్లో 60 ఏళ్లుగా వెలుగులు నింపుతున్న “మార్గదర్శి”
అన్నం పెట్టే రైతన్న బాగుంటేనే ఉంటేనే భవిష్యత్ అని 55 ఏళ్ల పాటు నడిపించిన “అన్నదాత”
50 ఏళ్లుగా ఆ పేపర్ చేతిలోకి వచ్చాక  మాత్రమే తెల్లారే... ఈనాడు..
బొమ్మల చిత్రాలతో చైతన్యాన్ని రగిలించొచ్చని చూపించిన సెల్యూలాయిడ్ 
కలాన్ని కరవాలంగా మలచి... వార్తలతో పేలిన డైనమైట్. 
ప్రపంచం అబ్బుర పడే ఫిల్మిసిటీ.. 
ప్రతి ఒక్కరూ తనవైపు తలెత్తి చూడగలిగే చేయగలిగే వర్సటైల్ పర్సనాలిటీ.. 
చెప్పుకుంటూ పోతే...  88 ఏళ్ల రామోజీ జీవితంలో సంచలనాలెన్నో. రామోజీ మరణంతో తెలుగుజాతి చరిత్రలో ఓ శకం ముగిసినట్లే అనుకోవాలి. ఏ రంగంలో అయిన తనకు సాటి లేదన్నట్లు ఆయన సాగించిన ప్రయాణం జూన్ 8తో ముగిసింది. రామోజీ నిష్క్రమణ పత్రికారంగం, సినిమా, వ్యాపార, పర్యాటక, రాజకీయ రంగాల్లో ఓ భారీ కుదుపు. అన్నింటిపై ఆ స్థాయిలో ముద్ర వేసిన లీడర్ ఆయన. 


88 ఏళ్ల కిందట గుడివాడ దగ్గరున్న పెదపారుపూడిలో పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించారు రామోజీ...  తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు.  గుడివాడలోనే హైస్కూలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన ఢిల్లీలోని ఓ యాడ్ ఏజన్సీలో పనిచేశారు. ఆ తర్వాత ఖమ్మంలో ఎరువుల వ్యాపారం చేసిన ఆయన... వ్యాపార రంగంలో ఎదిగే ఉద్దేశ్యంతో హైదరాబాద్లో అడుగుపెట్టారు. 


వ్యాపారంలో ఒరవడి ! 


కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నది ఆయన ఫిలాసఫీ. నెంబర్ 2 గా ఉండేందుకు ఒప్పుకోని.. రాజీపడని మసస్తత్వం అది. అలా ముందు మొదలు పెట్టింది... మార్గదర్శి. ఆ పేరు చూడండి... అప్పటి సాంప్రదాయ పేర్లకు భిన్నంగా కొత్తగా ఉండేలా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఓ చిన్న మొత్తంతో ప్రారంభమైన ఆ చిన్న మొత్తాల చిట్ ఫండ్స్ నేడు సౌతిండియాలో అతిపెద్ద చిట్ కంపెనీ. కొన్ని వేల కోట్లు టర్నోవర్ దాని సొంతం. ఆ తర్వాత జీవన గమనంలో ఆయన ఎంచుకున్న మార్గం... తీసుకున్న నిర్ణయాల వల్ల చిట్ కంపెనీ చిక్కుల్లో పడినా.. దాన్ని నిలబెట్టగలిగింది రామోజీ బలం. ఏకంగా ప్రభుత్వాలే దాన్ని కూల్చేయడానికి ప్రయత్నించినా ఆయన తొణకలేదు. బెదరలేదు. పదిహేనేళ్ల  కిందట ఓసారి.. పది నెలల కిందట మరోసారి మార్గదర్శి తీవ్రంగా ఇబ్బందులు పడింది. మొన్నటి దెబ్బకు మార్గదర్శి తలవంచక తప్పదు అనుకున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇన్ని సార్లు ఇంత జరిగినా సరే.. ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు ప్రజలు, ఖాతాదారుల వైపు నుంచి రాకపోవడం.. రామోజీపై జనానికి ఉన్న నమ్మకం అనే చెప్పాలి. 


యాడ్ ఏజన్సీలో పనిచేసిన అనుభవంతో ఆయన కిరణ్ యాడ్స్ ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రారంభమైన అన్నదాత.. రైతులపై ఆయనకున్న బాధ్యతను ప్రేమనూ చాటుతుంది. ఈమధ్య కొద్దిరోజుల క్రితం క్లోజ్ అయ్యేవరకూ అన్నదాత రైతన్నలకు చేతుల్లో దిక్సూచిలా నడిచింది. 


