Andhra Politics : తెగిపోయేటప్పుడే దారం బలం.. విడిపోయేప్పుడే బంధం విలువ తెలుస్తాయి.. ఇది పవన్ కల్యాణ్ నటించిన ఓ విజయవంతమైన సినిమాలో ఫేమస్ డైలాగ్. ఇప్పుడు జనసేన అధ్యక్షుడిగా  పవన్ కల్యాన్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. బీజేపీతో కలిసి ఉన్న దారాన్ని తెగేవరకూ లాగుతున్నారా అనిపిస్తోంది. అలాగే ఆ పార్టీతో జనసేనకు ఉన్న బంధం విలువపై కూడా అనేక సందేహాలు వస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు అన్నయ్యను పిలిచి... తమ్ముడికి.. సరైన రీతిలో ఆహ్వానం దక్కనప్పుడే.. అనుమానాలు మొదలయ్యాయి. అవి ఇవాల్టి నాగబాబు ట్వీట్లలో మరింత పెరిగాయి. మూడు రోజుల కిందట భీమవరం అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తన అన్నయ్య తప్ప.. మిగతా వారంతా.. నటించారని నాగబాబు ట్వీట్ చేశారు. సరే ఆయన అన్నయ్య చిరంజీవి పెద్ద నటుడు కాబట్టి.. ఆ పోలిక తెచ్చి.. నటుడైన ఆయన నటించలేదు కానీ.. మిగతా వారంతా అద్భుతంగా నటించారు అన్నారు


నాగబాబు..! ఎంతమాట...!?


అక్కడ వేదిక మీద ఉంది.. ప్రధానమంత్రి, కేంద్రమంత్రి.. ముఖ్యమంత్రి.. మరి ఈ మాటలు.. జనసేన పార్టీ రాజకీయ అభిప్రాయంగా తీసుకోవాలా.. లేక నాగబాబు వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాలా..? ఇది వ్యక్తిగత అభిప్రాయం అనే Disclaimer లేదు కాబట్టి ఇది కచ్చితంగా పార్టీ అభిప్రాయంగానే పరిగణించాల్సి వస్తోంది. ఎందుకంటే.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు సరిసమానంగా అన్ని వేదికలను నాగబాబు పంచుకుంటున్నారు. పైగా బీజేపీ- జనసేన పొత్తుపై అనేక సందేహాలు వస్తున్న వేళ.. ఆయన.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇదేదో .. అనుకోకుండా జరిగింది.. అనుకోవడానికి వీల్లేదు. ఎవరో కామన్ కార్యకర్త అన్నాడులే అని సరిపెట్టుకోవడానికి  లేదు. 


బీజేపీ-జెఎస్పీ మధ్య పెరుగుతున్న గ్యాప్


పేరుకు పొత్తులో ఉన్నా.. బీజేపీ -జనసేన కలిసి ఉన్నట్లుగా అసలు కనిపించవు. కలిసి చేసిన పోరాటాలు కానీ.. వివిధ అంశాలపై అభిప్రాయాలు కానీ.. ఒకేలా ఉండటం లేదు. క్షేత్రస్థాయిలో క్యాడర్‌లో కూడా అదెక్కడా కనిపించదు. పైగా తిరుపతి ఎన్నికలప్పుడు.. పొత్తులో ఉన్న గ్యాప్ స్పష్టంగా కనిపించింది. బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో తమ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీతో ఉన్న సన్నిహితంగా కూడా జనసేనతో ఉండకపోవడం అనేక సందర్భాల్లో కనిపించింది. వైసీపీ నేతలకు దొరికిన ప్రధాని, హోంమంత్రి అపాయింట్ మెంంట్లు పవన్ కల్యాన్ కు దొరకని సందర్భాలు ఉన్నాయి. పవన్ ను రాజ్యసభకు తీసుకుని రాష్ట్రంలో కీలక నాయకుడిగా మారుస్తారని.. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ నే ప్రకటిస్తారని జనసేన క్యాడర్ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే.. బీజేపీతో పోలిస్తే.. జనసేనకు జనాదరణ ఎక్కువ ఉంది. పవన్ కల్యాణ్ కచ్చితంగా చరిష్మా ఉన్న నాయకుడు.. వాళ్లు ఆశించడంలో తప్పేం లేదు. కానీ అలాంటివేం జరుగకపోగా.. అపాయింట్మెంట్లు కూడా దక్కని పరస్థితులు వచ్చాయి. ఈ గ్యాప్ మరింత ఎక్కువుగా ఉందని.. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో తేలిపోయింది. ప్రధాన ప‌్రతిపక్షం తెదేపాను.. ఏ పార్టీలోనూ.. లేకపోయినా.. నటుడు చిరంజీవిని ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం.. పవన్ కల్యాణ్ ను మాత్రం సరైన రీతిలో పిలవలేదు. పైగా పవన్ కు పోటీగా చిరంజీవిని తెరపైకి తీసుకొస్తున్నారన్న అభిప్రాయం బయటకు వచ్చింది. ఈ విషయంలో జనసేన అసంతృప్తిగా ఉందన్న సూచనలు కనిపిస్తుండగా.. నాగబాబు ట్వీట్లు దాన్ని రూఢీ చేశాయి.. 


