జగన్మోహనరెడ్డి మొదటి కేబినెట్‌లో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి మంత్రి పదవి దక్కడమే కాదు. ఏకంగా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అంత జూనియర్ ఎమ్మెల్యేకు అంత ప్రాధాన్యం వచ్చింది ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ.. అప్పుడు అక్కడ జగన్ ఆమె లాయల్టీని చూశారు. టీడీపీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. చివరకు సొంత కుటుంబంలో గొడవలు వచ్చినా ఆమె మాత్రం జై జగన్ అనే అన్నారు. అందుకే.. ఆ పదవి. సోషల్ ఈక్వేషన్లు, రికమండేషన్లు, పరిస్థితుల ప్రభావం, రాజకీయ బలం ఇలా ఎన్ని ఉన్నా... మొదటి కేబినెట్‌లో జగన్ లాయల్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. 


కానీ ఈసారి మరి అలా జరిగిందా.. పరిస్థితులు ఎట్లా ఉన్నా.. తాను అనుకున్న వారికి, తననే నమ్ముకున్న వారికి జగన్ న్యాయం చేయలగలిగారా.. అంటే.. లేదనే అనుకోవాలి. ఎందుకంటే.. లెక్కల తక్కెడలో లాయల్టీ కొట్టుకుపోయింది. సామాజిక న్యాయం కోసం సహజ న్యాయాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. మఖ్యమంత్రిగా మూడేళ్లు పూర్తిగా చేసుకున్న జగన్.. మరింత బలోపేతం కావాలి కానీ.. ఈ సోషల్ ఈక్వేషన్లలో సొంత వాళ్లనే పక్కన పెట్టాల్సి వచ్చింది. 


2014లో కాంగ్రెస్ వీక్ అయిపోయాక... ఆ పార్టీలో ఉన్న నేతలకు ఉన్న ఆప్షన్లు రెండు ఒకటి టీడీపీ -రెండు వైఎస్సార్సీపీ. అప్పటికే ఉపఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న వైసీపీకి కాంగ్రెస్ నేతలు ఎక్కువ మంది వెళ్లిపోయారు. సహజంగా కాంగ్రెస్‌కు మరో రూపమే కాబట్టి.. అక్కడైతేనే ఇమడగలం అనుకున్న వాళ్లు అటు వెళ్లిపోయారు. 2019 కి ముందు టీడీపీ నుంచి కూడా కొంతమంది వెళ్లి వైసీపీలో చేరారు. ఇవన్నీ ఓకే కానీ.. అసలు జగన్ మోహనరెడ్డి అనే ఒక ఎంపీని నమ్మి.. ఆయన వెంట నడిచిన వాళ్లు కదా.. నిజమైన లాయలిస్టులు. వాళ్లు కనుక.. జగన్‌ను నమ్మి 2011లో ఆయన వెంట నడిచి ఉండకపోతే.. 2012లో బై ఎలక్షన్ వచ్చేది కాదు. అలా 18మంది జగన్ వెంట నిలవబట్టి.. ఎన్నికలు జరిగి.. ఆయన 16 సీట్లు గెలుచుకున్నారు. అప్పుడే.. జగన్ మోహనరెడ్డి సామర్థ్యం రాష్ట్రం అంతా తెలిసింది. ఒకవేళ వీళ్లు రాకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది అన్నది వేరే లెక్క. కానీ ఈ లెక్కనే అప్పుడు పదవులు త్యాగం చేసి వచ్చిన వాళ్లు అత్యంత విశ్వాసపాత్రులు. మరి వాళ్లలో ఎంత మందికి న్యాయం జరిగిందంటే.. సమాధానం ఇబ్బందిగానే ఉంటుంది. 


జగన్ కోసం మంత్రి పదవులను కూడా వదులుకుని వచ్చింది.. పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి. వీరిలో పిల్లి ఓడిపోయినప్పుటికీ...ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మరీ జగన్ మంత్రి పదవి ఇచ్చారు. జగన్... తీరును అప్పుడు అంతా ప్రశంసించారు. బాలినేనికీ అప్పుడు మంత్రి పదవి దక్కింది. మరి ఈసారి బాలినేనికి మంత్రిపదవి దక్కలేదు. అందరికీ తీసేశారు అనుకోవడానికి కొంతమంది పాతవారిని కొనసాగించినప్పుడు..బాలినేని ఎందుకు కాదన్నారు అన్నది ప్రశ్న. ఆయన యాంగిల్‌లో అది కరెక్టే కదా.. మంత్రి పదవిని వదులుకొని వచ్చినప్పుడు.. ప్రాధాన్యం దక్కాలి కదా.. అందరూ నేనూ ఒకటేనా అన్నది బాలినేని ఆవేదన. 


జగన్ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వారిలో గొల్ల బాబూరావు ఉన్నారు. ఈసారి ఎస్సీ కోటాలో ఆయనకు మంత్రి పదవి వస్తుందనుకున్నారు. ఐదుగురు ఎస్సీ మంత్రులను పాతవారినే కొనసాగించే బదులు బాబూరావుకు ఇవ్వొచ్చు కదా అన్నది ఆయన అభిమానుల ఆవేదన. జగన్‌తో కలిసి మొదటి నుంచి నడుస్తున్న ఎమ్మెల్యే ప్రసాదరాజు. ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి జగన్ కోసం వచ్చారు. క్షత్రియ కోటాలో ఆయనకు మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. కానీ.. చివరకు సీన్ మారిపోయి.. చీఫ్ విప్‌గా మిగిలారు. మంత్రి కావాలన్న కల ప్రసాదరాజుకు తీరలేదు. ఇక జగన్ కోసం రాజీనామా చేసిన బాలరాజుకు కూడా మంత్రి పదవి దక్కలేదు. ఎస్టీ కోటా రాజన్న దొరకు ఇచ్చినప్పుటికీ.. అంతకంటే ముందు ఎమ్మెల్యే పదవిని వదులుకున్న బాలరాజుకే ఎక్కువ అర్హత ఉంటుంది కదా.. 