ఈనాడు ప్రారంభం - తెలుగు మీడియాకు మేలిమలుపు 


ఇక ఈనాడు తెలుగు పత్రికా రగంలో ఓ భారీ కుదుపు. రాతలోనూ.. రీతిలోనూ.. ఈనాడు అప్పటి సాంప్రదాయ పత్రికలకు పూర్తి భిన్నం. అది అన్నింటిలోనూ భిన్నమే ఎందుకంటే రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లోనో.. లేక అప్పటి పత్రికా రాజాధాని అయిన విజయవాడలోనో కాకుండా ఎక్కడో ఉత్తరాంధ్రలోని విశాఖలో మొదలైంది ఈనాడు. ప్రింటింగ్ సెక్షన్లో పనిచేసే ఓ కార్మికుడి చేత ఈనాడును ప్రారంభింపజేశారు రామోజీరావు.  ఇంకొన్ని రోజుల్లో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈనాడు 45 ఏళ్లుగా తెలుగులో నెంబర్ వన్. The Largest Circulated Telugu Daily అనే కిరీటాన్ని కొట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ.. ఎవరి వల్లా సాధ్యం కాలేదు.


ఈనాడు ప్రారంభంతోనే రామోజీ జీవితం మరో మలుపు తిరిగింది. రాజకీయంగానూ ఆయన బలమైన శక్తిగా ఎదిగారు. ఈనాడు నెంబర్ వన్ చేయడానికి సర్క్యులేషన్, మార్కెటింగ్ లో ఆయన అనుసరించిన పద్దతులు నేటి బిజినెస్ స్కూల్స్ కు ప్రిన్సిపల్ సూత్రాలు. వాటన్నిటితో 1983 లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడానికి ఈనాడు పోషించిన రోల్... ఆ తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం.. 1995లో ఎన్టీఆర్ ను గద్దె దింపడంలో పోషించిన పాత్ర.. వైఎస్సార్‌కు ప్రతిపక్షంగా మారి.. కంటగింపై.. ముప్పేట దాడిని ఎదుర్కొన్న సమయం.. దీంతో తెలుగు రాజకీయ పరిణామాల్లో ఈనాడు కూడా కేంద్ర బిందువైంది. అప్పటి నుంచి రాజకీయంగా ఓ పక్షం అభిమానానికి.. మరో పక్ష ద్వేషానికి కారణమైంది. దీనికి ఆహ్వానిస్తూనే ప్రజా పథాన్ని విడవకుండా ముందుకు సాగింది ఈనాడు. పత్రికలంటే సమాచారం కాదనే సత్యాన్ని చాటింది. పత్రిక పెనుమార్పుకు సూచిక అని అనేకానేక సంచలన కథనాలతో ఆయన నిరూపించారు.


ఈనాడు సారా ఉద్యమంతో రాష్ట్రంలో  మద్య నిషేధం జరిగింది. శ్రమదానోద్యమంతో అనేక రోడ్లు బాగుపడ్డాయి. నీటి సంరక్షణోద్యమంతో చెరువులు కుంటలు నిండాయి. పత్రిక అంటే బాధ్యత అని కూడా ఆయన నిరూపించారు. ఈనాడు సహాయనిధి ద్వారా దివిసీమ ఉప్పెన మొదలు కోనసీమ తుపాను, తూర్పుతీర సునామీ, గుజరాత్ భూకంపం, కేరళ వరద విలయం ఇలా అనేక సందర్భాల్లో ఈనాడు సాయం అందించి బాధితులకు గూడు కల్పించింది. మొన్నటి కరోనా సమయంలోనూ ఈ గ్రూపు భారీ విరాళం అందించింది. 


రామోజీ ఎదిగింది.. రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొందీ ఈనాడుతోనే ఈనాడు రాతలతోనే ఈయన మిగతా వ్యాపారాలూ దెబ్బతిన్నా వెరవలేదు. వెనుదిరగలేదు. మొన్నటి జగన్ ప్రభుత్వంతోటి పోరాటమైతే.. ఈనాడు చరిత్రలోనే అతిపెద్దది. 


