Teacher Beats Student In Punganur | పుంగనూరు: క్లాస్ రూములో విద్యార్థిని అల్లరి చేస్తోందని భావించి ఉపాధ్యాయుడు ఆమెను కొట్టాడు. తలకు గాయం కావడంతో బాలికను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పుంగనూరు టౌన్‌కు చెందిన హరి, విజేతలు దంపతులు. వీరికి కుమార్తె సాత్విక నాగశ్రీ (11) ఉంది. నాగశ్రీ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. సెప్టెంబర్ 10వ తేదీన క్లాస్ రూంలో విద్యార్థిని నాగశ్రీ అల్లరి చేస్తోందని హిందీ టీచర్ స్కూల్ బ్యాగ్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు.
అదే స్కూళ్లో పనిచేస్తున్న విద్యార్థిని తల్లి...
బాలిక తల్లి విజేత అదే స్కూల్లో పనిచేస్తుంది. అయితే కూతురు అల్లరి చేసినందుకు హిందీ టీచర్ మామూలుగానే కొట్టి ఉంటారని ఈ విషయాన్ని ఆమె సైతం పెద్దగా పట్టించుకోలేదు. అయితే, తలనొప్పితో బాధపడుతున్న నాగశ్రీ మూడు రోజులు స్కూలుకు వెళ్లడం లేదు. బాలికను తల్లిదండ్రులు పుంగనూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు బాలికను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసకువెళ్లాలని నాగశ్రీ తల్లికి సూచించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి
బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో బాలికకు మెడికల్ టెస్టులు చేసి, ఎక్స్‌రే తీశారు. విద్యార్థిని పుర్రె ఎముక ఫ్రాక్చర్ అయినట్లు ఎక్స్‌రేలో తేలింది. పుర్రె ఎముక చిట్లిపోయిందని డాక్టర్లు చెప్పడంతో బాలిక తల్లి షాకయ్యారు. కూతురికి బలమైన గాయం అయిందని సోమవారం రాత్రి విద్యార్థి తల్లి విజేత, బంధువులు స్కూల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతుర్ని ఇంత దారుణంగా కొట్టిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. చిన్నారులు తప్పు చేస్తే టీచర్లు బాధ్యతగా మందలించాలి గానీ అల్లరి చేస్తుందన్న కారణంగా కేజీల బరువుండే బ్యాగుతో తలమీద అంతలా కొట్టడం ఏంటని తోటి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.