ఇక గుంటూరు జిల్లా నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అలాగే జరిగింది. 2012లో జగన్ కోసం ఆయన రాజీనామా చేశారు. అదొక్కటే కాదు ఆ జిల్లాలో చూసుకున్నా సీనియర్ నాయకుడు పిన్నెల్లి. ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆ లెక్కన చూసినా ఆయనకు అవకాశం రావాలి. రాలేదు. కాబట్టే అసమ్మతి ఆ స్థాయిలో భగ్గుమంది. ఇదే జిల్లాలో జగన్ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యే నిన్నటి హోం మంత్రి సుచరిత... ఆమెకు మంత్రి పదవి తీసేశారు. అందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ.. ఎస్సీ మంత్రులు అందరినీ కొనసాగించి.. తనను మాత్రమే తొలగించడం ఏంటని ఆమె ఆంతరంగికులు అడుగుతున్నారు. జగన్ కోసం ఎమ్మెల్యే పదవి వదులుకుని వచ్చినందుకు ఇదే బహుమతా అంటున్నారు. అందరినీ తీసేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు మరి.


జగన్ కోసం పదవిని వదులుకుని వచ్చిన నల్లపురెడ్డి ప్రసన్నకుమారరెడ్డికీ అవకాశం రాలేదు. కాపు రామచంద్రారెడ్డినీ కన్సిడర్ చేయలేదు. ఇక కడప జిల్లా నుంచి జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని వదులుకున్న కోరుముట్ల శ్రీనివాసులు పేరు చివరి వరకూ వినిపించినా.. చివర్లో మాత్రం లేదు. దాంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. జగన్ పట్ల విధేయతకు తనకు గుర్తింపు వస్తుందనుకున్నా.. ఆ అవకాశం రాలేదు. 


వీళ్లంతా జగన్మోహనరెడ్డి ...రాష్ట్ర స్థాయి నాయకుడుగా గుర్తింపు పొందకముందే.. ఆయన్ను నమ్మి.. ఆయనతో అడుగులు వేసిన వాళ్లు. వీళ్లలో కొందరికీ మొదటిసారి న్యాయం జరిగింది. కొందరికి అసలు లేదు. మొదటి దఫాలో మంత్రులు అయిన బాలినేని, సుచరితకు కూడా మళ్లీ కోరడానికి వారికి సరైన కారణం కనిపిస్తోంది. 


ఇక రెండో తరహా లాయల్టీ చూసుకున్నట్లేతే.. పదువుల ఆశ పెట్టినా.. ఒత్తిడులు వచ్చినా పార్టీలోనే ఉన్న వారికి న్యాయం జరక్కపోవడం. కృష్ణాజిల్లాలో రక్షణనిధికి ఇలాంటి పరిస్థితే వచ్చినా ఆయన వైసీపీతోనే ఉన్నారు. ఎస్సీ కోటాలో అవకాశం వస్తుందనుకున్నారు. కానీ.. ఆయనకు కాదు కదా.. ఆ ఎన్టీఆర్ జిల్లాలోనే ఎవరికీ అవకాశం రాలేదు. మేకా ప్రతాప్ అప్పారావుదీ అదే పరిస్థితి. జగన్‌తోనే ఉన్న వరప్రసాద్‌కు కూడా ఎస్సీ కోటాలో అవకాశం రాలేదు. 


ఇక ఈ లాయల్టీ పక్కన పెడితే.. జగన్ మోహనరెడ్డి కుటుంబానికి మొదటి నుంచి లాయలిస్టుగా ఉన్న భూమన కరుణాకరరెడ్డికి, జగన్‌కు పర్సనల్‌గా విశ్వాసపాత్రుడిగా ఉండే చెవిరెడ్డికీ దక్కలేదు. పదవులు లేకపోయినా కాంగ్రెస్‌ను కాదని మొదటి నుంచీ జగన్‌తో నడిచిన... కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, సామినేని ఉదయభాను లాంటి వాళ్లకీ అవకాశం కల్పించలేకపోయారు.. జగన్. 


సామాజిక సమతూకంలో తనకు కావలసిన వాళ్లని దూరం పెట్టకతప్పలేదు. ఇవన్నీ ఓట్ల లెక్కలే.. సందేహం లేదు. తనకు ఏకపక్షంగా సపోర్ట్ చేసిన కురబ, బోయ, శెట్టి బలిజ వర్గాలకు మళ్లీ పదవులు ఇవ్వాలనుకున్నారు. రోజా వంటి వారి రిక్వెస్ట్‌లు ఎమోషనల్ అవ్వడంతో రెడ్ల నుంచి మరొకరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఎస్సీలు 5, ఎస్టీ, మైనార్టీలకు కచ్చితంగా ఇవ్వాలనుకున్నారు కాబట్టి... మిగతా వారికి స్ధానం కల్పించడం కష్టమైంది. వైసీపీలో ఓసీలంటే.. రెడ్లు మాత్రమే అంటూ.. టీడీపీ మూడు రోజులుగా ట్రోల్ చేస్తోంది. దానికి తగ్గట్లుగా రెడ్లు, కాపులు తప్ప వేరే వర్గాలకు అవకాశం రాలేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యలను పట్టించుకోలేదు. 


మొత్తానికి 2024 ఓట్ల లెక్కలతో వేసిన ఈ బాలెన్సు షీట్ లో లాయల్టీ లయబులిటీగా మిగిలిపోయింది.