పొత్తుకు పోటు పడుతోందా..?


జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ పార్టీ వ్యవహారం ప్రత్యేకంగానే ఉంది. పార్టీ స్థాపించిన మొదటి ఎన్నికల్లో అసలు పోటీనే చేయకుండా.. బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చింది.  ఆ తర్వాత నాలుగేళ్లకు  ఏమైందో.. పవన్ కల్యాన్‌ అనూహ్యంగా టీడీపీ పైన దాడి మొదలుపెట్టారు. 2019 లో  కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి...  ఆరుశాతం ఓట్లు సాధించారు. 2019 కు ముందు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని..ఆంధ్రకు పాచిపోయిన లడ్డూలు పంపారని  ఘోరంగా విమర్శించిన ఆయన .. ఎన్నికల తర్వాత ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు. పేరుకు పొత్తు అయినా క్షేత్రస్థాయిలో అదెక్కడా అంతగా కనిపించదు. బీజేపీ రాష్ట్ర అ‌ధ్యక్షుడు సోమూ వీర్రాజు లాంటి వాళ్లు మాత్రం పవన్ కు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. కిందటి ఎన్నికల్లో అనూహ్యంగా స్టాండ్ మార్చినట్లే.. ఈసారి కూడా ఆయన ఇంకో ప్రతిపాదన చేస్తున్నారు. బలంగా ఉన్న వైసీపీని పడగొట్టాలంటే.. ప్రతిపక్షాలన్నీ ఒకటి కావాలన్నారు. అంటే బీజేపీ- జనసేన తెలుగుదేశం కలవాలన్నది ఆయన కల. మరి అది సాధ్యమయ్యే పరిస్థితి ఉన్నట్లుగా లేదు. ఇందుకోసం పవన్ మూడు ఆప్షన్లు కూడా ఇచ్చారు. పొత్తు ధర్మం ప్రకారం బీజేపీతో పోటీచేయడం... రెండు మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం ... లేకపోతే.. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం.. దీనిపై మిగిలిన రెండు పార్టీల నాయకత్వాలు పరోక్షంగా స్పందించాయి కానీ.. స్పష్టత అయితే ఇవ్వలేదు. 


జనసేన -టీడీపీ సాధ్యమా..!


మూడు ఆప్షన్లు ఇచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ కొద్దికొద్దిగా తమ ఉద్దేశ్యాలు బయటకు తెస్తున్నారు. 2014లో తాము పోటీ కూడా చేయకుండా రాష్ట్రం కోసం త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్లు చేయాలని... అందులో ఒకటి. అంటే ఏంటి.. చంద్రబాబునాయుడు ..తాను ముఖ్యమంత్రిని అభ్యర్థి కాదు... పవన్ కల్యానే మా సీఎం అని చెప్పాలనా ఉద్దేశ్యం అని టీడీపీ లీడర్, క్యాడర్ అంటున్నారు. అయితే తప్పేంటి అని జనసేన క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. 6శాతం ఓట్లు ఉన్న జనసేన కండిషన్లు డిక్టేట్ చేస్తే. . 40శాతం ఓట్లు వచ్చిన మేం ఎందుకు అని టీడీపీ ప్రశ్నిస్తోంది. మొదట్లో జనసేన పోత్తుపై కాస్త సానుకూలంగానే స్పందించిన టీడీపీ నాయకత్వం కూడా తర్వాత.. దీని గురించి మాట్లాడటం మానేసింది. జగన్  ప్రభుత్వంపై వ్యతిరేకత తాము వూహించిన దానికన్నా.. తీవ్రంగా ఉందని.. ఇప్పుడు వేరొక పార్టీ మద్దతు తమకు అవసరం లేదని.. ఆ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందన్న కాన్ఫిడెన్సు పార్టీ అధినాయకత్వానికి వచ్చినట్లు ఉంది. అయితే తమను పట్టించుకోకుండా.. ఎన్నికలకు వెళితే.. కిందటి సారిలా బొక్కబోర్లా పడతారని.. తమ అవసరం వారికి ఉన్నప్పుడు. తమకు తగిన ప్రాధాన్యతనే ఇవ్వాలని.. ఉమ్మడి శత్రువు జగన్ ఆపాలన్న "పెద్ద టార్గెట్ " ను చేధించాలంటే.. ముఖ్యమంత్రి పదవిని అయినా టీడీపీ త్యాగం చేయాల్సిందేనని జనసేన కార్యకర్తల అభిమతం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పొత్తు ముందుకెళ్లేలా కనబడటం లేదు. 


