Yezdi Roadster 2025 First Ride Review: యువత కోసం క్రూయిజర్ బైక్‌లలో కొత్తగా Yezdi Roadster 2025 లాంచ్‌ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ బండి ఎక్స్-షోరూమ్‌ రేటు రూ. 2,12,969 అయినప్పటికీ, GST తగ్గింపుతో దీని ధర దాదాపు రూ. 16,000 తగ్గి, ఇప్పుడు రూ. 2 లక్షల లోపులోనే లభిస్తోంది. ఈ రేటే దీనికి పెద్ద ఆకర్షణ. ఈ బైక్ కేవలం చవకగా ఉండడమే కాదు, పెర్ఫార్మెన్స్‌లో కూడా తన ప్రత్యేకత చాటుతోంది.

లుక్స్‌ & డిజైన్

మొదటి చూపులో Yezdi Roadster పాత మోడల్‌లానే అనిపించినా, వెనుక భాగం కొత్త డిజైన్‌తో స్లీక్‌గా, మరింత స్టైలిష్‌గా మారింది. వెడల్పైన వెనుక టైరు బైక్‌కు మంచి రోడ్ ప్రెజెన్స్ ఇస్తోంది. కొత్తగా వచ్చిన నాలుగు కలర్ ఆప్షన్లు ఈ మోటార్‌ సైకిల్‌కు ప్రీమియం టచ్ ఇస్తాయి. బ్లాక్‌డ్ ఇంజిన్‌, ఎగ్జాస్ట్ ట్రీట్మెంట్‌తో ఈ బైక్ మోడ్రన్-రెట్రో ఫీల్‌ను కలిపి చూపిస్తోంది. చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది, కానీ ఓవర్‌ స్టైల్‌గా మాత్రం ఉండదు.

ఇంజిన్ & ఫీచర్లు

334 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఈ బైక్‌కి హార్ట్‌. ఇది 29.5 bhp పవర్‌, 29 Nm టార్క్ ఇస్తుంది. వినడానికి ఈ సంఖ్యలు పెద్దగా ప్రత్యేకంగా ఉండకపోయినా, ట్యూనింగ్ వల్ల డ్రైవింగ్ అనుభవం స్మూత్‌గా సాగిపోతుంది.

రైడింగ్ మోడ్స్‌ ఈసారి హైలైట్‌:

సిటీ మోడ్‌ - తక్కువ స్పీడ్‌లో సాఫ్ట్ థ్రాటిల్ రెస్పాన్స్ ఇస్తుంది. గంటకు 100 km వరకు స్పీడ్ క్యాప్‌ ఉంటుంది. ఫ్యూయల్ ఎఫిషియెన్సీ మెరుగ్గా ఉంటుంది.

హైవే మోడ్‌ - థ్రాటిల్ ఫ్రీగా పని చేస్తుంది, ఓవర్‌ టేకింగ్‌ సులభంగా మారుతుంది, లాంగ్‌ రైడ్స్‌కి ఈ మోడ్‌ చాలా బాగుంటుంది.

డ్యూయల్ చానల్ ABS, మల్టీఫంక్షనల్ టర్న్ ఇండికేటర్స్, డిటాచబుల్ పిలియన్ సీటు (తొలగించగల వెనుక సీటు) వంటి ఫీచర్లు ఈ బైక్‌కు అదనపు ప్రత్యేకతలు.

రైడ్ & కంఫర్ట్

గేర్‌బాక్స్ ఇప్పుడు స్మూత్‌గా పని చేస్తుంది, ట్రాఫిక్‌లో ఎక్కువగా గేర్లు మార్చాల్సిన అవసరం ఉండదు. City Mode లో సిటీ రైడ్ సులభంగా ఉంటుంది. Highway Mode లో మిడ్-రేంజ్ పవర్ బాగా అర్ధమవుతుంది, హైవేలో క్రూయిజ్ చేయడానికి సరిపోతుంది.

బండి కొద్దిగా హై స్పీడ్‌లోకి వెళ్లగానే హ్యాండిల్‌బార్, ఫుట్‌పెగ్స్ వద్ద వైబ్రేషన్స్‌ కనిపిస్తాయి, కానీ సాధారణ రైడర్స్‌కి ఇది అంతగా సమస్య కాదు.

సీటు వెడల్పుగా ఉండటం వల్ల షార్ట్ నుంచి మీడియం రైడ్స్‌కి చాలా కంఫర్ట్ ఇస్తుంది. సస్పెన్షన్ కాస్త స్టిఫ్‌గా ఉండటం వల్ల హెవీ రైడర్స్‌కి బాగుంటుంది. లైట్ రైడర్స్‌కి మాత్రం బంప్స్ దగ్గర కాస్త ఇబ్బంది అనిపించవచ్చు.

హ్యాండ్లింగ్ & బ్రేకింగ్

184 కిలోల బరువు ఉన్నా, ఈ బైక్ హ్యాండిల్ చేయడానికి సులభం. కొత్త వైడ్ హ్యాండిల్‌ బార్ కారణంగా సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవే మలుపుల్లోనూ తిప్పడానికి బాగానే ఉంటుంది.

డ్యూయల్ చానల్ ABS బ్రేకింగ్ రైడర్‌కు నమ్మకాన్ని ఇస్తుంది. సాధారణ డ్రైవింగ్‌కి బాగుంది, కానీ హై స్పీడ్‌లో ఫ్రంట్ బ్రేక్ మరికొంచెం షార్ప్‌గా ఉండాల్సింది అనిపిస్తుంది.

Yezdi Roadster 2025 ఇప్పుడు ధర పరంగా, స్టైల్ పరంగా, ఫీచర్ల పరంగా మంచి ఎంపికగా నిలుస్తోంది. కొత్త డిజైన్, రైడింగ్ మోడ్స్‌, కంఫర్ట్ అన్నీ కలిపి ఈ బైక్‌ని ప్రాక్టికల్‌ & ఫన్‌ ఇచ్చే బైక్‌లా మార్చాయి. మోడ్రన్‌ బైక్‌ అయినప్పటికీ కొన్ని లోపాలు ఉన్నాయి, అవి - కొన్నిసార్లు ఫ్యూయలింగ్ ఇబ్బందులు కనిపించాయి. అధిక RPM వద్ద వైబ్రేషన్స్ వచ్చాయి, బ్రేక్ ఫీడ్‌బ్యాక్‌ మరింత మెరుగ్గా ఉండాలి. కానీ రూ. 2 లక్షల లోపులో ఈ బైక్ ఇచ్చే ఫీచర్లు, పనితనం, స్టైల్ అన్నీ కలిపి చూస్తే, ఇది యువతకు ఒక బెస్ట్ క్రూయిజర్ ఆప్షన్ అవుతుంది.