సరిగ్గా వందేళ్ల క్రితం,1922 మార్చి 18న మహాత్మా గాంధీ బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశద్రోహం, 'అసంతృప్తిని ప్రేరేపించడం' ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్నారు. ఈ ఘటన చరిత్రలో 'ది గ్రేట్ ట్రయల్'గా నిలిచిపోయింది. ఈ విచారణలో గాంధీ దోషిగా తేలినప్పటికీ
ఆరు సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే విధించారు. అయితే ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడం, సహా సత్ప్రవర్తన వల్ల రెండు సంవత్సరాల తర్వాత విడుదల చేశారు. ఇది గాంధీ సాధించిన ఓ అద్భుత నైతిక విజయంగా చరిత్ర చెబుతోంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? విచారణ ఎలా జరిగింది? అని తెలుసుకుందాం.
చౌరీ చౌరా ఘటన
1920లో మహాత్మా గాంధీ మొదలు పెట్టిన సహాయనిరాకరణ ఉద్యమం 1922 సమయంలో దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున సాగుతోంది. అయితే 1922 ఫిబ్రవరి 4న ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్ దగ్గర్లో ఉన్న చౌరీ చౌరా అనే మార్కెట్‌లో జరిగిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
మద్యం దుకాణాల ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో దీనికి నిరసనగా ఫిబ్రవరి 4న ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సుమారు 2500 మంది చౌరీ చౌరా మార్కెట్‌వైపు కదిలారు. ఈ పరిణామాన్ని ముందే ఊహించిన పోలీసులు అదనపు బలగాలను దించారు. ముందుకు కదులుతున్న ఆందోళన కారులను భయపెట్టడానికి గాల్లో కాల్పులు జరిపారు. దీంతో ఆగ్రహించిన ప్రజానీకం రాళ్లు విసరటంతో... తుపాకుల్ని ప్రజలపై ప్రయోగించారు. ముగ్గురు మరణించారు.
ఆందోళన కారుల్లో ఆగ్రహం వెల్లువై దూసుకురావటంతో... పోలీసులంతా వెనకడగువేసి స్టేషన్లో దాక్కున్నారు. ఉత్తి పుణ్యానికి అమాయకులను బలితీసుకున్నారనే కోపంతో స్టేషన్‌కు తాళం వేసి... బజార్‌లోంచి కిరోసిన్ తీసుకొచ్చి ఆందోళనకారులు స్టేషన్‌కు నిప్పుపెట్టారు. 23 మంది పోలీసులు నిలువునా దహనమయ్యారు.
గాంధీజీ ఈ హింసను నిరసిస్తూ ఐదు రోజుల ఉపవాస దీక్ష చేపట్టడమేగాకుండా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీజీ ఏకపక్ష నిర్ణయం ప్రజలందరినే కాకుండా కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలను కూడా ఆశ్చర్య పరిచింది. నెహ్రూ, సర్దార్ పటేల్, లాలా లజపతిరాయ్‌లాంటి వారంతా ఉద్యమం రద్దును వ్యతిరేకించారు. కానీ చివరకు గాంధీ మాటకు ఎదురు నిలవలేక అయిష్టంగానే తలొగ్గారు. ఉద్యమం ఆగిపోయింది. దేశంలోని ఓ మారుమూల జరిగిన ఓ సంఘటన ఆధారంగా... దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఆపడమేంటనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినా గాంధీజీ తన నిర్ణయాన్ని సమర్థించుకొని కట్టుబడి ఉన్నారు. 'అహింస పద్ధతికి ప్రజలింకా అలవాటు పడలేదు. వారిని సరిగా సిద్ధం చేయలేకపోయాను. ప్రత్యర్థి రెచ్చగొడితే హింసతో స్పందించకుండా తట్టుకొని నిలబడే సహనం కూడా అహింసలో భాగమే' అని గాంధీజీ భావించారు.
అహింసా పద్ధతిని పాటిస్తే దేశానికి ఒక్క ఏడాదిలో స్వతంత్రం తెస్తానని గాంధీజీ 1920లో ప్రకటించారు. కానీ సహాయనిరాకరణ ఉద్యమం ఆపయడం వల్ల గాంధీపై ప్రజలకున్న విశ్వాసనం సన్నగిల్లుతుందని బ్రిటిషర్లు భావించారు. గాంధీజీని ఎప్పటి నుంచో అరెస్ట్ చేయాలని భావిస్తోన్న బ్రిటిషర్లకు సరైన సమయం దొరకలేదు.
అయితే గాంధీజీ అప్పుడప్పుడు యంగ్ ఇండియా పత్రికలో వ్యాసాలు రాసేవారు. ఆయన రాసే కథనాల్లో బ్రిటిష్ పాలనను క్రూరమైనదిగా అభివర్ణించేవారు. స్వరాజ్య సాధన కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని గాంధీ అన్నారు.
గాంధీ అరెస్ట్
చౌరీ చౌరా, సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేసిన తర్వాత గాంధీజీని అరెస్ట్ చేసేందుకు బ్రిటిషర్లు సిద్ధమయ్యారు. గాంధీని కోర్టు మెట్లు ఎక్కించడం ద్వారా బ్రిటిషర్లు తమ లక్ష్యాన్ని సాధించినట్లే అనుకున్నారు. బ్రిటిషర్ల పాలనలో గాంధీ అరెస్ట్ ఆయనపై జరిగిన విచారణ చాలా కీలకమనే చెప్పాలి. గాంధీకి ముందు చాలా మంది జాతీయవాదులను తరచుగా ఇండియన్ పీనల్ కోడ్ 124A సెక్షన్ కింద బ్రిటిషర్లు అరెస్ట్ చేశారు.
