Tirupati New Bus Terminal:  శ్రీనివాసుని సన్నిధానం తిరుపతిలో వరల్డ్‌క్లాస్ బస్ టెర్మినల్ రాబోతోంది. అత్యాధునిక హంగులతో కమర్షియల్ కాంప్లెక్స్ లు, బస్‌బేలు కలిపి ఉండేలా నిర్మించనున్నారు. రోజుకు లక్షమంది ప్రయాణికులను కూడా తట్టుకునే సామర్థ్యంతో ఈ బస్‌ టెర్మినల్ నిర్మాణం చేస్తారు.


తిరుపతి బస్‌ టెర్మినల్ డిజైన్లు పరిశీలించిన సీఎం చంద్రబాబు


ఆధ్యాత్మిక నగరి తిరుపతిని అధునాతనంగా తీర్చిదిద్దే ప్రణాళికను ప్రభుత్వం చేపట్టింది. దక్షణాది రాష్ట్రాల నుంచి తిరుపతికి పెద్ద ఎత్తున యాత్రికులు ఆర్టీసీ బస్సుల్లో తరలివస్తుంటారు. ప్రస్తుతం తిరుపతి బస్ స్టేషన్ సామర్థ్యం సరిపోవడం లేదు. అంతే కాకుండా ఈ బస్టాండ్ చాలా కాలం క్రితం నిర్మించింది. దీనిని ఇప్పటి హంగులతో అత్యంత ఆధునికంగా నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ఝమైంది. 13 ఎకరాల విస్తీర్ణంలో నూతన టెర్మినల్ నిర్మిస్తారు.  సీఎం చంద్రబాబు తిరుపతి బస్ టెర్మినల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.  నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో దీనిపై  అమరావతిలో సమీక్ష కూడా నిర్వహించారు. బస్ స్టేషన్ నమూనాలను పరిశీలించారు. నూతనంగా నిర్మించే బస్ స్టేషన్‌లో సుమారు 150 బస్సులు ఒకేసారి నిలిపి ఉంచేలా బస్ బే ఉండాలని, హెలిపాడ్ సౌకర్యంతో పాటు, రోప్ వే, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్, మల్టీ ప్లెక్స్‌లతో డిజైన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు. బస్టాండ్ నమూనాలను పరిశీలించిన ఆయన వాటిని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు.


ఆల్ట్రా మోడరన్ బస్‌స్టేషన్‌


తిరుపతిలో నిర్మించే బస్‌స్టేషన్ అత్యంత ఆధునికంగా ఉండనుంది. ఇంత వరకూ రాష్ట్రంలో ఎక్కడా లేని స్థాయిలో దానిని నిర్మిస్తారు. ఒకేసారి 150 బస్సులను ఇక్కడ నిలపొచ్చు. 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన ఈ బస్ స్టేషన్ కనీసం లక్ష మంది నిత్యం రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మాణం చేస్తారు. రాబోయే రోజుల్లో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయి కాబట్టి ప్లాట్‌ఫామ్‌ల వద్దే ఎలక్ట్రిక్ చార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. అంతే కాదు దీని అవసరాలకు సరిపడా విద్యుత్‌ను అందించేందుకు బస్‌స్టేషన్‌పై సోలార్‌ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు.  బస్ టెర్మినల్‌లోనే భారీ మాల్స్, మల్టిప్లెక్స్‌లు కూడా ఏర్పాటు చేస్తారు. తిరుపతి నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లే బస్సులు, అక్కడ నుంచే తిరుమలకు వెళ్లే బస్సుల కోసం రెండు విభాగాలు ఏర్పాటు చేస్తారు. 


కేంద్రం ఇంతకు ముందే తిరుపతిని స్మార్ట్‌సిటీగా ప్రకటించింది.  కొన్నాళ్లుగా తిరుపతిలో రోడ్ల విస్తరణ, అలిపిరి వద్ద ఘాట్ రోడ్డు విస్తరణ చేపట్టారు. తిరుపతిలో ట్రాఫిక్ రద్దీ నివారణకు భారీ గరుడ వారధిని నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన అనేక సముదాయాలతో పాటు.. ఇప్పుడు ఈ కొత్త బస్‌టెర్మినల్ నగరానికి మరింత శోభను తీసుకురానుంది