వైసీపీ పై చేయి సాధించిందా..?


మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ తాను అనుకున్నట్లుగా చేయగలుగుతోందనిపిస్తోంది. ప్రభుత్వంమీద వ్యతిరేకత కనిపిస్తున్న విషయాన్ని ఆ పార్టీ గుర్తించింది. అయితే అది ఎన్నికల్లో ఓడగొట్టగలిగే స్థాయిలో ఉందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ జనసేన-టీడీపీ కలిస్తే.. కనుక అది కచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమని ముఖ్యమంత్రి గుర్తించారు. ఈ పొత్తు కుదరకుండా చేయాలన్నది ఆయన ఢిల్లీ పర్యటనల అజెండాలో ఓ ముఖ్యమైన అంశం. బీజేపీ కూడా దానిని తాత్కాలికంగా పాటిస్తున్నట్లుగానే ఉంది. ఎందుకంటే జగన్ తమ చేతిలో మనిషి. అన్నింటికి తమకు మద్దతిస్తున్నటువంటి భాగస్వామి.. తెలంగాణలో లాగా అధికార పార్టీతో తగవులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే పరిస్థితి ఆంధ్రాలో లేదు. అలాంట‌పుడు అధికారంలో ఉన్న పార్టీనే తమ చేతుల్లో పెట్టుకుంటే సరిపోద్ది అన్నది వాళ్ల వ్యూహం. అందుకే ఈ విషయంలో జగన్ మాటను మన్నిస్తున్నారనకోవచ్చు.  అందుకే పవన్ కల్యాన్ ఆప్షన్లు ఇచ్చినా.. ఆక్రోశించినా... ఢిల్లీ నుంచి స్పందన మాత్రం రావడం లేదు.  పవన్ కు ఆహ్వానం విషయం.. టీడీపీని దూరం పెట్టే అంశంలో వైసీపీ విజయం సాధించినట్లుగా కనిపిస్తోంది. పైగా కిందటి ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన పనులకు వాళ్ల కోపం అప్పుడే.. చల్లారే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి టీడీపీ కూడా బీజేపీ విషయంలో వేచి చూసే పరిస్థితుల్లోనే ఉంది. బీజేపీ మాత్రం ఏ విషయం తేల్చకుండా ఆటను ఆస్వాదిస్తోంది. 


మరి ఏం జరుగుతుంది...?


ప్రస్తుతానికి తాత్కాలికంగా వైసీపీ పై చేయి సాధించింది. ఇది ఇలాగే ఉంటుందా... బీజేపీ మనసు మార్చుకుంటుందా లేదా అన్నది తెలీదు. పైగా టీడీపీతో వచ్చిన గ్యాప్ దృష్ట్యా మళ్లీ వాళ్లతో కలిసే అవకాశాలు తక్కువుగా ఉన్నాయి. కనుచూపు మేరలో బీజేపీకి ఏపీలో అధికారం లేదు. ఇలాంటప్పుడు.. ఏ పార్టీని.. పూర్తిగా ఫిషిష్ చేసి.. ఆ ప్లేసులోకి రావాలా అన్నది బీజేపీ చూస్తుంది. పవన్ ను పూర్తిగా తమలో కలుపుకుని ఎదగడమా.. లేక వేసీపీనో.. టీడీపీనో పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న వ్యూహమా అనేవి ఉంటాయి. బీజేపీ అయితే.. 2024 గురించి కచ్చితంగా ఆలోచించదు.  2029లో తమకు ఏది లాభం అని ఆలోచించి.. ఇప్పుడు అడుగువేస్తుంది.  ఇక్కడ సీనియర్రాజకీయ వేత్త.. ఉండవల్లి మాటలను గుర్తుచేసుకోవాలి. "2024లో ఎవరు గెలిస్తే.. ఏంటి అన్నీ బీజేపీ ప్రభుత్వాలే కదా.."