రీజినల్ నెట్ వర్క్ ఈటీవీతో దేశవ్యాప్త ఖ్యాతి


రామోజీ ఎప్పుడూ కొత్తదారిలో ప్రయత్నిద్దాం అంటారు. శాటిలైట్ చానళ్ల ప్రారంభం అవుతున్న తరుణంలో తెలుగులో మొట్టమొదటి అడుగు ఆయనే ముందేశారు. టెక్నికల్‌గా దానికి సంబంధించిన సమాచారం, పనితీరుపై అప్పట్లో అంత సమాచారం లేకపోయినా వెనుకడుగు వేయలేదు. అంతటి ధైర్యశాలి ఆయన. ఈటీవీ -మీటీవీ అంటూ తెలుగులో మొట్టమొదటి ఎంటర్‌టైన్మెంట్ చానల్‌ను జనాల్లోకి తెచ్చారు. ఆ తర్వాత ఈటీవీ గ్రూపు దేశవ్యాప్తంగా ప్రాంతీయ భాషలలో చానళ్లు ప్రారంభించి చాలా చోట్ల నెంబర్‌వన్ గా నిలిపి జాతీయ స్థాయి నెట్‌వర్క్ గా నిలిపి.. ఎన్నో పెద్ద కంపెనీలకు సవాలు విసిరారు. ఇంటర్నెట్ జనరేషన్‌లో పత్రికలు, చానళ్లు వెనుకబడిపోతాయని గుర్తించి.. ఏకంగా 20కి పైగా రాష్ట్రాల పోర్టల్లలో ఈటీవీ భారత్ ను తెచ్చారు.  అన్ని రాష్ట్రాల ఉద్యోగులను ఓ చోటకి చేర్చి.. రామోజీ ఫిల్మిసిటీలోని ఈటీవీ భారత్‌ను  ఓ మినీ ఇండియాగా మార్చారు. 


ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియో 


ఇవన్నీ ఓక ఎత్తైతే.. మొత్తం తెలుగువారందరికీ గర్వకారణమైన ప్రపంచంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోను ఆయన మనకు అందించారు. 2వేల ఎకరాల పైగా విస్తీర్ణంలోని ఆ స్టూడియోకానీ.. అందులోని కొండమీద కోట లాంటి ఆయన ఇంటిని కానీ చూస్తే.. రామోజీ ఎంతటి గ్రాండియర్ అన్నది అర్థం అవుతుంది. అంత పెద్ద స్టూడియో కాంప్లెక్స్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహిస్తారు. అడుగుపెట్టిన దగ్గర నుంచి విదేశాల్లో ఉన్నామా అనిపించేంత పచ్చదనం.. పరిశుభ్రత అక్కడ ఉంటాయి. సాహిత్య సేవ కోసం చతుర, విపుల, భాషా పరిరక్షణ కోసం తెలుగు వెలుగు ఇలా ఆయన టచ్ చేయని రంగం లేదు. 


వెండతెరపై ఉషాకిరణాలు


సినిమా మాధ్యమం బలాన్ని గుర్తించిన ఆయన ప్రొడక్షన్లోకి వెళ్లారు. వెళ్లామంటే అలా ఇలా ఎందుకుంటుంది.. ఆయన రామోజీ.. అందుకే అందులో వచ్చే సినిమాలు కూడా ఆ రేంజ్ లోనే ఉండాలనుకున్నారు ఉంచారు. ఓ పీపుల్స్ ఎన్ కౌంటర్, ఓ మౌనపోరాటం, ఓ ప్రతిఘటన.. ఓ మయూరి దేనికదే.. నిప్పుకణికల్లాంటి సినిమాలు అందించారు.


అన్ని రంగాల్లో అడుగుపెట్టడం మాత్రమే కాదు.. అన్నింటిలోనూ తన స్థాయి ముద్ర ఉండాలన్నది ఆయన తపన. లేకపోతే హైదారాబద్ శివార్లలోని బంజరు భూముల్లో అంతటి సుందర ఫిల్మిసిటీని ఎవరు కలగగగలరు..? చేసినా దాన్ని ఎవరు సాకారం చేయగలరు.. ఆయన తప్ప..? ఓ సారి కృష్ణంరాజు ఆయన్ను వాకింగ్‌లో అడిగారు... ఇంతపెద్ద ఫిల్మ్‌సిటీని ఇంత ఖర్చు చేసి ఎందుకు కట్టారు అని ఆయన్ను అడిగారు. “ ఏం లేదు.. నా పేరు శాశ్వతంగా ఉండిపోవాలని అన్నారు..”  ఆయన తనని తాను బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా తన పేరును. ఎందుకంటే ఆ పేరును ఆయనే పెట్టుకున్నారు కాబట్టి. రామయ్య అనే పాతతరం పేరును మార్చి రామోజీగా మార్చారు. అందుకే ఫిల్మ్ సిటీ ఇంకేదీ కాకుండా తన పేరే పెట్టుకున్నారు.  