అయితే ఇలాంటి గొప్ప నేతలను విచారించడం వల్ల వారిపై ప్రజలకు కూడా సానుభూతి పెరిగే అపాయం ఉందని బ్రిటిషర్లు గుర్తించారు. అంతేకాకుండా కోర్టులో వారి వాదనలు వినిపించే అవకాశం కూడా ఉంది. 1908లో తిలక్‌పై దేశద్రోహం కేసు పెట్టి విచారించింది కోర్టు. అయితే చట్టాలపై తిలక్‌కు ఉన్న అవగాహన, వాదనలో పట్టు చూసి కోర్టే ఆశ్చర్యపోయింది. అందుకే గాంధీని విచారణకు తీసుకువస్తే ఏమవుతుందోనని బ్రిటిషర్లకు ఒకింత అనుమానం కూడా కలిగింది.
గాంధీ విచారణ
గాంధీని విచారణకు తీసుకురావడానికి ముందు, అతనిపై ఒక నిర్దిష్ట నేరం మోపవలసి వచ్చింది. 'యంగ్ ఇండియా'లో గాంధీ రాసిన కొన్ని కథనాలు దేశద్రోహం కింద పరిగణించవచ్చని బ్రిటిషర్లు ఆలోచించారు. ముఖ్యంగా అందులో మూడు కథనాలు.. దేశంలో హింసను, ప్రభుత్వంపై ద్వేషాన్ని పెంచే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే గాంధీపై మోహిన అభియోగాల్లో 'దేశద్రోహం' అనే పదాన్ని ఎక్కడా ఉపయోగించలేదు. కానీ ఐపీసీ 124A సెక్షన్.. ఇంగ్లాండ్ దేశద్రోహం చట్టం నుంచే తీసుకున్నారు. స్వతంత్ర సంగ్రామాన్ని నిలువరించేందుకు బ్రిటిషర్లు ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా వాడుకున్నారు.
1922, మార్చి 11 మధ్యాహ్నం.. గాంధీ సహా యంగ్ ఇండియా పబ్లిషర్ శంకర్‌లాల్ బ్యాంకర్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. తన వృత్తి గురించి అడిగినప్పుడు తాను ఓక నేత కార్మికుడు, రైతును అని గాంధీ బదులిచ్చారు. ఇది చూసి కోర్టు షాక్ అయింది. సత్యాగ్రహ సిద్ధాంత రూపకర్త, ఓ రచయితగా తనను తాను చెప్పుకోవడం గాంధీకి నచ్చలేదు. నిజానికి తన ఆశ్రమంలో కూరగాయలు పండిస్తాడు కనుక ఓ రైతుగా చెప్పుకోవడానికే గాంధీ ఇష్టపడ్డారు.
మరోవైపు చరకా యంత్రాన్నే స్వతంత్ర ఉద్యమంలో ఓ గొప్ప ఆయుధంగా గాంధీజీ భావించారు. అందుకే తనను తాను ఓ నేత కార్మికుడిగా గాంధీజీ పేర్కొన్నారు.
గ్రేటెస్ట్ మేన్ ఆఫ్ ది వరల్డ్
ఓ వారం తర్వాత మార్చి 18న షహీ బాగ్ సర్య్కూట్ హౌస్‌కు గాంధీని తీసుకువచ్చారు. జవహర్‌లాల్ నెహ్రూ, సరోజిని నాయుడు, సబర్మతి ఆశ్రమవాసులతో కోర్టు రూమ్ మొత్తం కిక్కిరిసిపోయింది. గాంధీ కోర్టులోకి అడుగుపెట్టేటప్పుడు ఆయనకు గౌరవమిస్తూ ప్రతి ఒక్కరి లేచి నిలబడ్డారు. ఈ చారిత్రక విచారణకు రాబర్ట్ బ్రూమ్‌ఫీల్డ్, ఐసీఎస్, జిల్లా, సెషన్స్ జడ్జీగా ఉన్నారు.
బాంబే ప్రెసిడెన్సీ అడ్వకేట్ జనరల్ సర్ థామస్ స్ట్రేంజ్‌మెన్ ప్రాసిక్యూషన్ చేశారు. గాంధీ, శంకర్‌లాల్ ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. దీంతో విచారణకు పెద్ద సమయం పట్టలేదు. అయితే శిక్షను ప్రకటించే ముందు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని జడ్జీ కోరారు. ఆనాడు కోర్టులో గాంధీ చెప్పిన మాటలు విని జడ్జీ సహా కోర్టు ప్రాంగణంలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు.
గాంధీ మాటలు విన్న న్యాయమూర్తి ఆయనకు వందనం చేశారు.
అనంతరం గాంధీని కోర్టు నుంచి తీసుకువెళ్లే సమయంలో అక్కడున్నవారు ఆయన పాదాలపై పడ్డారు. బాంబే క్రోనికల్ పత్రిక ఆ తరువాతి రోజు 'గ్రేటెస్ట్ మేన్ ఆఫ్ ది వరల్డ్' అంటూ ఆయన గురించి వ్యాసం రాసింది.
- వినయ్ లాల్, రచయిత, బ్లాగర్, కల్చరల్ క్రిటిక్, ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ (యూసీఎల్ఏ)
[నోట్: ఈ వెబ్‌సైట్‌లో వివిధ రచయితలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకాలు వారి వ్యక్తిగతమైనవి. ABP News Network Pvt Ltd అభిప్రాయాలు, నమ్మకాలను ఇవి ఏ మాత్రం ప్రతిబింబించవు.]