ఆ ఫిల్మ్ సిటీలోని కొండపై కోట లాంటి ఇంటిని కట్టారు. అంత పెద్ద విస్తీర్ణంలో  భారీ బంగళా బహుశా తెలుగు రాష్ట్రాలో లేదు అనుకుంటా... ఆయన ఆఫీసు కూడా అంతే గ్రాండియర్‌గా ఉంటుంది. ఆయన ఇష్టపడ్డ వాటి గురించి కూడా అంతే ఆపేక్ష కలిగి ఉంటారు. తన జీవితాన్ని మలుపు తిప్పిన ఈనాడు అంటే ఆయనకు చాలా మమకారం. విశాఖలో ఈనాడు కార్యాలయం అన్నా అంతే ఇష్టం. అందుకే కోర్టులో చాలా కాలం పోరాడారు. లీగల్ పరిధిలో ఆ బిల్డింగ్ ను దక్కించుకోవడానికి శ్రమించారు. చివరకు అది కుదరక.. రాత్రికి రాత్రి కొన్ని గంటల్లోనే విశాఖ కార్యాలయం మొత్తం తరలించాల్సి వచ్చింది. మొత్తం బిల్డింగ్, అందులో సామాన్లు ఎలా పోయినా పర్లేదు.. వైజాగ్ ఈనాడు ఆఫీసు ముందు ఉన్న రెండు ఫిరంగులను మాత్రం ఆయన హైదరాబాద్ పంపమన్నారు. ఈనాడు ముందు అప్పుడు ఎక్కుపెట్టిన ఫిరంగులలాంటివి కట్టి ఉండేవి. వాటిని మాత్రం పెద్ద లారీల్లో హైదరాబాద్ కు పంపారు. తన పేరు చిరస్థాయిగా ఉండేలా ఫిలిం సిటీ కట్టుకున్న ఆయన.. తన తర్వాత వచ్చే తన స్మారకం కూడా తనకు నచ్చిన విధంగానే ఉండాలనుకున్నారు. తను చనిపోవడానికి కొన్నేళ్ల ముందే తన స్మారకాన్ని సిద్ధం చేసుకున్న పెక్యులర్ పర్సన్ రామోజీరావు. 


9 నెంబర్ సెంటిమెంట్ 


దేవుడుని నమ్మని రామోజీరావుకు 9 అనే నెంబర్ పై సెంటిమెంట్ ఉంది. అందుకే ఆయన ఆఫీసు తొమ్మిదో ఫ్లోర్ లో ఉంటుంది. ఆయన వాహనాలకు 9 అంకెలు వచ్చేలా నెంబర్లు ఉంటాయి.  ఆయన చనిపోయిన సమయాన్ని కూడా 9 వచ్చేలా ఉదయం 4.50కి ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు కూడా 9 వతేదీనే జరిపించారు. 


చివరి యుద్ధంలో గెలిచి తుది శ్వాస 


యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికుడిలా ఉండాలన్నది రామోజీ సిద్ధాంతమని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆయన ఎప్పుడూ అలాగే ఉన్నారు. ఆఖరికి 85 ఏళ్ల వయసులోనూ.. లోడెడ్ గన్ లాగా అప్పటి జగన్ ప్రభుత్వంపై గర్జించారు. “అన్ని యుద్ధాల్లో గెలవడం ఒక్కటే విజయానికి గుర్తు కాదు. శత్రువును మళ్లీ యుద్ధం చేయడానికి కోలుకోనీయకుండా కొట్టడమే సంపూర్ణ విజయం.” అని The Art of War Writer Sun Tzu  అంటాడు. అలానే రామోజీ .. తన చివరి రోజుల్లో కూడా తన లాస్ట్ బ్యాటిల్‌ ను చాలా విజయవంతంగా పూర్తి చేశారు.


ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఈనాడుకు మధ్య శత్రుత్వం ఎలా పెరిగిందో అందరూ చూశారు. దానికి ప్రతీకారంగా ఆయన ప్రభుత్వం పై పత్రిక ద్వారా యుద్ధం మొదలు పెట్టారు. అందుకోసం ప్రభుత్వం నుంచి వచ్చే కోట్లాది రూపాయలు యాడ్స్ కూడా వదులుకున్నారు. ప్రభుత్వం డైరక్ట్ అటాక్ చేశారు. ఫలితాలకు మందు కూడా తనను కలిసిన ఉద్యోగులతో తాను ఈ యుద్ధం గెలిచే వరకూ ఆరోగ్యంగానే ఉంటానని..  అతని పతనాన్ని చూసే వెళతానని చెప్పారట.. అన్నట్లుగానే చేశారు. తన జీవిత కాలంలో ఎన్నో మజిలీలను దాటిన ధీరుడు రామోజీ.. తన లాస్ట్ బ్యాటిల్‌ను కూడా విజయవంతంగా ముగించిన సమురాయ్.